ఎడతెరిపిలేని వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండ్రోజులపాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. కొన్నిజిల్లాలో రెడ్ అలర్ట్.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఏకధాటి వర్షాలకు కేరళలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎర్నాకులం జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం పినరయి విజయన్ సూచించారు. కొండచరియలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. పునరావాస కేంద్రాల్లో అధికారులు ఆహార, నివాస ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వర్షాల దృష్ట్యా మూడు నాలుగు రోజుల పాటు శబరిమల ఆలయానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని కలెక్టర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు.