పూరి జగన్నాథుని రథయాత్ర..

 

॥ శ్రీ జగన్నాథ ప్రార్థనా ॥

రత్నాకరస్తవ గృహం గృహిణీ చ పద్మా కిం దేయమస్తి భవతే పురుషోత్తమాయ । ? అభీర?వామనయనాహృతమానసాయ దత్తం మనో యదుపతే త్వరితం గృహాణ ॥ ౧॥

భక్తానామభయప్రదో యది భవేత్ కిన్తద్విచిత్రం ప్రభో కీటోఽపి స్వజనస్య రక్షణవిధావేకాన్తముద్వేజితః । యే యుష్మచ్చరణారవిన్దవిముఖా స్వప్నేఽపి నాలోచకా- స్తేషాముద్ధరణ-క్షమో యది భవేత్ కారుణ్యసిన్ధుస్తదా ॥ ౨॥

అనాథస్య జగన్నాథ నాథస్త్వం మే న సంశయః । యస్య నాథో జగన్నాథస్తస్య దుఃఖం కథం ప్రభో ॥ ౩॥

యా త్వరా ద్రౌపదీత్రాణే యా త్వరా గజమోక్షణే । మయ్యార్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే ॥ ౪

॥ మత్సమో పాతకీ నాస్తి త్వత్సమో నాస్తి పాపహా । ఇతి విజ్ఞాయ దేవేశ యథాయోగ్యం తథా కురు ॥ ౫॥

పూరీ జగన్నాథ రథోత్సవం:

రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’ అని ఆర్షోక్తి. అంటే ‘దివ్య రథంపై ఊరేగుతున్న విష్ణువును దర్శించుకొన్నవారికి పునర్జన్మ ఉండదు’ అని అర్థం. ఇంతటి మహిమ గల రథోత్సవం మహా పుణ్యక్షేత్రం అయిన ‘పూరీ’ దివ్య ధామంలో ప్రతి యేటా ఆషాఢ శుద్ధ విదియనాడు జరుగుతుంది. ఆ భవ్యరథంపై ఊరేగే మహావిష్ణువు పేరే జగన్నాథుడు.

పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీక్షేత్రం, శంఖక్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాది పాటు గర్భాలయంలోనే కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథయాత్ర జరిగే రోజున తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడితో కలిసి రథం అధిరోహిస్తాడు. ఈ రథయాత్ర ప్రధానాలయం నుంచి ప్రారంభమై మూడు మైళ్ల దూరంలో ఉన్న ‘గుండీచా’ ఆలయం వరకు సాగుతుంది.

వారం రోజులపాటు గుండీచా ఆలయంలో విడిది చేశాక, దశమినాడు ప్రధానాలయానికి తిరిగి చేరుకోవడం రథయాత్ర సంప్రదాయం. జగన్నాథుడు అధిరోహించిన రథాన్ని ‘నందిఘోష’ అని, సుభద్ర రథాన్ని ‘పద్మధ్వజం’ అని, బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అని పిలుస్తారు. ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మిస్తారు. ప్రతియేటా అక్షయ తృతీయనాడు ప్రారంభించి, ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు ఈ రథాల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. ప్రధానాలయంలోని ఈ ముగ్గురు మూర్తులు అధిష్ఠించి ఉండే పీఠాన్ని ‘రత్నపీఠం’ అంటారు. తొలుత బలభద్రుడి విగ్రహాన్ని, తదుపరి సుభద్ర విగ్రహాన్ని, చివరగా జగన్నాథుడి విగ్రహాన్ని రథంపై కూర్చోబెట్టడం ఆనవాయితీ. యాత్రకు రథాన్ని సిద్ధంచేసిన తరవాత పూరీ సంస్థానాధీశులు బంగారు చీపురుతో స్వామి ముంగిట శుభ్రం చేస్తారు. ఆ తరవాత అశేష భక్త జన సందోహం, జయజయ ధ్వానాల హోరులో రథయాత్ర ప్రారంభం అవుతుంది.

పూరీ’ అనే పదానికి పూరించేది అని అర్థం. భక్తుల పాలిట కొంగుబంగారమై, భక్తులు కోరిన కోరికలు తీర్చే దివ్యక్షేత్రం అయినందువల్ల ‘పూరీ’ అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదం అయిందని భక్తుల విశ్వాసం.

ఈ క్షేత్రంలో కొన్ని విశిష్టతలున్నాయి. ఈ ఆలయ గోపురంపై ఉండే జెండా… వీచే గాలికి వ్యతిరేక దిశలో కదులుతుంది. గోపురంపైన ప్రతిష్ఠించిన సుదర్శన చక్రం ఎటునుంచి తిలకించినా మన వైపే చూసినట్లు ఉంటుంది. ఈ ఆలయంపై పక్షులు ఎగరకపోవడం ఒక వింత. ఈ ఆలయ గోపురం నీడ సూర్యుడు ఉదయించినా, అస్తమించినా ఎక్కడా కనిపించకపోవడం విశేషం. సాధారణంగా గాలి పగటిపూట సముద్రంపై నుంచి భూమి పైకి వీస్తుంది. సాయంత్రం భూమిపై నుంచి సముద్రం పైకి వీస్తుంది. కానీ ఈ క్షేత్రంలో దీనికి విరుద్ధంగా గాలి వీస్తుంది. పూరీ ఆలయంలో స్వామికి నివేదనకు ముందు ప్రసాదం ఎలాంటి వాసనా ఉండకపోవడం విచిత్రం. స్వామికి నివేదించిన తరవాత సువాసనలు వస్తాయి. గుడిలోని జగన్నాథ, సుభద్ర, బలభద్రుల విగ్రహాలు చెక్కతో చేసినవి కావడం విశేషం.

రథయాత్ర ముగిసే గుండీచా ఆలయం దగ్గర రథం తనంతట తానే ఆగిపోవడం ఒక మహిమ. జగన్నాథుడికి నివేదించే 56 రకాల పదార్థాలను(ప్రసాదాలను) మట్టి కుండలలోనే వండుతారు. ఆలయానికి అత్యంత సమీపంలోనే సముద్రం ఉన్నా, ఆలయం లోపల సముద్ర అలల శబ్దాలు వినబడవు. ఇలా ఎన్నో విశిష్టతలు, రహస్యాలు, మహిమలు కలిగిన పూరీక్షేత్రం మానవాళికి వరప్రసాదమే.

Optimized by Optimole