కాంగ్రెస్ లో నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి..!

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. దుబ్బాక, హుజురాబాద్‌ లో ఘోర ఓటమితో నిరాశలో ఉన్న కార్యకర్తలకు నేతల మధ్య విభేదాలు మింగుడు పడడంలేదు. తాజాగా జనగామ లొల్లి కాక రేపుతోంది. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డీసీసీ అధ్యక్షుడు జంగారాఘవ రెడ్డి ల మధ్య నడుస్తున్న ఫైట్….. షోకాజ్ నోటీసు వరకు వెళ్లింది. ఈ ఇష్యూలో హస్తం నేతలు రెండుగా చీలిపోయి బలప్రదర్శనలకు దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో జంగా రాఘవరెడ్డి కి మద్దతుగా ఎంపీ కోమటిరెడ్డి ఇచ్చిన అల్టిమేటం .. పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ అసలు విషయానికి వస్తే .. జనగామ నియోజకవర్గం నుంచి అనేక పర్యాయాలు గెలుస్తూ వచ్చిన పొన్నాల లక్ష్మయ్య .. అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ మంత్రిగా కూడా పని చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడు గా ఉన్న పొన్నాల పీసీసీ అధ్యక్షుడు గా కూడా పనిచేశారు. అయితే 2014 .. 2018లో రెండుసార్లు వరుసగా ఓడిపోయారు. దీంతో నియోజకవర్గం వైపు పెద్దగా దృష్టి పెట్టడం మానేశారు.
కాగా పొన్నాల లక్ష్మయ్య తరువాత పీసీసీ పగ్గాలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కి…….. పొన్నాలకు కొద్దిగా గ్యాప్ ఏర్పడింది. దీంతో ఉత్తమ్ జనగామ కేంద్రంగా పొన్నాలకు కౌంటర్ పాలిటిక్స్ ను స్టార్ట్ చేశారు ఉత్తమ్. పొన్నాల లక్ష్మయ్య ప్రమేయం లేకుండా నాన్ లోకల్ గా ఉన్న జంగా రాఘవరెడ్డిని జనగామ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. డీసీసీగా నియామకం తరువాత జంగా రాఘవరెడ్డి జనగామ పై సీరియస్ గా దృష్టి పెట్టి .. ఇక తానే అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. పీసీసీ గా ఉన్న ఉత్తమ్ అండదండలు జంగా కు ఉండటంతో అక్కడ పొన్నాలను డమ్మీ చేయడం స్టార్ట్ అయ్యింది.

ఇక తాజాగా నియోజకవర్గంలో మండల,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల ను జంగా రాఘవరెడ్డి పొన్నాల ప్రమేయం లేకుండా అంతా తన వర్గం వారిని వేసుకున్నారు. దీంతో పంచాయితీ కొత్త పీసీసీ బాస్ రేవంత్ వద్దకు చేరింది. అయితే రేవంత్ జంగా నియామకాలను రద్దు చేసి .. కొత్తగా పొన్నాల ఇచ్చిన లిస్ట్ ను ఫైనల్ చేశాడు. దీంతో ఇరు వర్గాల పంచాయితీ ముదిరి పాకాన పడింది. తాజాగా పార్టీ శిక్షణా తరగతులలో జంగా వర్గీయులు గొడవకు దిగడంతో ఇష్యూ కాస్తా సీరియస్ అయ్యింది. ఈ అంశాన్ని పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం లో చర్చించారు. సమావేశంలో మెజారిటీ నాయకులు జంగా రాఘవరెడ్డి చర్య క్రమశిక్షణ రాహిత్యంగా అభిప్రాయ పడ్డారు. దీంతో ఆయనకు షోకాజ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయ్యింది.

అయితే జంగా రాఘవరెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలన్న ప్రతిపాదనని ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోమటిరెడ్డి ఒక అడుగు ముందుకేసి .. జంగా కు షోకాజ్ నోటీసు ఇస్తే తాను పార్టీకి రాజీనామా చేస్తానని అల్టిమేటం ఇచ్చారు. వెంకట్ రెడ్డి మాటలతో ఒక్కసారిగా హీట్ రాజుకుంది. అయితే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇలాంటి బెదిరింపులకు తలోగ్గుతుందా లేక కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా అన్న అంశం పై తీవ్ర చర్చ నడుస్తోంది.