×

Electioncommission:

భారత ఎన్నికల సంఘం (ఈసీ) పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోంది. తన నిష్పాక్షితను నిరూపించుకొని స్వతంత్ర ప్రతిపత్తిని పునః ప్రకటించుకోవాల్సి ఉంది. తన నిర్వాకాలు సతతం రాజకీయ పక్షాలతోనే అయినా రాజకీయ మకిలి అంటకుండా పారదర్శకతతో ప్రజలకు విశ్వాసం కలిగించాలి. రాజకీయాలను సాకుగా చూపి విమర్శల్ని తేలికగా కొట్టేయడం కాకుండా తగు సమాచారంతో ఖండిరచాలి. విపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు దుమారమే లేపాయి! నింద ఎంతో? నిజం ఎంతో? నిలకడగా తేలుతుంది. ఒక చోట్ల ఓట్ల జోడింపును వ్యతిరేకించి, అటువంటిదే మరోచోట ఓట్ల తొలగింపును రాహుల్ అడ్డుకోవడం చూసేవారికి వింతగా కనిపిస్తోంది. దీనికాయన సమాధానం చెప్పాలి. ఫేక్ ఓట్లకు సంబంధించి బెంగళూరులో తప్పయింది పాట్నాలో తప్పు కాకుండా పోతుందా? అక్కడ ప్రశ్నించి ఇక్కడ సమర్థించడం హేతుబద్దంగా లేదు. ప్రజస్వామ్య సౌధానికి పునాది ఎన్నికల ప్రక్రియ అయితే దాన్ని పటిష్టంగా ఉంచాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికెంతుందో రాజకీయ పక్షాలకూ అంతే ఉంది. సమాచారం సజావుగా ప్రజాక్షేత్రంలోకి వస్తే… ప్రజలే ప్రతి ఎన్నికనూ ఒక వేదిక చేసుకొని పాలు-నీరు వేరు చేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తారు. అందుకు భూమిక ఏర్పరచాల్సింది నిష్పాక్షిక, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ‘భారత ఎన్నికల సంఘమే! ’

ప్రజాస్వామ్యంలో నిష్పక్ష, స్వతంత్ర ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగకర్తలు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)కి ప్రత్యేక హక్కులు, అధికారాలూ కల్పించారు. అధికార పార్టీతో సహా ఎవరి, ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా బాధ్యతలు నిర్వహించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. అలాంటి ఎన్నికల సంఘంపై ఇటీవల ఎన్నో ఆరోపణలు, విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటూ దాని అధికారాలను దుర్వినియోగ పరుస్తోందని విమర్శలు వినిపిస్తున్న వేళ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రక్రియపై ఢిల్లీలో ఇచ్చిన ప్రజంటేషన్ తో మరిన్ని సందేహాలు మొదలయ్యాయి. ఈ అంశాలను ఎన్నికల సంఘం కేవలం రాహుల్ గాంధీ సమస్యలుగా పరిగణించకుండా సందేహాలను నివృత్తం చేస్తే కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. లేకపోతే స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంస్థ ఒత్తిడికి లొంగుతోందనే అనుమానాలకు తావిచ్చినట్టవుతుంది.


సరైన ఓట్లేనా చెప్పండి :

లోక్ సభలో విపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 2024 పార్లమెంట్ ఎన్నికలు మొదలుకొని హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు పలు సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని కొట్టివేస్తూ వస్తున్న ఎన్నికల సంఘం ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ఇపుడైనా బాధ్యతాయుతంగా సరైన సమాధానాలిస్తే జవాబుదారీగా నిలిచినట్టుంటుంది. పాలక బీజేపీ, ఎన్నికల సంఘం కూడబలుక్కొని మోసపూరితంగా ఓట్ల చోరీ చేయడంతోనే లోక్ సభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలకు మించి గెలిచిందని రాహుల్ గాంధీ కొన్ని ఉదాహరణలతో వివరించారు. ఇందుకు ఆయన బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మహాదేవపురం అసెంబ్లీ సెగ్మెంట్ ను ఎంపిక చేసుకొని ప్రస్తావించారు. ఈ సెగ్మంట్లో ఐదు విధాలుగా నిబంధనలను దుర్వినియోగపరుస్తూ లక్షకు పైగా దొంగ ఓట్లను సృష్టించారని చెప్పారు. వివరాలతో ఆయన చేసిన ఆరోపణల్ని కొట్టి పారేయకుండా ఈసీ సమగ్రంగా బదులీయాల్సిన అవసరం ఉంది. రాహుల్ చూపించిన డాక్యుమెంట్లలో కొన్ని అంశాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే ఒక్క నియోజకవర్గంలో ఒకే ఓటరు పలుమార్లు రిజిస్టర్ చేసుకోవడం, ఒకే ఎపిక్ నెంబరు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండడం, ఒకే చిరునామాలో అసాధారణంగా అనేక మంది ఓటర్లుగా నమోదు కావడం వంటి అంశాలు తీవ్రమైనవే.
ఒక ఓటరు ఎపిక్ నెంబరు వేర్వేరు రాష్ట్రాల్లోనూ ఉండడం పెద్ద సమస్య కాదంటూ, ఎపిక్ సమస్యను కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ప్రారంభం నుండి సరిచేసే ప్రక్రియను మొదలెట్టింది. మరోవైపు పార్టీ కార్యకర్తలు బూత్ స్లిప్పులు చూసి, ఒకే వ్యక్తి పేరుతో ఒకే ఎన్నికల కేంద్రంలో చాలా ఓట్లు వేయించినట్టు రాహుల్ గాంధీ చెబుతున్న మాటే నిజమైతే ‘ఒక వ్యక్తి-ఒక ఓటు’ అనే సూత్రానికి తిలోదకాలు ఇచ్చినట్టే. తక్కువ కాలంలో అకస్మాత్తుగా ఓటర్ల నమోదులో అసాధారణ పెరుగుదల బీజేపీ గెలుపుకు దోహదం చేసిందనే విమర్శలున్నాయి. ఓట్ల చోరీ ఒక మహాదేవపురానికే పరిమితం కాకుండా, బీజేపీ తేలికగా గెలవలేని అనేక చోట్ల కూడా ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఓ పద్దతి ప్రకారం కుట్రలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే తరహా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా, ఇందుకు మహాదేవపూరంలో చూపినట్టు రుజువులతో కూడిన వివరాలను బహిర్గతం చేయలేదు.


నిజమేమిటో తేలాలి :
రాహుల్ గాంధీ ప్రజంటేషన్లో పేర్కొన్న లోపాల ద్వారానే బీజేపీ పలు ఎన్నికల్లో విజయం సాధిస్తోందని నిందించలేము, నిరూపించలేము. 2023 శాసనసభ ఎన్నికల్లో మహాదేవపురం సెగ్మంట్ ను బీజేపీ అభ్యర్థి మంజుల 44 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఈ సెగ్మంట్లో ఆ పార్టీ 1,14,000 మెజర్టీ సాధించింది. అయితే ఇక్కడ పరిశీలించాల్సిన అంశం సంవత్సర కాలంలో ఓటర్ల జాబితాలో అదనంగా చేరింది 52,600 ఓటర్లు మాత్రమే. ఈ రెండు ఎన్నికల్లో వాస్తవాలను గమనిస్తే ఓటు వేసిన వారి సంఖ్య కేవలం 20,000 మాత్రమే పెరిగింది. కాబట్టి ఈ గణాంకాలనే పరిగణలోకి తీసుకొని మోసం జరిగిందని నిర్దారించలేము.
ఎన్నికల ప్రక్రియపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం స్పందన సందేహాత్మకంగానే ఉంటోంది. ‘మేం ఏ వివరాలూ ఇవ్వనవసరం లేదు, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు’ వంటి పెలుసు స్పందనలు అనుచితం. ఆరోపణలు తప్పని ఆధారాలతో నిరూపించాల్సిన ఎన్నికల సంఘం రక్షణాత్మక ధోరణితో ఇవన్నీ ‘తప్పుదోవ పట్టించేవి’ అంటూ వ్యాఖ్యానిస్తూ, దాటవేత వైఖరీతో వ్యవహరిస్తోంది. ఓట్ల చోరీ ఆరోపణలు చేసిన రాహుల్, ఆయన వాదన నిజమని నమ్మితే, అఫిడవిట్ పై సంతకం చేసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఎన్నికల సంఘం చెప్పింది. తాను నమ్మింది నిజమనే భావనతోనే రాహుల్ ఆరోపణలు చేశారు. అవన్నీ నిజమని నమ్మితే అఫిడవిట్ ఇవ్వండని చెప్పే బదులు, ఎన్నికల సంఘం చొరవ తీసుకొని ఆ ఆరోపణలు నిరాధారమని నిరూపిస్తే బాగుంటుంది. దీనిపై న్యాయ నిపుణులు స్పందిస్తూ, ఇందుకు అవిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. మరో పెద్ద సమస్య ఏమంటే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను పీడీఎఫ్ ఇమేజ్ ఫైళ్ల రూపంలో విడుదల చేస్తోంది. ఈ జాబితాల్లో సమాచారం వెతకడం, పరిశీలించడం క్లిష్టమైన ప్రక్రియ. దీనికి బదులు టైప్ చేసిన, వెతకగలిగే సౌకర్యంతో డేటా ఇస్తే రాజకీయ పార్టీలు, రీసెర్చ్ సంస్థలు, పౌర సంస్థలు జాబితాను విశ్లేషించి, లోపాలను గుర్తించడం తేలికవుతుంది. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రధానంగా సెల్ఫ్ డిక్లరేషన్లపై ఆధారపడి ఉంది, కానీ వాటిని తనిఖీ చేయడానికి పటిష్ట పద్ధతులు లేవు.


ముమ్మర సవరణ తేల్చేనా? :
మహాదేవపురం సెగ్మంట్ పై వచ్చిన సందేహాలు నివృత్తం చేయడానికి ఇంటింటి పరిశీలనే సరైన మార్గం. బీహార్లో ఎన్నికల సంఘం ఇపుడు జరుపుతున్న ‘ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ’ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ ప్రక్రియను విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని, ఫేక్ ఓట్లతో గెలుస్తున్నారని ఆరోపిస్తున్న వారు వాటి తొలగింపు ప్రక్రియను అడ్డుకోవద్దు. బెంగళూరులో ‘చెడు’ అయింది పాట్నా లో ‘మంచి’ అవుతుందా? తప్పు ఎక్కడైనా తప్పే! అయితే ఈ సవరణలు, పరిశీలనలు హడావుడిగా చేస్తే మాత్రం అసలైన ఓటర్ల పేర్లు తొలిగిపోయే ప్రమాదాలుంటాయి. బీహార్లో ప్రస్తుత ప్రక్రియ డేటాను పరిశీలిస్తే అపోహలకే కాదు అనుమానాలకూ తావుంది. ఒక కేస్ స్టడీ ప్రకారం, అక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా తొలగించబడ్డారు. వృత్తిరీత్యా మహిళల కంటే పురుషులే అధికంగా వలసలు వెళ్తారు. అధికంగా మహిళల పేర్లు తొలగింపంటే చదువురాని, వెనుకబడిన వర్గాల వారికి అన్యాయం జరిగినట్టు కనిపిస్తోంది. ఎన్ఎహెచ్ఎస్ అధ్యయన గణాంకాల ప్రకారం బీహార్లో 15-49 మధ్య వయస్కులైన మహిళల అక్షరాస్యత కేవలం 55 శాతమే అనేది ఇక్కడ గమనార్హం. హేతుబద్ధ విమర్శలకు ఈసీ తగిన సమాధానమివ్వాలి.
సరైన జాబితాతోనే సరిపోదు :
ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం, తొలగించడంలో అవకతవకలు మన ఎన్నికల సమస్యలలో ఒక భాగం మాత్రమే. ఎన్నికల నిర్వహణలో ఇంకా చాలా లోపాలున్నాయి. ఎన్నికల ఖర్చుల నియమ నిబంధనలను, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను కఠినంగా అమలు చేయకపోవడం ఇక్కడ పెద్ద లోపం. ఈవీఎమ్ లలో వీవీపాట్స్ స్లిప్పులలో కొన్నే శాంపిలుగా తీసుకొని లెక్కించడంతో ఓటింగ్ సంఖ్యపై అనుమానాలొస్తున్నాయి. అంతేకాక వీవీపాట్స్ లోడిరగ్ లో పటిష్ట టెక్నికల్ భద్రత లేకపోవడం, ఈవీఎమ్ సాఫ్టవేర్, భద్రతా ప్రక్రియలను స్వతంత్ర నిపుణుల ద్వారా పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ముందుకు రాకపోవడం, పోలింగ్ కేంద్రాల్లో సీసీటీపీ ఫుటేజీలను భద్రపరచడంలో నిర్లక్ష్యం, పోలింగ్ శాతం వివరాలను ప్రకటించడంలో ఆలస్యం, ఎవరైనా విమర్శలు చేస్తే దాన్ని దాడి చేస్తున్నట్టు పరిగణించడంతో ఎన్నికల సంఘంపై, అధికారులపై ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల వల్ల ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది.
భారత ఎన్నికల సంఘంపై విశ్వసనీయత పెరగాలంటే కేవలం సాంకేతిక ఘనతకు పరిమితమైతే సరిపోదు. పక్షపాతిరహితంగా, పారదర్శకంగా వ్యవహిరిస్తుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలి. అంతేకాక ఎన్నికల సంఘంలో అంతర్గతంగా కూడా ప్రక్షాళన జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఎలక్షన్ కమిషన్ కమిషనర్ల నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తిని సెలక్షన్ కమిటీలో చేర్చాలనే సుప్రీం కోర్టు సిఫార్సును ప్రభుత్వం పక్కనపెట్టింది. ఏదైనా పార్టీ, ఎవరైనా నేత ఆరోపణలు చేసినప్పుడు హడావుడి చేయకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలి. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలతో ఎన్నికల ప్రక్రియ మొత్తం మోసమని చెప్పలేం. ఇదే సమయంలో ఆయన చూపించిన కొన్ని రుజువులు ఎన్నికల వ్యవస్థలో లోపాలను బట్టబయలు చేస్తున్నాయి. వీటిని రాజకీయ కోణంలో కొట్టివేయకుండా, స్ఫూర్తిగా తీసుకొని లోపాలున్న చోట్ల దిద్దుబాటుకు, చికిత్సకు ప్రాధాన్యతివ్వాలి.
ఎవరో విమర్శించారని కాకుండా ఎన్నికల ప్రక్రియలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇందుకోసం ఓటర్ల జాబితాపై సమగ్ర పరిశీలన, శాస్త్రీయ అధ్యయనం, తగిన సనరణ జరగాలి. పూర్తి డేటాను పారదర్శకంగా అందుబాటులో ఉంచాలి. ఈవీఎమ్ లపై విమర్శలు లేకుండా తిప్పికొట్టేందకు సాంకేతికంగా మరింత బలపడాలి. ఎన్నికల సంఘం తరచూ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ వారి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. ఈసీ తమపై వస్తున్న ఆరోపణలను ‘ఈజీ’గా తీసుకోవద్దు. విమర్శలు, ఆరోపణల్ని సమీక్షించుకుంటూ జవాబుదారీగా ఉండాలి. లేదంటే ఎన్నికల సంఘం ప్రజల్లో నమ్మకం కోల్పోవడమే కాకుండా అది ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని ముప్పుగా పరిణమించే ప్రమాదముంది.


-దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, డైరక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole