OBC: ‘ఓసీ’ ఎంపీలను చూసి ఓబీసీ ఎంపీలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారే!

Nancharaiah merugumala senior journalist:

తెలుగు నాట‘ఓసీ’ ఎంపీలను చూసి ఓబీసీ ఎంపీలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారే!

2019 ఆంధ్రప్రదేశ్‌ సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయాక, ఈ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఉరఫ్‌ సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ టీడీపీ నుంచి చీలిక పేరుతో బయటపడ్డారు. ఆ చీలికను నాటి రాజ్యసభ చైర్మన్‌ అయిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గుర్తించారు. అలాగే, చీలిక ప్రక్రియ పూర్తయ్యాక వారు నలుగురూ బీజేపీలో చేరడాన్ని వెంకయ్య గారు ఆమోదించారు. అలా, ఒక పద్దతిలో ఈ అగ్రకులాలకు చెందిన ఈ నలుగురు (చౌదరి, గరికపాటి కమ్మ అయితే, రమేష్‌ వెలమ, వెంకటేష్‌ కోమటి) బీజేపీలోకి గౌరవప్రదంగా చేరారు. రాజ్యాంగ, రాజకీయ విలువలు పాటించారు. కాని, ఈ తెలుగు నాయకులను అనుసరించడం చేతకాని వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) చెందిన ముగ్గురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీలు 2024 ఎన్నికల్లో సొంత పార్టీ ఘోర పరాజయం తర్వాత వ్యవహరిస్తున్నారు.

కొన్ని వారాల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకట రమణారావు, బీదా మస్తానరావు వైఎస్సార్సీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. చేపలు పట్టే వృత్తికి సంబంధించిన మత్స్యకార కుటుంబంలో పుట్టిన మోపిదేవి ఇటీవల విజయవాడలో తన కులపోళ్లతో సమావేశమై ఏం చేయాలో చెప్పాలని వారిని అభ్యర్ధించారు. ఈ సంఘీయుల సమావేశానికి మోపిదేవి కులానికే చెందిన టీడీపీ బందరు మంత్రి కొల్లు రవీంద్ర హాజరై తనకు బాగా సీనియర్‌ అయిన మోపిదేవి వెంకటరమణకు నైతిక మద్దతు ప్రకటించారు. ఇంకా రెండేళ్ల సభ్యత్వం ఉండగానే పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని మోపిదేవి వాపోయారు. నెల్లూరు యాదవ కుటుంబంలో పుట్టినాగాని సీఏ చదువుకున్న బీదా మస్తానరావు గారు చేపలు, రొయ్యలు ఇంకా వివరంగా చెప్పాలంటే ఆక్వాకల్చర్, రొయ్యలు, చేపల మేత వ్యాపారంలో కష్టపడి కుబేరుడయ్యారు. బీసీ అయిన ఈయన కూడా ఎందుకో ఆరేళ్లు సభ్యత్వం అనుభవించకుండా రెండేళ్లకే పదవికి రాజీనామా చేశారు.

ఇకపోతే మూడో బీసీ సభ్యుడు, జగమెరిగిన బీసీ నేత ర్యాగా కృష్ణయ్య గారు ‘బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అడ్డంకిగా ఉన్న రాజ్యసభ సభ్యత్వానికి నాలుగేళ్ల ముందే రాజీనామా చేస్తున్నాను,’ అని మంగళవారం ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ ముగ్గురు బీసీ నాయకులూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా పైన పేర్కొన్న నలుగురు వ్యవసాయాధారిత, వ్యాపార కులాలకు చెందిన ఎంపీల మాదిరిగా పార్టీని చీల్చి తమ చీలిక వర్గాన్ని టీడీపీలోనో, బీజేపీలోనే విలీనం చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదో వెల్లడిస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అంతేగాని, తెలుగునాట ఓబీసీ నాయకులకు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించినా వారు దాన్ని నిలబెట్టుకోలేరని, పదవీకాలం ఉండగానే ముందే తెలివి తక్కువగా రాజీనామా చేసి కూర్చుంటారనే చెడ్డపేరును మోపిదేవి, బీదా, కృష్ణయ్యలు మూటగట్టుకునే ప్రమాదం ఉంది.

Optimized by Optimole