హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజార్టీ లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను.. బిజెపి 35 నుండి 40 స్థానాలు.. కాంగ్రెస్ 25 నుండి 30 .. ఆమ్‌ఆద్మీ 1 నుండి 2, ఇతరులు 2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అక్టోబర్ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పీపుల్స్‌పల్స్ సంస్థ సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్ యూనివర్సిటీ, పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ స్కాలర్స్‌తో కలిసి 9 జిల్లాల్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 120 పోలింగ్ స్టేషన్లలో..1500 సాంపిల్స్‌తో సర్వే నిర్వహించింది. జనాభిప్రాయం ప్రకారం విస్పష్టంగానే అధికార బిజెపి సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్ర జనాభాలో ప్రధానంగా ఉన్న రైతాంగం, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కార్మికులు, కూలీలు… తదితరులందరినీ తగు నిష్పత్తిలో కలుస్తూ శాస్త్రీయంగా సేకరించిన జనాభిప్రాయం అక్కడి పరిస్థితిని ప్రతిబింబించింది. ఇంకా ఇప్పటికి ఖరారు కాని అభ్యర్థిత్వాలు, తాజా ఎన్నికల హామీలు, ఆఖరు నిమిషపు ఎత్తుగడలు… వంటి కీలకాంశాలు తుది ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది తేలాల్సి ఉంది .
మూడున్నర దశాబ్దాల రికార్డును హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు కొనసాగిస్తారా? బ్రేక్ చేస్తారా? అన్నది ఇపుడు దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం దాన్ని చూడబోతే … ప్రతి ఎన్నికలప్పుడూ ప్రత్యర్థి పార్టీకి అధికారం మార్చే పద్దతికి రాష్ట్ర ప్రజలు విరామం ఇచ్చి, ప్రస్తుత పాలకపక్షం బీజేపీకే తాజా ఎన్నికల్లోనూ తిరిగి పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నటు సర్వే రిపోర్టు చెబుతోంది.
ఈ కొండలు,లోయల రాష్ట్రంలో ఎప్పటిలాగే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా తలపడుతున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించాలని ఉవ్విల్లూరుతూ, తగు ప్రణాళికలు రచిస్తున్న ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీకి ప్రచారంలో, ప్రజాదరణలో జనక్షేత్రం నుండి స్పందన కరువైంది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పాగా తర్వాత ఇరుగుపొరుగునున్న చిన్న రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ పై దృష్టి సారించినట్టు ‘ఆప్’నేతలు చెప్పుకుంటున్న .. క్షేత్ర స్థాయిలో ప్రభావం మాత్రం కనిపించడం లేదు. మిగతా రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీ పడే స్థాయిలో లేవు. వాటి ప్రభావం కూడా అంతంతే. ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు సుదీర్ఘ కాలంగా నేతృత్వం వహించిన సీనియర్ నాయకులు వీరభద్రసింగ్(మరణం), ప్రేమ్‌కుమార్ ధుమాల్(వృద్దాప్యం) ఛత్రఛాయ లేకుండా, తదుపరి తరం హయాంలో జరుగుతున్న ఎన్నికలివి. దేశ వ్యాప్తంగా ‘ఎన్నికల రాజకీయాల్లో’ బీజేపీ బలపడుతూ ఉంటే, మరో పక్క కాంగ్రెస్ బలహీనపడుతున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికలు వచ్చాయి.
పన్నెండు జిల్లాలుగా విస్తరించి ఉన్న ఈ కొండలు లోయల రాష్ట్రంలో గ్రామీణ జనాభాయే యెక్కువ. 68.64 లక్షల మొత్తం జనాభాలో, 3226 గ్రామ పంచాయతీలూ, హ్యామ్లెట్లలో కలిపి 89 శాతం జనాభా నివసిస్తోంది. ఎస్సీలు 25 శాతం మంది ఉన్నారు. బిజెపి ప్రభుత్వంపై నిర్దిష్టంగా బలమైన ప్రజావ్యతిరేకత ఏమీ లేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ గడచిన కాలంలో నిర్మించిన ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేవు. రాష్ట్రంలో, కేంద్రంలోనూ అధికారంలో ఉండటం బీజేపీకి కలిసివచ్చింది. అందుకే బిజెపికి 44 శాతం ఓట్‌షేర్, కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్‌షేర్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమ్‌ఆద్మీ పార్టీకి 6శాతం ఓట్‌షేర్ పొందే అవకాశాలున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు బిజెపికి బలమైన యంత్రాంగం ఉంది. దానికితోడు పటిష్ట పునాదులతో ఆరెస్సెస్ వ్యవస్థ వేళ్లూనుకొని ఉండటం పార్టీకెంతో దన్నుగా ఉంది. ఇది కాకుండా బీజేపీకి రాష్ట్రంలో నిశ్శబ్ద ఓటు బ్యాంక్ ఉంది, తుది ఫలితాన్ని అదే పార్టీకి అనుకూలంగా ప్రభావితం చేసే అవకాశాలున్నట్టు పీపుల్స్‌పల్స్ మూడ్‌సర్వేలో స్పష్టమౌతోంది.