Nancharaiah merugumala senior journalist:“ఆంధ్రాలో కులగణనతోనైనా కాపుల ‘లెక్క’ తేలుతుందా?బిహార్‌లో యాదవులు ఎందరున్నారో చెప్పడమంత ఈజీ కాదు ఏపీలో కాపుగణన!”
ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కులాల జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం మొదలైంది. మొదట రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని (ఓబీసీలు) 139 కులాల జనాభా విడివిడిగా ఎంతో తేల్చడానికి ఈ ‘జాతిగత జనగణన’ (హిందీలో వాడే ఈ మాటలే బాగున్నాయి. కాపు జాతి అనే ముద్రగడ పద్మనాభం గారిని ఈ హిందీ పదాలు గుర్తుచేస్తాయి) చేస్తారని అనుకున్నారు. ఇప్పుడు అన్ని కులాల జనాభా లెక్కలు తేల్చే పని వాలంటీర్లు పూర్తిచేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జనాభా ఎంతో ప్రతి పదేళ్లకూ కేంద్ర సర్కారు జరిపే జనాభా లెక్కల సేకరణ ద్వారా నిర్ణయిస్తున్నారు. దేశంలో (అన్ని రాష్ట్రాల్లో) కుల గణన చేస్తే మొత్తంగా ఓబీసీల జనాభా ఎంతో స్పష్టమౌతుందని, దాని ద్వారా వెనుకబడిన కులాల జనానికి మేలు జరుగుతుందని బీసీ వర్గాలకు చెందిన వివిధ రాజకీయపక్షాల నాయకులేగాక ఇప్పుడు ఓబీసీల కొత్త ‘మసీహా’ (రక్షకుడు)గా అవతారమెత్తిన రాహుల్ గాంధీ కూడా కులగణన చేయాలని, ఓబీసీల సాధికారతకు ఇదే చక్కటి దారని చెబుతున్నారు. ఆయన ఇప్పుడు నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్, అఖిలేశ్ యాదవ్ వంటి ఓబీసీ నేతల జాతిగత జనగణన నినాదాన్ని పట్టుకుని 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతాలో కనీసం నూరు సీట్లయినే పడేలా చూడాలని తెగ కష్టపడుతున్నారు. ఆంధ్రాలో కుల గణన విషయానికి…రాష్ట్రంలో బీసీల మొత్తం జనాభా శాతంపై పెద్దగా వివాదాలు లేవు. దాదాపు సగం జనం బీసీలే అనే అంశంపై గొడవేమీ లేదు. ఇక లెక్క తేలాల్సింది కోటాలు, కాటాలు లేని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సముదాయం జనం ఎంతనే. ఈ కోటా లేని అగ్రకుల కాపులు (నాలుగు ఉప కులాలను కలుపుకుంటే) ఆరేడు శాతం నుంచి 27 శాతం వరకూ ఉన్నారని కాపు సంఘాలు, కాపు రాజకీయ నాయకులు చెబుతున్నారు. తెలుగునాట కమ్మ మీడియా నుంచి రెడ్డి మీడియా వరకూ కాపుల జనాభా ఏపీలో నాలుగో వంతు వరకూ ఉంటుందని అవకాశమొచ్చినప్పుడల్లా ‘వెల్లడిస్తున్నాయి’. తెలుగు పత్రికలు, తెలుగు టీవీ చానళ్లతో పోల్చితే ఇంగ్లిష్ మీడియాకు కాపులంటే కాస్త ఎక్కువ ఇష్టం. ఆంగ్ల దిపత్రికలు, మేగజీన్లు తమకు సంచలన వార్త రాయాల్సిన అవసరం పడినప్పుడల్లా–కాపుల్లో రగులుతున్న అసంతృప్తి, ఏ క్షణంలోనైనా బద్దలయ్యే అగ్ని పర్వతం కాపు సముదాయం వంటి హింసాత్మక శీర్షికలతో…కథనాలు రాస్తూ ఈ జాతి జనాభా 30 శాతం వరకూ ఉంటుందని వివరిస్తున్నాయి.
కాపులు 7 శాతమా? లేక 27 శాతమా? అనేది తేల్చడం మానవసాధ్యమా?
దాదాపు 20 ఏళ్ల క్రితం కాపు కులాలను బీసీల్లో చేర్చాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం తొలి నేత ర్యాగా కృష్ణయ్య గారు ఈ కులాల జనాభా ఆరేడు శాతం మించదని చెప్పేవారు. మొత్తంమీద తెలుగు రాష్ట్రాల్లో ఉజ్జోగాలు, విద్యాసంస్థల్లో కోటాలు లేని కాపుల జనాభా ఏపీలో ఖచ్చితంగా ఎంత అనే విషయం నేడు మొదలైన కులగణన శాశ్వతంగా తేల్చేస్తే– కాపు సోదరులతోపాటు సకల తెలుగు ప్రజానీకానికి మేలు జరుగుతుంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుల సామరస్యం పెరుగుతుంది. ప్రపంచానికి పాలస్తీనా సమస్యలా, ఇండియాకు కశ్మీర్ వివాదంలా తెలుగు రాష్ట్రానికి కాపుల గొడవ శాశ్వత సామాజిక–రాజకీయ సంక్షోభంలా మారకుండా నివారించడానికి జగన్ సర్కారు శుక్రవారం ప్రారంభించిన కులగణన తోడ్పడుతుందని కోరుకోవడం అత్యాశ కాదేమో. టీడీపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల విషయంలో తన చివరి ఐదేళ్ల పాలనా కాలంలో వారిని బుజ్జగించే, బురిడీ కొట్టించే పనులు (10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపు కులాలకు కేటాయిస్తూ జీవీ జారీ వంటి ఉత్తుత్తి నిర్ణయాలు) చేశారు. కాని, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపులను మాయ చేసే పనులు ఏవీ చేయకపోవడం ద్వారా ఈ కులస్తులకు మేలు చేశారనే అనుకోవచ్చు. రాయలసీమకే చెందిన మరో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి గారు కూడా తన చివరి పాలనాకాలంలో (1993–94) ముద్రగడ కాపోద్యమానికి పడి కాపులకు ఇతర బీసీ కులాలకున్న సౌకర్యాలు, కోటా ఇస్తున్నట్టు ఉత్తుత్తి ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ చెప్పినట్టు 2024 ఎన్నికలు ఆంధ్రా కాపుల భవితవ్యాన్ని తేల్చేసే ఎన్నికలు కాదుగాని, మెజారిటీ కాపుల ఓట్లు పడితే ఏపీలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రాగలదా? అసెంబ్లీ ఎన్నికల్లో కాపుల ఓట్లు కేవలం 10% వచ్చినా ఇతర వర్గాల ప్రజల ఆదరణతో ఒక పార్టీ 90కి పైగా సీట్లు కైవసం చేసుకోవడం సాధ్యమౌతుందా? వంటి ప్రశ్నలకు వచ్చే వేసవి ఎన్నికల్లో సమాధానం దొరికే అవకాశం ఉంది. కాబట్టి, ఏపీలో ఇప్పుడు జరిగేది కులగణనా? లేక కాపుల గణనా? అనే అనుమానం నా వంటి చాలా మంది నాన్ రెసిడెంట్ ఆంధ్రావాలాలకు (ఎన్నార్యేలు) వస్తోంది. అయినా ఐదున్నర కోట్ల జనాభా ఉన్న పెద్ద తెలుగు రాష్ట్రంలో వార్డు, గ్రామ వాలంటీర్లు– గోదావరి శెట్టి బలిజ సమాచార, పౌరసంబంధాల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పినట్టు పది పదిహేను రోజుల్లో పూర్తిచేయడం సాధ్యమౌతుందా? ఏదేమైనా ఆంధ్రాలో కాపుల లెక్క తీయడం అంత ఈజీ కాదు. ఎప్పటికీ లెక్కకు దొరకని సామాజివర్గాల్లో కాపులు ముందుంటారు మరి. అయితే, ‘రాజ్యాధికారం’ అనే మాట ఎత్తకుండానే ఎప్పుడూ సీఎం పదవిని కైవసం చేసుకునే రెడ్డి, కమ్మ కులాల నేతలు ఎప్పుడూ తమ జనాభా ఇంత అంత అని చెప్పుకోరు. జనాభా నిష్పత్తి ఆధారంగా అధికారంలో వాటా కోరడం అప్రజాస్వామికమనే స్పష్టమైన అవగాహన ఉండబట్టే ఈ రెండు కులాలే నేతలే ఎక్కువ మంది ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత ఏర్పడిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్నారు.