Atheist: మతదూషణ నేరమైంది.. మానవత్వానికి శిక్ష ఖరారైంది..!

విశీ:  ఛాందసవాదం ఏ మతంలో ఉన్న అది దాని ప్రభావం చూపుతుంది. ప్రశ్నించే గొంతుల్ని నొక్కి, నిరసన తెలిపే వాళ్లని బంధిస్తుంది. ఏ మతమూ అందుకు అతీతం కాకపోవచ్చు. మతం అనేది మనిషిని మింగే భూతంగా మారితే అవస్థలు తప్పవు‌. ఇరాన్ దేశంలో జరిగిన ఈ ఘటనే అందుకు సాక్ష్యం. 

సోహెల్ అరబీది ఇరాన్. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్ననాటి నుంచి సోహెల్‌ది ప్రశ్నించే తత్వం. అతనికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. స్కూల్ చదివే వయసులోనే ఒక స్టూడియోలో ఫొటోగ్రాఫర్‌గా పనికి కుదిరాడు. పగలు అక్కడ పని చేస్తూ రాత్రిపూట చదువుకునేవాడు. ఫోటోగ్రఫీ, జర్నలిజం చదవడంతోపాటు ఫిలాసఫీ, పాలిటిక్స్, సైన్స్ వంటి అంశాలపై ఆసక్తి కనబరిచేవాడు. ఆ క్లాసుల్ని శ్రద్ధగా వినేవాడు. సమాజంలో అసమానతలను అర్థం చేసుకుంటూ, వాటిని రూపుమాపేందుకు ఏదైనా చేయాలని తపన పడేవాడు. అందుకు తన కెమెరాను సాధనంగా ఎంచుకున్నాడు. ఊరంతా తిరిగి బాలకార్మిక వ్యవస్థ, పేదరికం, వేశ్యా వృత్తి వంటి అంశాలను చిత్రాలు తీసేవాడు. 

19 ఏళ్ల వయసులో అతను బాలకార్మికులు, డ్రగ్స్ అమ్మే బాలల చిత్రాలు తీసి, వాటిని రిపోర్ట్‌గా తయారు చేశాడు. ఈ కారణంగా అతణ్ని అరెస్టు చేసి ఏడాదిపాటు రహస్య ప్రదేశంలో ఉంచి చిత్రవధ చేసింది ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్). ఆ తర్వాత 27 ఏట మరోసారి అతణ్ని అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌లో తాను తీసిన చిత్రాలు అప్‌లోడ్ చేసి, నినాదాలు రాసినందుకు ఈ చర్య తీసుకున్నారు. ఈ ఇబ్బందులు భరించలేక చివరకు అతనే ఒక సొంత ఫోటో స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు. 

2013లో ఒక రోజు కొంతమంది ఐఆర్‌జీసీ ఏజెంట్లు అతని స్టూడియోపై దాడి చేసి చేశారు. అతని ఇల్లు, స్టూడియో సోదా చేశారు. ఆపై అతడి కళ్లకు గంతలు కట్టి జైలుకు తీసుకెళ్లారు. తీసుకెళ్తూ వారు అతనితో అన్న మాటల్ని సోహెల్ అనేకమార్లు గుర్తు చేసుకున్నాడు. “Look at your house for the last time!  You will never come back here!”. జైల్లో సోహెల్‌ని అనేక రకాలుగా బెదిరించారు. “ప్రవక్తను అవమానించిన నీలాంటి వాడు బతికి ఉండకూడదంటూ” భయంకరంగా హింసించారు. సోహెల్ పట్ల వారు అంత దారుణంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? 

ఇస్లాం మతంలోని అనేక అంశాలను ప్రశ్నిస్తూ దాదాపు వెయ్యి పేజీల వ్యాసాలు రాయడమే వారి దృష్టిలో అతను చేసిన నేరం. ఇరాన్ ప్రభుత్వం మతవ్యాప్తికి పెట్టినంత ఖర్చు బడులు, ఆసుపత్రులు కట్టించేందుకు పెట్టలేదని సోహెల్ ఆరోపణ. ప్రజలకు సరైన తిండి, సౌకర్యాలు ఇవ్వకుండా ఇమామ్‌లకు అంత భారీ కట్టడాలు ఎందుకని అతని ప్రశ్న. పేదరికం తట్టుకోలేక జనం కిడ్నీలు అమ్ముకుంటూ, స్త్రీలు వేశ్యలుగా మారుతున్నా ప్రభుత్వం మతవ్యాప్తి మీదే దృష్టి పెట్టిందని అతని వాదన. ఏదైతే ఇరాన్ ప్రభుత్వం దృష్టిలో Blasphemy(దైవ/మత దూషణ)గా ఉందో, అదే‌ అతను చేశాడు. దాదాపు 200 రోజుల విచారణ తర్వాత ఇస్లామిక్ కోర్టు ఆఫ్ జస్టిస్ అతనికి మరణశిక్ష విధించింది.

మరణశిక్షను నిరసిస్తూ అతను పైకోర్టుకు అప్పీలు చేసుకుంటే అక్కడ అతనికి రెండు సార్లు మరణశిక్ష విధించాలని తీర్పు ఇచ్చారు. ఒక శిక్ష దైవ దూషణ చేసినందుకు, మరో శిక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ప్రజల్ని ఆహ్వానించినందుకు. “మతరాజ్యాలన్నీ ఆ దేశ పౌరుల అమాయకత్వం, మూఢత్వం, మతఛాందసం మీద నడుస్తాయి. ఎవరైనా వాటిని కాదంటే వారికి భయం. అందుకే వారిని చంపాలని చూస్తారు” అనేది సోహెల్ మాట. అతనిపై వెలువడిన మరణశిక్ష తీర్పు అనేకమందిని కదిలించింది. సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున జనం అతనికి మద్దతుగా నిలిచారు. అనేక చోట్ల ప్రజలు నిరసన తెలిపారు. దాంతో కోర్టు అతని మరణశిక్షను రద్దు చేసి, ఎనిమిదేళ్ల కారాగార శిక్ష విధించింది. దాంతోపాటు ఇస్లాం మతానికి సంబంధించిన 13 పుస్తకాలు చదవాలని, రెండేళ్లపాటు Theology(వేదాంత శాస్త్రం) చదవాలని ఆదేశించింది.

జైల్లో తనకు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అనేకసార్లు ధర్నా చేశాడు సోహెల్. ఎన్నోసార్లు జైల్లో నిరాహార దీక్ష చేపట్టాడు. ఈ క్రమంలో అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ స్థితిలో ఇంకా దారుణమైన విషయమేమిటంటే, అతనికి సౌకర్యాలు కల్పించాలని కోరిన సోహెల్ తల్లిని సైతం ప్రభుత్వం అరెస్టు చేసి దాదాపు 18 నెలల పాటు జైల్లో ఉంచింది. తనతోపాటు తన తోటి ఖైదీలకు సౌకర్యాలు అందించాలని పోరాడిన సోహెల్‌పై ప్రభుత్వం మరిన్ని కేసులు పెట్టింది. ఆయన్ని భయంకరంగా హింసించింది. చివరకు 2023 మార్చిలో అతణ్ని విడుదల చేశారు.

పదేళ్ల పాటు సోహెల్ జైలులోనే గడిపాడు. భార్య అతనితో విడాకులు తీసుకోగా, దాదాపు ఆరేళ్ల నుంచి అతను తను కూతుర్ని చూడలేదు. అతని ఉద్యోగం పోయింది. ఆస్తులన్నీ కరిగిపోయాయి. అయినా తాను నమ్మిన సత్యాన్ని మాత్రం వదిలేది లేదని స్పష్టం చేస్తున్నారు. 

ఏదైనా మతం నచ్చకపోతే అందులో నుంచి బయటకు వచ్చే హక్కు అందరికీ ఉందని, ఏ మతమూ ఏ మనిషినీ కట్టేసి ఉంచకూడదని సోహెల్ అభిప్రాయం. మతం, దేవుడు వంటి అంశాల గురించి ధైర్యంగా మాట్లాడేవారికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు అవసరమని ఆయన మాట. అందుకే అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావాలని, తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలని అంటారు. ఇరాన్ ఏటా Blasphemy పేరిట అనేకమందిని అరెస్టు చేసి, హింసిస్తోందని, ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో నాస్తికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇదొక విప్లవానికి నాంది అని ఆయన వివరిస్తున్నారు.