INC: కష్టాల కడలి ఈదుతున్న కాంగ్రెస్..!

INC:

‘‘మొదలు మొగురం కానిది కొన దూలమవుతుందా?’’ అని సామెత. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. మొగురం (స్తంభం) కన్నా దూలం (ఇంటి నిర్మాణంలో మొగురాలపై అడ్డంగా పరిచే బీమ్) వ్యాసపరిధి ఎక్కువ. ఓ చెట్టు ఖాండపు మందం మొగరానికే సరిపోనపుడు, ఇక ఆ చెట్టు కొన దూలానికి సరిపోవడం అసాధ్యమనే అర్థంలో వాడతారు. ఒకటి తర్వాత ఒకటి… రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బలు కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికకు బలపడుతున్న భారతీయ జనతాపార్టీకి అఖిల భారతస్థాయిలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా నిలువగలుగుతుందా? పోనీ, ఇప్పుడు నడుస్తున్నదంతా సంకీర్ణ శకమే అనుకున్నా… బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ధీటుగా ‘ఇండియా’కూటమిని, తాను కేంద్రకంగా ఉండి కాంగ్రెస్ నిలుపగలుగుతుందా? ఇవీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక ఫలితాల తర్వాత పలు మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. కాంగ్రెస్కి ఎందుకీ దుర్గతి? కారణాలేంటి? మెరుగుపడే యోగముందా? జవాబులు కావాలి!

ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట మహారాష్ట్రలో ఆ పార్టీ మున్నెన్నడు లేనంత దారుణంగా 16 అసెంబ్లీ స్థానాలకు పడిపోయింది. పొత్తుల్లో కాకుండా సొంతంగా పోటీ చేసి ఉంటే, ఇన్ని స్థానాలైనా దక్కి ఉండేవో? లేదో? అన్నది ప్రశ్నే! కాంగ్రెస్ పార్టీ శివసేన (ఉద్దవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) లతో కూడి ‘మహా వికాస్ అఘాడి’ కూటమిగా తలపడి, 288 స్థానాల అసెంబ్లీలో 50 స్థానాలకు పరిమితమైంది. కూటమి పెద్దన్నయ్యగా కాంగ్రెస్ అత్యధికంగా 102 స్థానాల్లో పోటీ చేసి 16 చోట్లే నెగ్గింది. రెన్నెళ్ల కింద జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి దీన్ని కొనసాగింపుగానే భావించొచ్చు! ఎందుకంటే, రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, అది కేంద్రకంగా ఉన్న ‘ఇండియా కూటమి’కి సానుకూల పరిస్థితులు ఉండి కూడా గెలువలేకపోయారు. అయిదారు మాసాల కింద ప్రతిష్టాత్మకంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో , రెండు రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమికి అనుకూల ఫలితాలే వచ్చాయి. స్వల్పంగా ఓటు వాటా శాతాల్లోనూ ఆధిక్యత దక్కింది. ఆ ఆధిక్యతల్ని నిలుపుకోకపోగా, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. హర్యానాలో కాంగ్రెస్ది బీజేపీతో ముఖాముఖి పోటీ కాగా, మహారాష్ట్రలో అటు మూడు, ఇటు మూడు పార్టీలు రెండు కూటములుగా మోహరించి, పోరాయి. పొత్తుల్లో 145 చోట్ల పోటీచేసిన బీజేపీ 132 చోట్ల గెలవడమే కాకుండా, తమ ‘మహాయుతి’ కూటమికి నాలుగింట మూడొంతులకు పైగా స్థానాలతో (234/288) సునామీ విజయాన్ని అందించింది. పట్టణ-గ్రామీణంగా విడిపోయి ఉన్న మహారాష్ట్ర ఆరు ప్రాంతాలు, విభిన్న సామాజిక వర్గాలు, వివిధ వృత్తుల వారిలోనూ కాంగ్రెస్ పట్టు కోల్పోయిన పరిస్థితి కళ్లకు కట్టింది.

సంస్థాగతంగా డొల్ల..

కాంగ్రెస్ పతనస్థితి…. యేడాది – రెండేళ్లలోనో, ఒకటి రెండు ఎన్నికలతోనో వచ్చింది కాదు. అప్పుడప్పుడు-అక్కడక్కడ మెరుపు వంటి కొన్ని విజయాలు తప్ప పార్టీ ఓటమిబాట పట్టి చాలా కాలమైంది. గాంధీ-నెహ్రూ కుటుంబపు అయిదోతరం నాయకుడిగా రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అనిశ్చితి ఆ ఓటమి పరంపరకు తోడయింది. దాదాపు ఇదే కాలంలో బీజేపీ మరింత విస్తరించి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక రాజకీయ పార్టీగా అవతరించింది. పార్టీ సంస్థాగత స్థితి, ఎన్నికల నిర్వహణ సామర్థ్యం, మిత్రులతో కూటములు నెరిపే నైపుణ్యం…. ఈ మూడంశాల్లోనూ బీజేపీతో కాంగ్రెస్కు వ్యత్యాసముంది. కాంగ్రెస్ సంస్థాగత నిర్వహణ సరిగా లేదు. కొంచెం లోతుగా పరిశీలిస్తే డొల్ల తప్ప మరేమీ కనిపించదు. ‘ఆ కుటంబాని’కి సన్నిహితుడై పెత్తనం చెలాయించడమే తప్ప పార్టీ మీద కే.సీ.వేణుగోపాల్కి పట్టే కాదు అవగాహన కూడా లేదు. అట్టడుగున.. విద్యార్థి విభాగం, యువజన కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ల నుంచి అంచెలంచెలుగా ఎదిగి వచ్చిన సీనియర్లు పార్టీ ప్రధానకార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) గా ఉంటే ఉపయోగం తప్ప ‘ప్యారాచ్యూట్ నాయకుల’ వల్ల ఒరిగేదేమీ ఉండదు. పైగా నష్టం! మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమి పార్టీల గెలుపు నిష్పత్తి (స్ట్రైక్రేట్) 88 శాతం వరకు వెళ్లిందనే చర్చ వచ్చినపుడు, ‘దాందేముంది, మా స్ట్రైక్రేట్ కూడా 90 శాతానికి చేరువలోనే ఉందం’టూ కేసీ వేణుగోపాల్ హయాం గురించి పార్టీలో జోకులు చెప్పుకుంటున్నారు. 2019లో వేణుగోపాల్ జీఎస్(ఓ) బాధ్యతలు చేపట్టిన నుంచి, పార్టీ 40 అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడితే 33 ఓటముల్ని చవిచూసింది. ఏ నాయకుడి సేవల్ని, ఏ ఎన్నికల్లో ఎలా వాడుకోవాలో కనీస అవగాహన కూడా ఆయనకు లేదన్నది స్పష్టం. డాక్టర్ కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, చింతామోహన్ వంటి సీనియర్ల సేవల్ని వివిధ ఎన్నికల్లో సమర్థంగా వినియోగించుకోవచ్చు. పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి హోదాలు నిర్వహించిన నాయకులను మహారాష్ట్ర ఎన్నికల్లో ఇంచార్జీలుగా పంపిన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులే బరిలో లేరు! పొత్తుల్లో అవి మిత్రులకు పోయాయి. అలా సమన్వయాల్లోనూ లోపమే! ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు వై.ఎస్.షర్మిలకు పీసీసీ పీఠం అప్పగించారు. సోదరుడు, నాటి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత వ్యతిరేక ప్రచారమే ఆమె ప్రధాన ఎజెండాగా మారినా, దాన్ని నిలువరించి పార్టీ ప్రచార ప్రాధాన్యత గుర్తుచేసినవారే లేరు.

ఒక టర్మ్ను మించట్లే….

ఎన్నికల సమయంలో ‘నాలుగు, అయిదు, ఆరు…. గ్యారెంటీలు’ అంటూ నగదు-ప్రత్యక్ష ప్రయోజనాలద్వారా ప్రజల్ని ప్రసన్నం చేసుకుంటూ గెలవాలని కాంగ్రెస్ నాయకత్వం చూస్తోంది. కొన్నిసార్లు ‘క్లిక్’ అవుతున్నా మరికొన్ని సార్లు అది పేలని టపాసులా ‘తుస్సు’మంటోంది. గెలిచిన చోట, ప్రత్యర్థుల నిరంతర నిఘా మధ్య… వాటి అమలు సందేహాస్పదంగా మారి, వెంటనే ప్రజావిశ్వాసం కోల్పోయే పరిస్థితులొస్తున్నాయి. హామీల ప్రచారం మొదట ఇతర రాష్ట్రాల్లో మేలు చేసినా, రాను రాను నష్టం కలిగిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపు కర్ణాటక విజయానికి, అక్కడ గెలుపు తెలంగాణలో విజయానికి, ఈ రెండు విజయాలు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ మెరుగుదలకు బాటలు వేసింది. కానీ, ఆ 3 రాష్ట్రాల్లో హామీలను అమలుచేయలేదని ప్రత్యర్థులు చేసిన ప్రచారం మహారాష్ట్రలో ప్రతికూల ఫలితాలకు కారణమైంది. ‘వారెంటీ ముగిసిన కాంగ్రెస్ గ్యారెంటీలకు విలువలేద’ని ప్రత్యర్థుల గోల! లోగడ వరుసగా మూడు పర్యాయాలు (ఢిల్లీ-షీలా దీక్షిత్, అస్సాం- తరుణ్ గగోయ్), రెండు పర్యాయాలు (మధ్యప్రదేశ్- దిగ్విజయ్ సింగ్, ఏపీ- వైఎస్సార్) కాంగ్రెస్ నెగ్గిన పలు సందర్భాలున్నాయి. బీజేపీలో ఇప్పటికీ ఎన్నో రాష్ట్రాల్లో అలా వరుసగా నెగ్గుతూ వస్తున్నారు. రికార్డు స్థాయిలో గెలిచిన గుజరాత్ మాత్రమే కాక మూడు మార్లు హర్యానా, రెండు మార్లు ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో వరుస గెలుపులు నమోదవుతున్నాయి. నవీన్ పట్నాయక్ (ఒడిషా), అర్వింద్ కెజ్రీవాల్ (ఢిల్లీ), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్) వంటి ఇతర పార్టీల నేతలూ వరుస విజయాలతో ప్రజావిశ్వాసం చూరగొంటున్నారు. ఆ సంస్కృతి కాంగ్రెస్లో క్రమంగా కనుమరుగవుతోంది. ఒకసారి గెలుపే గగనమవుతోంది. ఇక ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం మరింత దుర్లభమవుతోంది.

నినాదాల కరువు..

భారత ఎన్నికల రాజకీయాల్లో… ముంచినా, తేల్చినా ‘నినాదాలు’(స్లోగన్స్), ‘విధానవాదనల’ (న్యారెటివ్స్) ది ప్రత్యేక పాత్ర! 2004లో ‘భారత్ వెలిగిపోతోంది’ (ఇండియా షైనింగ్) అంటూ నినదించిన ఎన్డీయే కూటమి బక్కబోర్లా పడిరది. అదే బీజేపీ ‘సబ్ కీ సాత్ సబ్కా వికాస్’ నినాదంతో 2019లో తిరుగులేని విజయాన్ని ఖాయం చేసుకుంది. తక్కువ పదాలతో, మంచి ప్రాస/రైమింగ్తో నినాదాలు బలంగా ప్రజల్లోకి వెళతాయి. వేగంగా ప్రభావం చూపుతాయి. ఎంత లేదన్నా… ‘భారత్ జోడో’ అనే కాంగ్రెస్ నేత రాహుల్ నినాదం, ‘రాజ్యాంగం ప్రమాదంలో ఉంది’ (సంవిదాన్ ఖత్రేమే హై) అన్న ఇండియా కూటమి నినాదం వారికి అనూహ్యంగా సానుకూలత పెంచింది. దేశంలోని 16 సర్వే సంస్థలు ఇండియా కూటమి సంఖ్య 150 లోపే అని అంచనాలు చేసినా, 240 వరకు తీసుకువెళ్లటంలో ఈ నినాదాలు బాగా పనిచేశాయి. ‘ఈసారి, 400 పైనే’ (ఇస్ బార్ చార్సౌ పార్) అన్న బీజేపీ నినాదాన్ని విపక్షాలు నీరుగార్చాయి. నిన్నటికి నిన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మాజీ, లడ్కీ, బహెన్’ నినాదం (పథకమే అయినా) తో పాటు ‘విడిపోయామో… పడగొడతారు’ (భాటింగేతో కాటింగా), ‘వోట్ జిహాద్’ వంటి నినాదాలు పనిచేసినట్టు ఫలితాలు తేల్చాయి. కానీ, ప్రత్యర్థులు నిర్దిష్ట నినాదమో, న్యారేటివో లేని స్థితిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్త ప్రచారానికి ఇప్పుడొక ప్రభావవంతమైన నినాదం అవసరముంది. గతంలో ఇందిరాగాంధీ కూడా ‘పేదరికాన్ని తొలగిద్దాం’ (గరీబీ హఠావో) నినాదంతో రాజకీయంగా పునరుజ్జీవనం పొందారు.

మిత్ర ధర్మనీతి పెరగాలి..

సార్వత్రిక ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే… హర్యానా, మహారాష్ట్రలో ప్రభుత్వాలను ఎన్డీయే నిలబెట్టుకుంది. ‘ఇండియా’ జార్ఖండ్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని, జమ్మూ- కశ్మీర్లో ఎన్డీయే నుంచి కైవసం చేసుకుంది. ఫలితాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే తక్కువ విజయశాతం దక్కింది కాంగ్రెస్ పార్టీకే! తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత మధ్య గెలవాల్సిన హర్యానాలో బీజేపీ కి సమర్పించుకుంది. ఇండియా మిత్రపక్షం ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) ఇక్కడ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసి, 2 శాతం ఓటు వాటా తెచ్చుకుంది. ‘ఆప్’ అడిగిప పది సీట్లు కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. జమ్మూ కశ్మీర్లో 38 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ గెలిచింది 6 చోట్ల! జేకేఎన్సీ 42/56 విజయశాతం తీసుకురాకుంటే, అక్కడ అధికారం దక్కేదే కాదు. జార్ఖండ్లోనూ కాంగ్రెస్ 30 చోట్ల పోటీ చేసి 16 చోట్ల గెలిచింది. 34/43 స్కోర్తో జేఎంఎం గట్టెక్కిచ్చింది.

ఉత్తర్ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లోనూ లోగడ ఎక్కువ స్థానాలు తీసుకొని అతి తక్కువ గెలుపు శాతంతో, ప్రత్యర్థులు బలపడటానికి కాంగ్రెస్ ఆస్కారమిచ్చిందనేది మిత్రపక్షాల విమర్శ. సంకీర్ణ శకంలో, కూటమి రాజకీయాలు నడిపేటప్పుడు… బలాల ఆధారంగా పొత్తుల్లో సీట్ల పంపిణీ జరిగేట్టు పెద్దన్నయ్యగా కాంగ్రెస్ కొన్ని త్యాగాలకు సిద్దపడాలి. ఈ విషయంలోనూ బీజేపీదే పై చేయిగా ఉంది. అవసరాన్నిబట్టి అధిక స్థానాలున్నా… శివసేన నేత ఎక్నాథ్ షిందేను సీఎం చేసి, ఫడ్నవీస్కు ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టిన బీజేపీ, పూర్తి పైచేయి సాధించగానే అదే ఫడ్నవీస్ను సీఎం చేసి, షిందేను ఉపముఖ్యమంత్రిగా ఒప్పించగలుగుతోంది. బిహార్లో పైచేయి లభిస్తే చాలు నితీష్ను ఎక్కడ కూర్చోబెట్టాలో బీజేపీకి తెలుసు. ఇవాల నితీష్కుమార్ (జేడీ- యు) అయినా, చంద్రబాబునాయుడు (టీడీపీ) అయినా…అవసరార్థం మిత్రులే తప్ప సిద్దాంతాల్లోనో, విధానాల్లోనో భావసారూప్యత కలిగిన వారు కాదు. దేశ ప్రజలు కోరుతున్నట్టు బలమైన ప్రత్యామ్నాయంగా నిలవాలంటే కాంగ్రెస్ ఇంకొంత నిబద్దత, వ్యూహం, ప్రణాళిక, ప్రజాహిత ఆలోచనలతో సాగితేనే మెరుగుపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

Optimized by Optimole