Hyderabad:
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శాసనసభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో నియమించబడిన విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం ఆగస్టు 4న మంత్రివర్గం ఆ నివేదికను ఆమోదించి, శాసనసభ చర్చకు పెట్టింది. 665 పేజీలతో కూడిన నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలు, నిర్లక్ష్యం, వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం, నాణ్యత లోపాలు వంటి అంశాలను స్పష్టంగా ప్రస్తావించింది.
జస్టిస్ ఘోష్ కమిషన్‌తో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కూడా మేడిగడ్డ నిర్మాణ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలే కారణమని తేల్చిచెప్పింది. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొంది.
ఈ ప్రాజెక్టులో అంతర్ రాష్ట్ర అంశాలు, కేంద్ర సంస్థలు (వ്യാപ్కోస్, పీఎఫ్సీ, ఆర్ఈసీ) పాలుపంచుకోవడంతో పాటు డిజైన్, నిర్మాణం, ఆర్థిక వ్యవహారాల్లో జఠిలత ఎక్కువగా ఉండటంతో సీబీఐ విచారణ అవసరమని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో శాసనసభ చర్చ అనంతరం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అంతకుముందు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో నివేదికను సమర్పించి, చర్చను ప్రారంభించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థల మార్పు, మేడిగడ్డ స్పీయర్స్ కుంగిపోవడం, తదనంతరం ఘోష్ కమిషన్ నియామకం వరకు జరిగిన పరిణామాలను సభలో వివరించారు.
“విచారణలో ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా సీబీఐ దర్యాప్తు జరగాలని ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.