Nancharaiah Merugumala (senior journalist):
–––––––––––––––––––––––––––––––––––––––––––––
గుజరాతీ క్షత్రియుడి కూతురు, రాజస్తానీ రాజపుత్రుడి భార్య అంటే ‘భయభక్తులు’!
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘నోరిజారి’ రాష్ట్రపత్ని అని రెండుసార్లు అన్నందుకు లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌధరీ క్షమాపణ చెప్పేశారు. శుక్రవారం ఆయన కొత్త రాష్ట్రపతికి లేఖ రాయడంతో వివాదం ముగిసింది. పాలకపక్షం బీజేపీ కోరుతున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా క్షమాపణ చెప్పే అవకాశాలు లేవు. బీజేపీ మహిళా ఎంపీలు తన పేరు ఈ గొడవలో ప్రస్తావించినందుకే సోనియా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ బ్రాహ్మణ నేత అధీర్ చౌధరీ మొదట్నించీ వివాదాస్పద నాయకుడే. బెంగాల్ లో సీపీఎం అధికారంలో ఉన్నప్పుడే ఆయన కమ్యూనిస్టులపై దూషణలకు, హింసకు వెనకాడేవాడు కాదు. మాజీ నక్సలైట్ అని చెప్పుకునే అధీర్ మార్క్సిస్టులకు హింసకు హింసతోనే జవాబు చెప్పేవాడనే పేరుంది. రెండేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపూత్ ఆత్మహత్య కేసులోకి బెంగాల్ కు చెందిన నటి, సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిని లాగడంపై అధీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన 2020 సెప్టెంబర్ లో ఈ విషయంపై వరుసగా అనేక ట్వీట్లు చేశారు.
‘‘రాజకీయ ప్రయోజనాల కోసం సుశాంత్ రాజపూత్ ను బిహారీగా చూపించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. నిజానికి అతను భారతీయ నటుడు. ఈ కేసులో రియా చక్రవర్తిని ఇరికించడంలో అర్ధం లేదు. ఆమె తండ్రి దేశానికి సేవలందించిన మాజీ సైనికాధికారి. రియా బెంగాలీ బ్రాహ్మణ లేడీ. సుశాంత్ కు న్యాయం చేయడమంటే–బిహార్ కు న్యాయం చేయడం కాదు,’’ అంటూ అనవసరంగా రియా చక్రవర్తి కులం ప్రస్తావన ఈ వివాదంలోకి తెచ్చాడు బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అధీర్ రంజన్ చౌధరీ.
ప్రతిభా పాటిల్ ను ఎవరూ రాష్ట్రపత్ని అనే సాహసం చేయలేదేం?
–––––––––––––––––––––––––––––––––––––––
2007లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ఈ అత్యున్నత రాజ్యాంగ పదవికి చేపడుతున్న తొలి మహిళ కాబట్టి ఆమెను రాష్ట్రపతి అనొచ్చా? అనే అనవసర చర్చ సరదా సరదాగా జరిగింది. ఈ అంశంపై రాజ్యాంగంలోనే స్పష్టంగా చెప్పారనే విషయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారమే అన్నారు. రాష్ట్రపతి అనేది జెండర్ అగ్నాస్టిక్ (లింగ భేదం లేని మాట) అని నిర్మలమ్మ వివరించారు.
భారతదేశంలో ఎంతైనా హిందూ సమాజంలో పై కులాల నుంచి వచ్చే రాజకీయ నేతల విషయంలో అధీర్ రంజన్ వంటి అడ్డగోలు దూకుడు ప్రదర్శించే నేతలు జాగ్రత్తగానే ఉంటారని 75 ఏళ్ల స్వాతంత్య్రం చెబుతోంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో స్థిరపడిన కుటుంబం నుంచి వచ్చిన ప్రతిభా పాటిల్ నిజానికి మహరాష్ట్రియన్ కాదు. ఆమె తండ్రి గుజరాత్ నుంచి అక్కడికి చేరిన క్షత్రియ కులస్తుడు. ఆయన ఇంటిపేరు సోలంకీ. ఆమె భర్త రాజస్తాన్ లో మూలాలున్న రాజపుత్రుడు దేవీసింగ్ షెఖావత్.
2007 రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ (యూపీఏ) అభ్యర్థిగా పోటీచేసిన ప్రతిభా పాటిల్ బీజేపీ అభ్యర్థి, మాజీ ఉపరాష్ట్రపతి, రాజస్తాన్ మాజీ సీఎం భైరవ్ (భైరో) సింగ్ షెఖావత్ పై విజయం సాధించారు. కాని, ఆమె భర్త ఇంటిపేరు షెఖావత్ ను తన పేరు చివర పెట్టుకునేవారు కాదు. ఇలా గుజరాత్ క్షత్రియ, రాజస్థానీ రాజపూత్ (రాజపుత్ర లేదా క్షత్రియ), నివాసం రీత్యా మహరాష్ట్రియన్ అయిన ప్రతిభా పాటిల్ ను ప్రస్తుత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని పిలిచే సాహసం ఎవరూ చేయలేదు.
ఓ టీవీ చానల్ రిపోర్టరుతో మాట్లాడుతూ మొదటి రెండుసార్లు రాష్ట్రపతి అని, తర్వాత రెండుసార్లు రాష్ట్రపత్ని అని ద్రౌపది ముర్మును పిలిచారంటే అధీర్ రంజన్ చౌధరీ కావాలనే ఇలా అన్నాడని తెలిసిపోతోంది. అయితే, ద్రౌపది ముర్ము కులం వారైన సంతాలీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ఆమె సొంత రాష్ట్రం ఒడిశాను ఆనుకున్న పశ్చిమ బెంగాల్ నేత, అందులోనూ కాంగ్రెస్ బ్రాహ్మణ నేత అధీర్ నోరుజారడం బెంగాలీల పరువు తీసే విషయం అనుకోవచ్చు.