యూపీలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వత సీఎం యోగి తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మంత్రులు ఉన్నతాధికారులు అధికార పర్యటనలకు వెళ్తే హోటళ్లకు బదులుగా అతిథి గృహాల్లోనే బసచేయాలని ఆదేశించిన ఆయన..మూడు నెలల్లోపు తమ ఆస్తుల్ని, తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించాలని..మంత్రుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పారు.
అంతేకాక ఐఏఎస్, ఐపీఎస్, ప్రొవెన్షియల్ సివిల్ సర్వీస్ అధికారులు తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు యోగి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఎంతో ముఖ్యమన్నారు. ఆ స్ఫూర్తితో మంత్రులంతా తమతో పాటు తమ కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల వివరాలను ప్రకటించాలని యోగి స్పష్టం చేశారు.
అటు అభివృద్ధికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించి.. 100 రోజుల్లో, ఐదేళ్ల పని ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టుల్ని పూర్తి చేసేలా అధికారులకు మార్గదర్శనం చేయాలని ఆయా శాఖలకు ఆదేశించారు.
ఇక రాష్ట్రంలోని ప్రజాసమస్యలను తెలుసుకునేందకు వీలుగా యోగి.. మంత్రుల సారథ్యంలో 18 గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో మంత్రి సారథ్యం వహించి.. రాష్ట్రమంతా పర్యటించి స్థానిక నాయకులతో చర్చించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ సెషన్ ప్రారంభమయ్యేలోపు మంత్రులు తమ రాష్ట్రవ్యాప్త పర్యటన పూర్తి చేసుకోవాలని యోగి స్పష్టం చేశారు.
మొత్తం మీద అవినీతికి తావులేకుండా తనదైన మార్క్ పాలనతో ప్రజాసంక్షేమమే ధ్యేయంగా యోగి దూసుకుపోతున్నారు.