తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ జోరుమీదుంది. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. విజయపరంపరను ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో ఢీకొట్టొచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటిదాకా కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే తామూ అనుసరించాలని బీజేపీ పెద్దలు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేసి.. అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
కాగా బలమైన అభ్యర్థులు ఉంటే టిఆర్ఎస్ను ఓడించడం తేలికని దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు రుజువు అయిన నేపథ్యంలో పార్టీ ఆదిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దుబ్బాకలో విజయంతో మెదక్ జిల్లాలో, హుజురాబాద్ విజయంతో కరీంనగర్ జిల్లాలో బీజేపీ పుంజుకున్నట్లు.. నియోజకవర్గాలకు చెందిన నేతలు అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం.ఇందులో భాగంగానే బీజేపీ నేతలు అక్కడ సమావేశం ఏర్పాటు చేసి.. అధికార పార్టీ పై విమర్శలు గుప్పించారు.
ఇక ఇదే జోష్ ను 2023 వరకు కొనసాగిస్తే.. అధికారంలోకి రావడం అంతే కష్టమైన పని ఏం కాదన్నాది బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట.
మరోవైపు టిఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు కమలం నేతలతో టచ్ లో ఉన్నారని వినిపిస్తున్న మాట. అలాంటి వారితో ఉప ఎన్నికల్లో పోటీ చేయిస్తే గెలుపు గ్యారంటీ అనే ధీమాలో బీజేపీ నేతలు ఉన్నట్లు.. రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాపై బీజేపీ నేతల ఫోకస్..?
ఉమ్మడి నల్లగొండ జిల్లాపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తొంది. ఎందుకంటే మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది.బీజేపీ అంచనాలకు కారణం లేకపోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాహాటంగానే కాంగ్రెస్‌పై పలు సార్లు విమర్శలు గుప్పించడం.. కేసీఆర్‌ని ఓడించాలంటే అది బీజేపీకే సాధ్యమని ఆయన గతంలో ప్రకటనలు చేశాడు. ఇప్పుడు ఈటల గెలుపు అనుభవంతో తాను రాజీనామా చేస్తానని సన్నిహితుల వద్ద రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించినట్లు సమాచారం. బీజేపీ అధిష్ఠానం సహకారం అందిస్తే కమలం గుర్తుతో విజయం తనకు నల్లేరుపై నడకే అని రాజగోపాల్ రెడ్డి అంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దింపి మునుగోడు ఉపఎన్నిక గెలుచుకుంటే నల్లగొండ జిల్లాలోనూ తమ ప్రాబల్యం పెంచుకోవచ్చు అనేది కమలనాధుల వ్యూహంగా కనిపిస్తోంది….
మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి, కర్నే ప్రభాకర్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు చెరాయనేది కార్యకర్తల టాక్. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక వస్తే పార్టీ పరిస్థితి ఏంటన్నది పార్టీలో జరుగుతున్న చర్చ.