TelanganaCongress:
నెలల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కి కొత్త అధ్యక్షుడొచ్చారు. జోడు పదవుల్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ పరిణామం కాసింత ఊరట! ఇక, పార్టీ కిరీటం తలపైనుంచి తీసి, పాలనపై దృష్టి కేంద్రీకరించవచ్చు! పీసీసీ పీఠమెక్కనున్న మహేశ్కుమార్ గౌడ్ పాత నాయకుడే! కాకపోతే, పాత-కొత్త నాయకుల నడుమ సమన్వయ సాధన అవసరంతో పాటు పలు సవాళ్లు ఎదురవుతున్న కాలంలో ఆయనకు పీసీసీ పీఠం దక్కింది. పాలకపక్షంగా కాంగ్రెస్ను రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో ఐక్యంగా నడిపి, గెలిపించడమొక సవాల్! అంతకు ముందే, అందరికీ ఆమోదయోగ్యమైన పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పరచి, కాంగ్రెస్ పార్టీని క్రియాశీలంగా ఉంచడం మరొక సవాల్! ఇలాంటి సవాళ్లను, సీఎంతో సయోధ్య నెరిపి మహేశ్ గౌడ్ ఎలా అధిగమిస్తారన్నది కోటి రూకల ప్రశ్న!
వినాయక చవితి పర్వదినానికి ఒక రోజు ముందే పదవీయోగం పట్టిన మహేశ్కుమార్, సుబ్రహ్మణ్య స్వామి మార్గం కాకుండా వినాయకుడి బాటనే ఎంచుకున్నట్టున్నారు. ముల్లోకాలు, ముక్కోటి తీర్థాలు తిరిగి, మొదట వచ్చిన వారికి పట్టం కడతామని తలిదండ్రులైన శివపార్వతులు చెబితే, ఆ యాత్రకు తన వాహనమైన నెమలిపై బయలుదేరుతాడు సుబ్రహ్మణ్యేశ్వరుడని మన పురాణాలు చెబుతాయి. బాణ వంటి పొట్టతో, ఎలుకపై అన్ని లోకాలు-తీర్థాలూ తమ్ముడితో పోటీపడి తిరగలేనని గ్రహించిన వినాయకుడొక ఉపాయం ఆలోచించి, ఆచరిస్తాడు. ఆదిదంపతులైన తన తలిదండ్రుల చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేసి, తీర్థాలు తిరిగినంత సమాన పుణ్యాన్ని గడించి అక్కడికక్కడ విజేత అయ్యారన్నది ఆ కథ సారం! తన నియామక సమాచారం తెలిసిన నుంచి, గత మూడు రోజులుగా మహేశ్ గౌడ్ సకుటుంబ సమేతంగా కాంగ్రెస్ బడా నాయకుల ఇళ్లకు తిరుగుతూ, వారి ఆశీస్సులు పొందుతున్నారు. రేపో మాపో ఢిల్లీ కూడా వెళ్లాల్సి ఉంటుంది. మర్యాదకు తోడు వారిని ప్రసన్నం చేసుకునే ఒక యత్నం! ఇప్పటికిది సరిపోయినా, రేపటి వేళ రాష్ట్రమంతా పర్యటిస్తూ సుబ్రహ్మణ్య స్వామిలా లోకం చుట్టిరాక తప్పదు. ఎందుకంటే, స్థానికసంస్థలకు ఎన్నికలు ముంచుకురానున్నాయి. కాంగ్రెస్ను వెనక్కినెట్టి ఆధిపత్యం సాధించాలని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ పొంచి చూస్తున్నాయి. ఈ ఎన్నికలు పార్టీగా కాంగ్రెస్కు, పీసీసీ అధినేతగా మహేశ్ గౌడ్ కి ప్రతిష్టాత్మకమే!
పార్టీ అధికారంలో ఉన్నపుడు పీసీసీ పీఠం అంత సుఖాసనమేం కాదు, ముళ్ల కిరీటమే! అధికారం, దాని తాలూకు సర్వ హంగులు-ఆర్బాటాలుండే ప్రభుత్వం వైష్ణవాలయమైతే, పార్టీ ప్రభుత్వంలో ఉన్నపుడు కాంగ్రెస్ వ్యవహారాల కేంద్రకం గాంధీభవన్ శివాలయమే!
సయోధ్యకు పెద్దపీట!
తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిభ – వ్యూహం – శ్రమ లను మేలవించి స్వయంగా ఎదిగారు. అతి తక్కువ కాలంలో ఆశించిన లక్ష్యం చేరుకున్న సాహసి! ఆయన ఆశీస్సులుండటం పీసీసీ కొత్త నేత మహేశ్కు కలిసివచ్చే అంశం. అదే సమయంలో, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీని సమన్వయపరచి విజయవంతంగా నడపటమన్నది పరీక్షే! ఏ కోణంలో చూసినా, మహాశక్తిమంతుడైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సయోధ్య నెరపుతూ, పార్టీ సీనియర్లు నొచ్చుకోకుండా శ్రేణుల్ని పీసీసీ నేత నడపాలి. ఉభయుల సహాయసహకారాలు పొందాలి. అందులోనూ, సమయం – సందర్భం బట్టి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కొత్త నాయకులకు-సుదీర్ఘ కాలంగా పార్టీనే నమ్ముకొని సేవలందిస్తున్న పాతతరం నాయకులకు మధ్య సమన్వయం కుదుర్చాలి. పంతాలు, తప్పుడు అహా(ఇగో)ల వల్ల వచ్చే నష్టాల్ని ముందే పసిగట్టి, సయోధ్యతో నివారించాలి. ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం పార్టీ కీలక పదవుల్లో ఉన్న మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి ఒక మాటనేది. ‘పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కింది, సో కామత్ ఉప్మా గ్యారెంటీ, రేపటి మంత్రివర్గంలోనూ చోటు దొరికితే…. ఇక కాజూబర్ఫీ కూడా ఖాయమే!’ అని మీడియా మిత్రులతో చలోక్తులు విసిరేది. ఇప్పుడు కూడా పలువురు సీనియర్లు పీసీసీ కార్యవర్గంలో చోటు కోరుకుంటారు. కీలక ప్రభుత్వ నిర్ణయాలప్పుడు, మానిఫెస్టో అమలులో… ఎంత వరకు పార్టీ నాయకత్వానికి ప్రాతినిధ్యం కల్పిస్తారన్నది ప్రశ్నార్థకమే! డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు-పర్యవేక్షణకు ప్రభుత్వాపార్టీ ముఖ్యులతో ఒక కమిటీ ఉండేది. అందులో ఏఐసీసీ నాయకుడొకరు సభ్యులుగా ఉండేది. అటువంటి ఏర్పాటు RC ఇప్పుడేమైనా ఉంటుందా అనే విషయంలో స్పష్టత లేదు.
ఉమ్మడి నిర్ణయాలకు చోటుండేనా?
ఇప్పటివరకైతే … ముఖ్యమంత్రే జోడుపదవుల్లో ఉండటం వల్ల ప్రభుత్వమైనా, పార్టీ అయినా ఆయనే అన్నట్టు సాగింది. సమన్వయంలో ఏ ఇబ్బందీ రాలేదు. ఢిల్లీ అధిష్టానం ఆదేశాలయితేనేం, సీఎం స్వయంగా ఏర్పరచుకున్న వైఖరి అయితేనేం…. కీలక నిర్ణయాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, పీసీసీ మాజీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు వంటి సీనియర్లతో విధిగా ఆయన చర్చించడం, సంప్రదించడం చేస్తున్నారు. మీడియాలో వచ్చే ప్రకటనల్లో ఫోటోల నుంచి ముఖ్య నిర్ణయాల్లో సమాలోచనల వరకు వారికి తప్పనిసరిగా స్థానం లభిస్తోంది. పార్టీకి- పీసీసీ నేతకు, ఇతర ముఖ్య కార్యవర్గ ప్రతినిధులకు ఇటువంటి చర్చలు, సంప్రదింపుల్లో రేపు ఏ మేరకు స్థానం లభిస్తుంది? అన్నది వేచి చూడాలి!
పదేళ్ల విపక్ష స్థానం- పోరాటాల తర్వాత లభించిన అధికారం కావడంతో పదవులు, హోదాలు, సేవా అవకాశాలంటూ పార్టీ ఆశావహులు నిరీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా వారి పట్ల ఉదారంగా ఉండి, సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇప్పటికే కొంత మందికి నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు, రాజకీయ అవకాశాలు లభించినా, ఇంకా ఎదురుచూస్తున్న వివిధ స్థాయి నాయకులు-కార్యకర్తలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారిలో అత్యధికులకు న్యాయం చేయడం ఎలా? ఈ విషయంలో పార్టీ నాయకత్వం ఏ మేర చొరవ తీసుకుంటుంది? అన్నది కూడా కీలకాంశమే!
సామర్థ్యమే గీటురాయి..
ఇప్పటిదాకా పార్టీ విధేయత మహేశ్కు పనికొచ్చింది. ఇక ముందు, విధేయతకు తోడు సమయస్ఫూర్తి, సామర్థ్యం కూడా అవసరమే! ఓపికతో అందరినీ కలుపుకుపోయే తత్వం కావాలి. నాయకత్వం విషయంలో మహేశ్ గౌడ్ కూ ఇది, తనను తాను నిరూపించుకోవాల్సిన సందర్భం-అవకాశం! ఓ పరీక్షా కాలం కూడా! సుదీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకొని ఎదిగిన నాయకుడాయన. దాదాపు పదేళ్లు పార్టీ విద్యార్థి విభాగం (ఎన్ఎస్యుఐ) అధినేతగా ఉన్నారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తో సహా పార్టీ పలు పదవుల్లో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. ఆర్థిక, రాజకీయంగా బలమైన గౌడ సామాజికవర్గానికి ప్రతినిధి. 1994 (డిచ్పల్లి), 2014 (నిజామాబాద్-అర్బన్) నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయారు. 2018, 2023 లో అవకాశాలు వచ్చినా, ఏ కారణంచేతో పోటీ చేయలేదు. మిగతా సందర్భాల్లో రాజకీయ కారణాల వల్ల ఆయనకు అవకాశాలు లభించలేదు. సీనియర్ నాయకుడు మాజీ మంత్రి-పీసీసీ అధ్యక్షుడు డి,శ్రీనివాస్ తో స్పర్ధల వల్ల పలు అవకాశాలు తనకు రాకుండా పోయాయనే భావన ఆయనకుంది. పార్టీలో ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారనే కోపంతో, ఓ ఆరు మాసాలు పార్టీని వీడి తెలుగుదేశంలోకి వెళ్లినా, వెంటనే తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు.
‘తానొవ్వక`నొప్పించక… అన్నట్టు, అందరితో సఖ్యతగా ఉండే మంచివాడని పేరున్నా… ప్రభావవంతమైన నాయకుడిగా ముద్ర స్థిరపడలేదు. ఇప్పుడిదొక అవకాశం. సరిగ్గా ఎన్నికలప్పుడు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరి, కనీసం గాంధీభవన్ మెట్లు ఎక్కకుండానే ఎమ్మెల్యేలుగా అయిన వారూ ఉన్నారు. ఏ పదవీ రాకపోయినా, యేళ్ల తరబడి పార్టీనే నమ్ముకొని సేవలు అందిస్తున్న వారూ ఉన్నారు. ఈ రెండు రకాలవారి మధ్య సమన్వయం, సయోధ్య కాంగ్రెస్కు ఒక పెద్ద కార్యభారమే!
==========
దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ.