విశీ : కథానిలయం 27వ వార్షికోత్సవంలో ఖదీర్‌గారు కొత్త కథకుల గురించి, కథాసాహిత్యంలో ఎప్పటికప్పుడు వస్తున్న యువత గురించి చెప్పాక ఆ విషయంపై చాలా చర్చ జరిగింది. చర్చ ఎప్పుడూ మంచిదే! కొత్త విషయాలు తెలుసుకునేందుకు అదే సరైన మార్గం. ఈ సమయంలో ఒక్క విషయం చెప్పాలని అనిపిస్తోంది.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరిగేటప్పుడు, వివిధ కథా వర్క్‌షాప్‌లు నిర్వహించినప్పుడు, ఏవైనా కథా సంకలనాలు విడుదలైనప్పుడు.. వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. అందరూ చాలా ఉత్సాహంతో ఉంటారు. తామూ రాయాలని కొత్తగా కొందరు ఆశపడుతూ ఉంటారు. అందులో కొంతమంది వచ్చి కథ రాయడం ఎలా? ఏం చదవాలి? ఎవరి నుంచి స్ఫూర్తి పొందాలి? రాస్తే ఎవరు వేస్తారు.. లాంటి విషయాలు అడిగి కనుక్కుంటారు. మరికొందరు నెంబర్ కనుక్కొని మరీ ఫోన్ చేసి మాట్లాడతారు. వాళ్ల మాటలు చూస్తే చాలా ఆశాజనకంగా ఉంటుంది. తప్పకుండా మంచి కథలు రాయగలరు అనిపిస్తుంది. తోచిన సూచనలు చెప్తాం. కట్ చేస్తే.. మళ్లీ వాళ్ల అజాపజా ఉండదు. మళ్లీ బుక్ ఫెయిర్‌కో, మరో కథా వర్క్‌షాప్‌కో వచ్చి ఆ పాత ఉత్సాహమే చూపుతారు. మళ్లీ అవే విషయాలు అడుగుతారు. రాస్తాం.. రాస్తున్నాం.. అంటారు. అంటూనే ఉంటారు. అదు ఒరు తొడర్ కథై! నాలాంటి వాడు కథ రాయమని అడుగుతాడేమోనని తప్పించుకు తిరిగేవారూ ఉంటారు.
2021 నుంచి 2023 దాకా నెలకు కనీసం ఇద్దరైనా నాకు ఫోన్ చేసేవారు. కథల గురించి, కథారచన గురించి అడిగేవారు. ఏం చదవాలి, ఎలా రాయాలి అనే విషయాల గురించి గంటలకు గంటలు మాట్లాడేవారు. కొందరికి నా దగ్గరున్న పుస్తకాలు కూడా పంపాను. చాలామందికి కథానిలయం నుంచి సేకరించిన కథల పీడీఎఫ్‌లూ పంపాను. అలా మాట్లాడిన వాళ్లలో Anand Nune Chinny Ajay Pubaka Pubaka మాత్రం కథలు రాశారు. ఈ ముగ్గురి కథలూ సారంగ వెబ్ పత్రికలో వేశాం. ‘కథలపొద్దు’ శీర్షికలో భాగంగా వాళ్లని ఇంటర్వ్యూ చేశాం. వాళ్ల కథలకు మంచి గుర్తింపు వచ్చింది. వాళ్లు మరిన్ని కథలు రాసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మిగిలిన వాళ్లలో చాలామంది ఏమయ్యారో తెలియదు. కథ రాశారా లేదా సమాచారం లేదు. వాళ్లు ఫేస్‌బుక్‌లో లేరా అంటే ఉన్నారు, ఉంటారు. కానీ ఒకప్పుడు తాము కథల మీద ఆసక్తి చూపామని, కథలు రాయాలని అనుకున్నామనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టు ఉన్నారు.
తెలుగులో బోలెడన్ని వెబ్ పత్రికలున్నాయి. అన్ని పత్రికలూ కొత్త కథకులను ఎంకరేజ్ చేస్తున్నాయి. కొందరు ఎడిటర్లు వ్యక్తిగతంగా మెసేజ్ చేసి “కొత్త కథకులు ఎవరు, మా పత్రికకు ఏమైనా రాస్తారా?” అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఏటా ఎవరో ఒకరు కథాసంకలనాలు తెస్తున్నారు. కథాసాహితి, సింగిడి రచయితల వేదిక, దళిత వార్షిక వంటివారు వివిధ చోట్ల ప్రచురితమైన కథల్లో ఉత్తమ కథల్ని పుస్తకాలుగా తెస్తే, రచయితల చేత నేరుగా రాయించి మరికొందరు సంకలనాలు వేస్తున్నారు. కొత్తగా కథలు రాయాలని ఆహ్వానిస్తున్నారు. ఎన్నోసార్లు కొత్త కథకుల కోసం వాకబు చేస్తున్నారు. కథ బాగుంటే వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా కొత్తవారిలో కథారచన పట్ల ఉత్సాహాన్ని ఎందుకు పెంచలేకపోతున్నాయో అర్థం కావడం లేదు. రాస్తే వేసేందుకు ఇన్ని వేదికలు, పుస్తకాలు అచ్చేసేందుకు ప్రచురణ సంస్థలు ఉన్నా కూడా వాళ్ల కథారచన ముందుకు ఎందుకు సాగదో తెలియదు. వాళ్ల బద్దకం, పని హడావిడి, దృష్టి నిలపలేకపోవడం.. ఇవేనా కారణాలు?
ఏదైనా ఒక రంగంలో కొంతకాలం ఏకాగ్రతతో పని చేస్తే తప్ప ఆ రంగంలో మనం పేరు సాధించలేం! పట్టు వదలకుండా సాధన చేస్తేనే రాణించగలం! కథారచనకు కూడా అది వర్తిస్తుంది. కొత్తగా రాయాలని అనుకునే కొందరు తాము రాసింది చూడమని పంపిస్తుంటారు. నాకు తెలిసిన మార్పు చేర్పులేవో చెప్తాను. కథని మరింత మెరుగ్గా చేసి తీసుకురమ్మంటాను. అంతే! ఆ తర్వాత వాళ్ల చిరునామా దొరకదు. ఏమైపోయారో అర్థం కాదు. ఒక్క కథతో సంచీ మూసేస్తారు. ఇంక కథారచన ముందుకు ఎలా సాగుతుంది? సాహిత్యంలో పేరెలా వస్తుంది? ఇక్కడ రాత్రికి రాత్రి పేరు రావడం, పుస్తకాలు తేవడం, అవార్డులు కొట్టడం సాధ్యమయ్యే పని కాదు. సంవత్సరాలకొద్దీ సాధన చేయాలి. తప్పదు. కనీసం నెలకు ఒక కథన్నా రాసి(ప్రచురించకపోయినా సరే), తెలిసినవారికి చూపించి, తప్పొప్పులు చర్చిస్తే కథారచన ఒంటబడుతుంది.
ఈసారి హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో కూడా కొందరు కలిసి కథారచన గురించి అడిగారు. చాలా ఉత్సాహం చూపించారు. ఆ పుస్తక వాతావరణంలో ఉండే మత్తో, మరేమిటో కానీ కథలు రాయడానికి అంతా సంసిద్ధం అంటారు. కట్ చేస్తే, ఆ తర్వాత వారానికి ఎవరెక్కడో, ఎవరి కథ ఎటో అర్థం కాదు. ‘కథలు రాయడానికి ముందు, ఆ కథారచనలో రుచి తెలుసుకోండి’ అంటుంటాను. అది తెలిస్తే, ఆ రుచి అర్థమైతే కథలపై ఇష్టత, గౌరవం పెరుగుతాయి. రోజూ కొంత టైం తప్పకుండా కథల కోసం కేటాయిస్తారు. లేకపోతే రాద్దాం.. రాద్దాం.. అనే మాటలతోనే బతుకు తెల్లారిపోతుంది. కథకులతో దిగిన సెల్ఫీలు, వాళ్లు పెట్టిన సంతకాలను చూస్తూ ‘మనం ఇలా ఎప్పుడవుతామా?’ అని ఆలోచిస్తూ గడపాల్సి వస్తుంది.