సీఎం జగన్ కి దమ్ములేదు కాబట్టే హెలికాప్టర్ లో వచ్చారు: నాదెండ్ల మనోహర్

• జనసేన వ్యూహం ఏంటో అధినేత పవన్ కళ్యాణ్ వివరిస్తారు
• మనందరి లక్ష్యం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి
• ప్రశ్నించే గొంతుల్ని ఈ ప్రభుత్వం నొక్కాలని చూస్తోంది
• మార్చి 14న ఆవిర్భావ సభ ద్వారా జనసేన సత్తా చాటుదాం
• తాడేపల్లిగూడెం సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ మాట్లాడితే దమ్ముందా.. దమ్ముందా అని మాట్లాడుతున్నారు.. అసలు అతనికే దమ్ము లేదని ఎద్దేవ చేశారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. నిజంగా దమ్ముంటే 26 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వస్తారా? అని ప్రశ్నించారు. ఆయన సింగిల్ గా వస్తే మన వ్యూహం మనకి ఉంటుందని, అది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వెల్లడిస్తారని తెలిపారు. పార్టీ నాయకులు, జన సైనికులంతా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడాలని కోరారు. ఆ నినాదాన్నే ముందుకు తీసుకువెళ్లాలని పిలుపు నిచ్చారు. మార్చి 14వ తేదీన మచిలీపట్నం వేదికగా నిర్వహించనున్న పార్టీ 10వ ఆవిర్భావ సభ ద్వారా మన బలం ఏంటో చాటాలన్నారు నాదెండ్ల‌.

శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా మనోహ‌ర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేరు వేరు ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు ఆయ‌న‌ బీమా చెక్కలు అందచేశారు. మార్చి 14వ తేదీన నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ “జనసేన పార్టీకి హంగులు, ఆర్భాటాలు అవసరం లేదన్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే కుటుంబ సభ్యులకు ఆపద వస్తే అండగా నిలుస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఒక్క రోజు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు జ‌న‌సేనాని పంపిన రూ. 30 లక్షలు చెక్కుల రూపంలో అందించబోతున్నట్లు స్ప‌ష్టం చేశారు. చిన్న వయసులో ప్రమాదవశాత్తు భర్త మరణించినప్పుడు ఆ కుటుంబాల వేదన ఎలా ఉంటుందో అర్ధం చేసుకోగలమ‌న్నారు. అందుకే ప్రభుత్వం మాదిరి తూతూ మంత్రం చర్యగా కాకుండా పార్టీ సభ్యులకు అండగా నిలిచేందుకు, వారి కుటుంబాల్లో భరోసా నింపేందుకు మూడేళ్ల క్రితమే జ‌న‌సేన అధినేత దూరదృష్టితో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని మ‌నోహ‌ర్ పేర్కొన్నారు.