తెలంగాణలో కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వర్గపోరు తలనొప్పిగా మారింది. అటు పార్టీకి వీర విధేయులం అంటూ సీనియర్ నేతలు భేటీ అయితే? ఇన్నిరోజులు ఒక లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క.! షోకాజ్ నోటీసులకు భయపడేది లేదు. సస్పెండ్ చేసినా తగ్గేది లేదంటూ జగ్గారెడ్డి పీసీసీ రేవంత్ కి సవాల్ విసరడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకు సీనియర్ నేతలు ఈ మీటింగ్తో హైకమాండ్ కి ఏం చెప్పదలచుకున్నారు?
అసమ్మతి వాదులం కాదు.. మా తాపత్రయం అంతా పార్టీ కోసమే. 3 సంవత్సరాలుగా సీనియర్ నేతలంతా కలుస్తున్నాం. మళ్లీ మళ్లీ కలుస్తూనే ఉంటాం. 5 రాష్ట్రాల్లో పార్టీ ఘోర ఓటమితో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. అటువంటి పరిస్థితి తెలంగాణలో రాకుడదన్నదే మా ఆవేదన. ఇది తెలంగాణా కాంగ్రెస్ సీనియర్స్ మీటింగ్ తర్వాతఇచ్చిన స్టేట్మెంట్. అయితే
అలా మీటింగ్ అయిపోయిందో లేదో.. ఊహించని ట్విస్టుతో అద్దంకి దయాకర్ అండ్ టీమ్.. సమావేశం జరుగుతున్న హోటల్‌కి రావడం ఆసక్తికరంగా మారింది. కానీ వారితో మాట్లాడెందుకు సీనియర్ నేతలు విముఖుత చూపలేదు. దీంతో చేసేదేమిలేక వెనుదిరిగారు.
మరోవైపు ఎమ్మేల్యే జగ్గారెడ్డి.. పీసీసీ రేవంత్ రెడ్డిపై
మరోసారి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పార్టీలో జరుగుతున్న కుట్రలు.. చేస్తున్న ద్రోహాలు అన్నీ బయటపెడుతానని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వన్‌మ్యాన్ షో చేస్తున్నారని..ఏకపక్ష నిర్ణయాలతో ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శించారు. అంతేకాక తన పదవికి రాజీనామా చేస్తానని.. నా స్థానంలో అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటే రేవంత్ హీరో అని ఒప్పుకుంటానని సవాల్ విసిరారు. పార్టీ సిద్ధాంతంతో రేవంత్ పని చేయడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వీహెచ్ తన కూతురు సమస్యపై హరీశ్‌రావును కలిస్తే తప్పేంటి?’’ అని జగ్గారెడ్డి ప్రశ్నిచడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇటు సీనియర్ నేతలు సమావేశం పై హైకమాండ్ అలెర్ట్ అయింది. మీటింగులో పాల్గొన్న సీనియర్లందరికీ ఫోన్ చేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు AICC కార్యదర్శి బోసురాజు. అధిష్టానం అనుమతి లేకుండా మీటింగ్‌లు పెట్టొద్దని.. ఏమైనా సమస్యలుంటే నేరుగా పార్టీ అధినేత్రి సోనియాతో చర్చించాలని కోరారు. లేనిపోని సమస్యల సృష్టించి పార్టీ పరువుని బజారుకి ఈడ్చొద్దంటూ హెచ్చరించారు.
మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ వర్గపోరు పార్టీ కార్యకర్తలనూ అయోమయానికి గురిచేస్తోంది. వరుస ఓటముల్తో నైరాశ్యంలో వారికి ఈ విషయం అసలు మింగుడు పడటం లేదు. అధిష్ఠానం ఆదేశాలతో.. ఇంతటితో వర్గపోరు కు పుల్ స్టాప్ పెడతారా.. లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!