8.9 C
London
Wednesday, January 15, 2025
HomeLatestAntidefectionact: పరస్పర నిందకు పగ్గాలెప్పుడు?

Antidefectionact: పరస్పర నిందకు పగ్గాలెప్పుడు?

Date:

Related stories

literature: కులం అనే ఆలోచనకు ప్రేమే పరిష్కారం..!

విశి: కుట్టి రేవతి తమిళ కవయిత్రి & సినీ గీతరచయిత్రి. అసలు పేరు...

sankranti2025: 3 డీ టైప్స్ ముగ్గులు..ప్రత్యేకం..!

సాహితీ, ప్రసిద్ధ, మౌక్తిక: ...

literature: ఎరుకే జ్ఞానం నీవే దైవం..!

Teluguliterature: ఆ.వె : శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి మ్రొక్కవలదు వెర్రి మూఢులార! యుల్లమందు బ్రహ్మముండుట...

BJP: బిజెపి మునక మునుగోడుతో మొదలైందా..?

BJP: బీజేపీ మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల...

vaikuntaekadashi: వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత..!

Vaikunta ekadashi: హిందువుల పండుగలన్నీ చంద్రమానం ప్రకారం లేక సౌరమాన ప్రకారం...
spot_imgspot_img

Telangana:

పార్టీ ఫిరాయింపుల (నిరోధక) చట్టం, ఇదివరకు లేని ప్రభావం ఇప్పుడు చూపేనా? రాష్ట్ర హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఈ సందేహం తలెత్తుతోంది. ‘అది స్పీకర్ పరిధిలోని అంశం, వారికి తామేమీ నిర్దేశించజాలమ’ని ఇదివరలో చెప్పిన హైకోర్టే…. ‘మీరు తేల్చకుంటే, మేమే స్వచ్చందంగా ప్రక్రియ చేపడతాం’ అని అసెంబ్లీ కార్యదర్శికిచ్చిన తాజా ఆదేశాలు ఇందుకు ఆస్కారం కలిగిస్తున్నాయి. చర్యలకు ఓ నాలుగువారాలు గడువిచ్చింది. చర్యలుంటాయా? గడువు దాటితే…. కోర్టు ఏం చేస్తుంది? స్పీకర్ చట్టం అమలు చేస్తే ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితేంటి?’ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీధుల్లో గొడవలవుతున్నాయి. ఈ తరుణంలో… స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్న చందంగా, ప్రధాన స్రవంతి పార్టీల నేతలు ఒకరి పంథాలోనే మరొకరు పార్టీ పిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. చట్టాన్ని లెక్కచేయకుండా… అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు కొందరు యధేచ్చగా పార్టీ మారిపోతున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, రెండు పర్యాయాలూ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించినందుకే, కాంగ్రెస్ ప్రస్తుత చర్యల్ని గట్టిగా నిలదీయలేని దుస్థితి. ఎదుటివారి వైపు ఒక వేలు చూపిస్తే, మిగతా నాలుగు వేళ్లు తమనే ఎత్తిచూపే పరిస్థితి వారిని ఆత్మరక్షణలో పడవేస్తోంది. అయినా కొందరు, పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించమని స్పీకర్ను కోరి, తర్వాత రాష్ట్ర హైకోర్టును సంప్రదించారు. ఆ కేసు విచారిస్తూ హైకోర్టు తాజా ఉత్తర్వులిచ్చింది. తాము న్యాయస్థానాలను గౌరవిస్తామని, వారి నిర్దేశాలకు లోబడే వ్యవహరిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ బహిరంగంగానే స్పందించారు. ఇక ఇప్పుడు, బీఆర్ఎస్ సభ్యుల ఫిర్యాదు ప్రకారం స్పీకర్ చర్యలకుపక్రమిస్తారా? ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టే పరిగణించి, చట్టప్రకారం వారిని అనర్హులుగా ప్రకటిస్తారా? లేక ఫిర్యాదుల్ని తిరస్కరిస్తారా? ఏ చర్యా లేకుండా ఇదివరకటి లానే… మౌనంగా ఉండి, తాత్సారం వహిస్తారా? దీనికి న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది? ఇవన్నీ ప్రశ్నలే, ప్రస్తుతానికి! ఈ లోపు ఆరెకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి రూపంలో వీధి పోరాటాలు జోరందుకున్నాయి.

గడువెలా లెక్కిస్తారు…??

పార్టీ మారిన ప్రజాప్రతినిధులపై ఫిర్యాదులు వచ్చినపుడు, చట్టప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించడానికి తీసుకునే చర్యలకు కాల నియతి ఉందా? ఫిర్యాదు తిరస్కరించడమో, సభ్యుల్ని అనర్హులుగా ప్రకటించడమో చేసే చర్య…. సభాపతులు ఎప్పటిలోగా తీసుకోవాలి? చట్టంలో ఈ అంశంపై స్పష్టత లేదు. అలా అని, ‘ఎప్పటికీ చర్య తీసుకోకుంటే ఎలా?’ అని, న్యాయస్థానం తాజాగా ప్రశ్నించింది. కోర్టులకు న్యాయసమీక్షాధికారముంది. అంటే, ఆయా చట్టసభల అధిపతులు తీసుకున్న నిర్ణయం చట్ట-రాజ్యాంగబద్దంగా ఉందా? లేదా? సమీక్షించి, తీర్పు చెప్పే అధికారం కోర్టులది. కానీ, అదేదైనా… సభాపతి వైపు నుంచి ఒక నిర్ణయం అంటూ జరిగాకే!

నిర్ణయం ఆలస్యమయితే, ‘జాప్యం చేయక నిర్ణయం తీసుకోండి, ఫలానా గడువు లోపల ఏదో ఒకటి నిర్ణయించండి’ అని న్యాయస్థానాలు ఆదేశించగలవా? అన్నదే ఇన్నాళ్లు ప్రశ్నార్థకంగా ఉండింది. సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాలు అది తేల్చకపోవడం వల్లే ఈ అసాధాణ జాప్యాలు. ఈ ప్రతిష్టంభనలో న్యాయపపరంగా కూడా ఏమీ చేయలేని పరిస్థితి! పదవీకాలం పూర్తయ్యేవరకు కూడా స్పీకర్లు ఏదీ నిర్ణయించిక, పార్టీ మారి ఇతర పార్టీ ప్రభుత్వాల్లో చేరి మంత్రులైన వారు కూడా అనర్హత వేటు పడక కొనసాగిన సందర్భాలెన్నో ఉన్నాయి. 2015 లో, ఇటువంటి వివాదమే హైకోర్టు సమక్షానికి వచ్చినపుడు, చట్టసభను తామలా నిర్దేశించలేమని, సమయపరిమితి విధించలేమని న్యాయస్థానమే చెప్పింది. కానీ, ఇప్పుడు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోండి, లేకుంటే ‘మాకు మేమే’(సువమోటో) నిర్ణయించాల్సి ఉంటుందని నిర్దిష్టంగా పేర్కొంది.

లక్ష్యం – ఆచరణ ఒకదారిలో లేవు..

పార్టీ మార్పిళ్ల నివారణకు, 52వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1985 లో రాజీవ్ గాంధీ ప్రధానిగా తీసుకువచ్చిన చట్టానికి విస్పష్టమైన ఉద్దేశ్యం-లక్ష్యాలూ ఉన్నాయి. రాజ్యాంగంలో దీన్ని 10వ షెడ్యూల్ కింద చేర్చారు. ఒక పార్టీ తరఫున ఎన్నికై మరో పార్టీకి మారే వారిని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా, ఆయా సభాపతులు అనర్హులుగా ప్రకటించవచ్చు. 1967లో హర్యానాలో ‘గయాలాల్’ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకేరోజు రెండు పార్టీల్లోకి, మూడు మార్లు మారినపుడు ‘ఆయారామ్ గయారామ్’ అనే రాజకీయ చలోక్తి పుట్టింది. దరిమిళా ఉత్పన్నమైన రాజకీయ పరిస్థితుల్లో… పార్టీ మార్పిళ్ల ప్రక్రియ రాజకీయ అనిశ్చితికి కారణమౌతూ వస్తోంది. ప్రజాప్రతినిధుల కొనుగోళ్ల (హార్స్ ట్రేడింగ్) కు ఇది దారితీస్తోందని నెత్తీ-నోరూ మొత్తుకున్నా వినిపించుకున్న వారే లేరు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య బోటాబోటీగా ఉన్నపుడు, ఈ పార్టీ మార్పిళ్ల ప్రక్రియ ప్రజలు అసహ్యించుకునేంత నేలబారుగా ఉంటోంది. ఇది ‘ప్రజానిర్ణయాన్ని వంచించడమే’ అని రాజకీయ వ్యవస్థ గ్రహించడం లేదు. గ్రహించినా, ఇది వంచన అని అంగీకరించడానికి సిద్దంగా లేదు. ఈ తప్పిదాన్ని చట్టం అడ్డుకోలేకపోతోంది. కారణం, ఈ విషయంలో పార్టీల నుంచి, సభ్యుల నుంచీ వచ్చే ఫిర్యాదులకు స్పీకర్లు సకాలంలో స్పందించి, తగు నిర్ణయాలు తీసుకోకపోవడమే! చట్టరక్షణ కన్నా, పాలకపక్షాల ప్రయోజనాలు కాపాడుతున్నారు.

పార్టీలకతీతంగా… ఇది అందరి హయాంలోనూ జరుగుతోంది. ఫలితంగా, పార్టీలు మారుతున్నా… ఎవరూ అనర్హులు కావటం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే…‘ఇదేం కొత్తా? మీ హయాంలో జరుగలేదా?’ అంటే, ‘మీ హయాంలో జరుగలేదా?’ అంటూ, పరస్పరం నిందించుకుంటున్నారు. తెలంగాణలో ఫిర్యాదు ముగ్గురిపైనే అయినా…ఇప్పటికే 10 మంది వరకు తమ వైపు వచ్చారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇప్పుడు కోర్టిచ్చిన 4 వారాల గడువు లోపల మరో 16 మంది వచ్చేలా చూస్తే, మూడింట రెండొంతుల (2/3-26/38) మంది సభ్యులది ‘విలీనం’ అనొచ్చు, అప్పుడిక అనర్హతకు తావే లేదనే వాదనలూ ఉన్నాయి.

మరో సవరణ అవసరమేమో?

చట్టాన్ని పకడ్బందీగా అమలుపరచడం కోసం ఇదివరకే ఒక సవరణ చేశారు. ఇప్పుడింకొక సవరణ అవసరమవుతుందేమో చూడాలి. శాసనసభ/మండలి, లోక్ సభ/రాజ్యసభ… ఇలా చట్టసభలోని ఒక పార్టీ సభ్యుల మొత్తం సంఖ్యలో మూడింట రెండొంతుల (2/3) కు తగ్గకుండా వెళ్లి మరో పార్టీలో విలీనం (మెర్జర్) చెందితే, అది పార్టీ మార్పిడిగా పరిగణించరు కనుక అనర్హతకు గురికారు. ఇలా ఇంకో పార్టీలో విలీనం అయిన వారు, అసలు పార్టీలో మిగిలిపోయిన వారు… ఎవరికీ ఈ అనర్హత వర్తించదు, వేటు పడదు. ఇదే ఇప్పటికీ అమల్లో ఉంది. ఇటువంటిదే మరొక నియమం, ఇదివరకు ఉండి ఇప్పుడు అమల్లో లేదు. అదేమంటే, ఒక పార్టీ సభ్యుల మొత్తం సంఖ్యలో మూడిరట ఒక వంతు (1/3)కు తగ్గకుండా, ‘మేం విడిగా కూర్చుంటాం, మమ్మల్నలా గుర్తించండి’ అని చెప్పి, స్పీకర్ అనుమతి తీసుకుంటే… సదరు సభ్యులూ అనర్హతకు గురికారని మినహాయింపు ఉండేది.

కానీ, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా, 2003లో అటల్ బిహారీ వాజ్పేయ్ ప్రధానిగా ఉన్నపుడు, చట్టాన్ని సవరించి ఈ నిబంధన తొలగించారు. అంటే, ఈ ‘విడిపోవడం’ చెల్లదు, దాన్ని పార్టీ మార్పిళ్ల కిందే పరిగణించి, అనర్హులుగా ప్రకటిస్తారు. ఎన్నికైన పార్టీని వదలటం అన్నది, సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా ఇచ్చి వైదొలగటమే కానక్కరలేదు, తన చర్యల ద్వారా ఒక సభ్యుడు పార్టీని వీడినట్టు వ్యవహరించినా దాన్ని రాజీనామాగానే గుర్తించాలని సుప్రీంకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. అంటే, రాజీనామా చేయకపోయినప్పటికీ… పార్టీని బహిరంగంగా విమర్శించినా, ఇతర పార్టీలో చేరినా, ఇతర పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గన్నా. ఇవన్నీ పార్టీ మార్పిడి కిందకే వస్తాయని సుప్రీంతీర్పు అర్థం. ఇటువంటి సందర్భాల్లో నిర్దిష్టంగా ఫిర్యాదులున్నా స్పీకర్లు ఏ నిర్ణయమూ తీసుకోవటం లేదు. చర్య తీసుకోని అనుచిత తాత్సారాన్నీ ఒక చర్యగానే పరిగణించి ‘న్యాయస్థానాలు సమీక్షించవచ్చ’ని రాష్ట్రానికి చెందిన ఓ న్యాయకోవిదుడు, ఒక ప్రజాసభలో ప్రసంగిస్తూ చెప్పారు, ఫిర్యాదు పరిష్కారానికి గరిష్ట కాలపరిమితిని నిర్దేశిస్తూ చట్టసవరణ చేయవచ్చు. కానీ, జరగటం లేదు. దాంతో, చట్టం స్ఫూర్తి భంగపోతోంది. అందుకే, నిర్ణయాధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎన్నికల సంఘానికో, న్యాయమూర్తులతో అప్పగించాలనే రాజకీయ డిమాండ్ కూడా ఒకటుంది. దేశంలో ఏ చట్టం, ఏ అంశంలోనైనా స్పష్టత లోపించినపుడు… సుప్రీంకోర్టు చెప్పేమాట శాసనమై చెల్లుతుంది. తాత్సారం తగదని, మూడు మాసాల్లోపే నిర్ణయం తీసుకోవాలని, ఇటువంటిదే మణిపూర్ వివాదంలో సుప్రీం స్పష్టం చేసింది. బహుశా, అదే ప్రామాణికంగా తీసుకొని హైకోర్టు తాజా 4 వారాల గడువు విధించి వుంటుంది.

స్పీకర్దే తుది నిర్ణయమైనా….

పార్టీ మార్పిళ్లను పరిగణనలోకి తీసుకొని, సభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్లదే తుది నిర్ణయం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయసమీక్షకు ఆస్కారముంది. ఆధారాలు లేకుండా విలీనానికి అంగీకరించినపుడు, ఫిర్యాదిచ్చినా స్పందించక అనుచిత జాప్యంతో చర్యల్లో విఫలమైనపుడు, నిర్ణయానికి అలసత్వం వహించినపుడు…. న్యాయసమీక్ష కోరవచ్చని సుప్రీంకోర్టు వేర్వేరు సందర్భాల్లో చెప్పింది. స్పీకర్దే తుది నిర్ణయమైనా, అది న్యాయసమీక్షకు లోబడి ఉండాలని జి.విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు (1996) కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగపు మూడు అంగాలైన శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థలకు వేటికవే పరిధులున్నాయని, ఒకదాని పనిలోకి మరొకటి జోక్యం చేసుకోజాలవనేది మూలసూత్రం. కానీ, ఆయా వ్యవస్థలు చట్టాలకు, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నదీ-లేనిది సమీక్షించే అధికారం కోర్టులకుంది.

నాలుగు వారాల్లో చర్యలు తీసుకోండి అన్న హైకోర్టు ఆదేశాలు… చట్టసభల పని పరిధిలోకి చొరబాటా? అనుచిత జాప్యానికి న్యాయసమీక్షా? అన్న ధర్మసందేహాన్నీ కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తదుపరి పరిణామాలెలా ఉంటాయో…. వేచి చూడాల్సిందే!

– దిలీప్‌రెడ్డి,
పొలిటికల్‌ అనలిస్ట్‌,
పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

Optimized by Optimole