‘నల్లసూరీళ్ల’’ కు అండగా కాంగ్రెస్‌ : CLP మల్లు బట్టివిక్రమార్క

తెలంగాణ రాష్ట్రానికి మణిహారమైన సింగరేణి ఎన్నో ఏండ్లుగా దేశానికి పెద్దఎత్తున నల్ల బంగారాన్ని అందిస్తూ ప్రధాన ఇంధన వనరుగా తోడ్పడుతోంది. హైదరాబాద్‌ (డెక్కన్‌) కంపెనీగా పిలువబడుతూ 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించి, 1920 డిసెంబర్‌ 23న సింగరేణి కాలరీస్‌గా రూపాంతరం చెందింది. 133 సంవత్సరాలుగా నిరాటంకంగా రాష్ట్రానికి సిరుల మణిగా కొనసాగుతూ రారాజుగా వెలుగొంది లక్షలాది కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్న సింగరేణి కాలరీస్‌ తెలంగాణ ప్రజల సొంత ఆస్తి. తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఇప్పుడు సింగరేణి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సింగరేణి అభివృద్ధికి ఎంతో కృషి చేయడంతో ఒక వెలుగు వెలిగిన సంస్థ ప్రస్తుత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరితో సుడిగుండంలో చిక్కుకోవడం దురదృష్టకరం.

ఉద్యమకారులను దగా చేసిన కేసీఆర్‌..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారనేది అందరికీ తెలిసిందే. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం కార్మికులకు అరచేతిలో స్వర్గం చూపించింది. వారిచ్చిన అనేక వాగ్దానాలు గాలిలో కలిసిపోయాయి. ఉద్యమ సమయంలో కార్మికులను స్వప్రయోజనాలకు వాడుకున్న కేసీఆర్‌ ఇప్పుడు వారితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తన మానిఫెస్టోలో సింగరేణికి సంబంధించి అనేక వాగ్దానాలు చేసింది. ఆచరణలో మాత్రం శూన్య హస్తం చూపిస్తోంది. తాడిచర్ల మైనింగ్‌ ప్రయివేటీకరణను తెలంగాణ ఉద్యమ సమయంలో గట్టిగ వ్యతిరేకించిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే తాడిచర్ల ఓపెన్‌ కాస్ట్‌ను తన అనుచరులకు కట్టబెట్టారు. ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌తో చెన్నూరును బొందల గడ్డగా మార్చింది ఈ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. కేసీఆర్‌ కూతురు కవిత కార్మికులను ప్రలోభాలకు గురిచేసి సింగరేణి కార్మిక నాయకురాలుగా గెలిచినా శ్రామిక లోకానికి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. ఆమె హయాంలో సంస్థ ఉద్యోగాలను బీఆర్‌ఎస్‌ నేతలు అమ్ముకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకప్పుడు కార్మికలోకానికి వెన్నుదన్నుగా ఉండే వామపక్షాలు కూడా ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్‌తో జతకట్టి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకుండా శ్రామికుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి. కేసీఆర్‌ కుటుంబంతో పాటు వారి అనుచరగణం అవినీతి వ్యవహారాలతో విసిగిపోయిన కార్మికలోకం సింగరేణి బతకాలంటే వారి ఆశాకిరణం ఐఎన్‌టీయూసీ తిరిగి రావాలని బలంగా కోరుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సింగరేణి కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో ప్రభుత్వం కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు జంకుతోంది. 2019లో నిర్వహించాల్సిన ఎన్నికలను తొలుత కోవిడ్‌ సాకుతో వాయిదా వేస్తూ వచ్చిన సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఇప్పటి వరకూ నిర్వహించలేదు.

కానరాని నియామకాలు..

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి నియామకాల అంశం. ప్రత్యేక రాష్ట్రం అవిర్భావం తర్వాత మన ఉద్యోగాలు మనకే అని ప్రలోభ పెట్టిన అప్పటి టీఆర్‌ఎస్‌ అనంతరం వాటి ఊసే మరిచింది. తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతాలలోని ఏడు జిల్లాల్లో సింగరేణి బొగ్గు తవ్వకాల కోసం ఒకప్పుడు లక్షా 30 వేల మంది కార్మికులు విధులు నిర్వహించగా, ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్య దాదాపు 45 వేలకు పరిమితమవడం ప్రభుత్వ వైఫల్యం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సింగరేణిలో దాదాపు 20 వేల మంది పర్మినెంట్‌ కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడం, రిటైర్మంట్‌ కావడం జరిగింది. ఈ పోస్టులలో కొత్తగా నియామకాలు లేవు. కాంట్రాక్టు కార్మికులు 10 వేల నుండి 33 వేలకు పెరిగారు. ఇక పరోక్షంగా సింగరేణిపై ఆధారపడ్డ కార్మికుల ఆవేదన వర్ణనాతీతం. దీనికి ప్రధాన కారణం సింగరేణిని దశలవారీగా ప్రయివేటీకరించడమే. సింగరేణిని ప్రయివేట్‌ వారికి అప్పనంగా అప్పచెబుతూ అంతర్గతంగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రోత్సాహిస్తూ సంస్థను కాంట్రాక్టుల కంబంధ హస్తాలతో బలిచేస్తున్నారు. మన రాష్ట్రం మన ఉద్యోగాలు అంటూ బీరాలు పలికిన బీఆర్‌ఎస్‌ నేతలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులను ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తీసుకుంటూ స్థానికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ 2014 మానిఫెస్టోలో ప్రధానమైన డిపెండెంట్‌ ఉద్యోగాల విధానంపై కార్మికుల కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకోగా కేసీఆర్‌ ప్రభుత్వం దీనిపై చిత్తశుద్ధి కనబర్చకపోవడంతో అది ఒక కొలిక్కి రాలేదు. కొత్తగా భూగర్భ గనుల తవ్వకం చేపడుతామని 2014 మానిఫెస్టోలో చెప్పారు, ఆచరణలో మాత్రం అమలు చేయడంలేదు. సింగరేణి గనులను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేస్తుందంటూ ఆరోపించే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ నిర్ణయాలను అడ్డుకోవడానికి సీరియస్‌గా ప్రయత్నించకుండా చోద్యం చూస్తోంది. కొత్తగూడెంలో మైనింగ్‌ విశ్వవిద్యాలయం కోసం మానిఫెస్టోలో ప్రకటించినా దీనికి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు.

ప్రత్యారోపణలతో కార్మికులలో గందరగోళం..

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ప్రయివేటీకరణను రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు రాజకీయ అంశంగా వాడుకుంటూ కార్మికులలో గందరగోళం సృష్టిస్తున్నాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో విదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంగా సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి భారీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పిలుపులో విదేశీ వ్యతిరేకత అంటూ దేశభక్తిని చాటుకుంటున్నట్లు నటిస్తూ సింగరేణి సంస్థను ప్రయివేట్‌ కాంట్రాక్టులకు అప్పగించేందుకు తెరదీశారు. ప్రస్తుతం తన స్వలాభం కోసం కేంద్రంతో తలపడుతున్నట్లు రోజుకో వివాదంతో కాలక్షేపం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం ఆ సమయంలో మోడీ ప్రభుత్వానికి అడుగులు మెత్తుతు ఎలాంటి వ్యతిరేకతను తెలపకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బావుల ప్రయివేటీకరణలో భాగంగా సింగరేణిలో కూడా రాష్ట్రానికి చెందిన నాలుగు బొగ్గు బావులను ఆ జాబితాలో చేర్చారు. గత నవంబర్‌లో ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకున్నారే తప్పా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఉభయులు అంశాన్ని మసిబూసి మారేడుకాయలా చేస్తున్నారే కానీ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోవడం లేదు.

ప్రయివేటీకరణ లక్ష్యంగా దూకుడు..

కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రయివేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతోందని పాలక బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపిస్తుంటే, ప్రయివేటీకరణ చేసే అవకాశం మా చేతుల్లోనే లేదని బీజేపీ ప్రభుత్వం ప్రత్యారోపణ చేస్తుంది. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటయే అని, మిగతా 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని కేంద్ర ప్రభుత్వానికి సంస్థను ప్రయివేటీకరించే ఆలోచనే లేదని, ఒకవేళ ఈ సంస్థను ప్రయివేటీకరణ చేయాలంటే ఆ నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాని మాత్రమే ఉంటుందని స్వయాన నరేంద్ర మోడీనే రామగుండం పర్యటన సందర్భంగా ప్రకటించారు. అయితే, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సింగరేణిలో తవ్వడానికి సిద్ధంగా ఉన్న 44 బొగ్గు బ్లాకులను గుర్తించగా, వాటిలో సింగరేణి స్వహతగా తవ్వగలిగే బావులు 27 వరకున్నాయి. ఇవి తెలంగాణ పరివాహక ప్రాంతాలలో ఉన్నా, తవ్వక కేటాయింపులను కేంద్ర ప్రభుత్వమే కేటాయించాల్సి ఉంటుంది. వీటిలో నాలుగు బ్లాకులలో తవ్వకాలకు సింగరేణి దరఖాస్తు చేసుకోగా కేంద్రం దాన్ని పట్టించుకోకుండా వాటిలో ఒకదాన్ని ఇప్పటికే అరబిందో ప్రయివేటు సంస్థకు అప్పగించింది. దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకుల తవ్వకాల ప్రయివేటీకరణతో రూ.1 లక్షా 65 వేల కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఇప్పటికే దశలవారీగా వేలం వేస్తూ రూ.33 వేల కోట్లను సంపాదించింది. తవ్వకాలలో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా నిమ్మకు నీరెత్త్తినట్లు ఉండే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతులు కాలక ఆకులు పట్టుకున్న విధంగా ప్రతి అంశాన్ని రాజకీయంగా వినియోగించుకోవడానికే చూస్తుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ వ్యవహార శైలీ కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఇతర రాష్ట్రాలలో బొగ్గు బ్లాకులను వేలంలో దక్కించుకొని బొగ్గు ఉత్పత్తికి పోటీపడే సింగరేణి తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి విషయంలో మాత్రం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తోంది. భూపాలపల్లి జెన్‌కో కోసం విద్యుత్‌ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు సేకరణకు టెండర్‌ దక్కించుకున్న జెన్‌కో బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు పనిని ప్రయివేట్‌ కంపెనీకి అప్పగించింది. ఇక్కడ బొగ్గు ఉత్పత్తి చేసేందుకు సింగరేణి ముందుకు రాలేదు. జెన్‌కో, సింగరేణి రెండూ తెలంగాణ ప్రభుత్వ కనుసన్నులోనే ఉండడం ఇక్కడ గమనార్హం. ఇటువంటి పరిణామాలను గమనిస్తే బొగ్గు తవ్వకం ప్రయివేటీకరణలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ తీరు కూడా వివాదాస్పదమనే చెప్పవచ్చు.

కార్మికులకు రిక్త హస్తమే..

బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకుంటూ సింగరేణి విస్తరిస్తుంది. ప్రతికూల పరిస్థితులలోనూ గత జనవరి నెలలో రికార్డు స్థాయిలో 68.4 లక్షల టన్నుల బొగ్గును వెలికితీశారు. ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టులలో లక్షలాది టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నా కార్మికులకు ఉపాధి మాత్రం ఆశించినంత మేరకు లభించడం లేదు. యంత్రాలతో బొగ్గు సేకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతోపాటు, భూగర్భ బావులకు మంగళం పాడడంతో కార్మికుల అవసరం గణనీయంగా తగ్గుతోంది. ఇప్పటికే సింగరేణి సంస్థ ఎన్నో ఆకర్షణీయమైన పథకాలను తీసుకొచ్చి కార్మికులను వీఆర్‌ఎస్‌వైపు ప్రోత్సాహిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు మరింత పెరిగే అవకాశాలుండడంతో కార్మికుల ఉపాధి అగమ్యగోచరం అయ్యే అవకాశాలున్నాయి. సింగరేణిలో ప్రత్యేకంగా డిపెండెంట్‌ ఉద్యోగాల విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం ఆచరణలో వ్యవహరిస్తున్న తీరుతో కార్మిక కుటుంబాలలో నిరాశనిస్పృహలు నెలకొంటున్నాయి. ప్రయివేటీకరణ విధానంతో కేంద్ర ప్రభుత్వం, యాంత్రీకరణ విధానాన్ని ప్రోత్సాహించడంతో పాటు హామీలు విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల జీవితాలతో దోబూచులాడుతున్నాయి. సింగరేణిలో ప్రమాదాలు తరచూ జరుగుతున్నా, ప్రమాద సమయంలో హడావుడి చేసే ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది.

డిఎంఎఫ్‌ నిధుల కేటాయింపులో ఇష్టారాజ్యం..

కేసీఆర్‌ ప్రభుత్వం మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాలలో ఖర్చు చేయాల్సిన డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డిఎంఎఫ్‌) నిధులను ఇతర వాటికి మళ్లిస్తుంది. కోల్‌బెల్ట్‌ విస్తరించిన ఆరు జిల్లాల పరిధిలో రూ.1900 కోట్ల నిధులున్నా వాటిని లబ్దిదారులకు అందజేయడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. డిఎంఎఫ్‌ నిధుల ప్రధాన లక్ష్యం సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టడం. ఈ నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలను ప్రభుత్వం బహిరంగ పర్చడం లేదు. ఈ నిధులను మైనింగ్‌ యేతర ప్రాంతాలైన సిద్దిపేట, యాదాద్రిలో ఖర్చు చేశారనే ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు.

కార్మికుల పక్షాన కాంగ్రెస్‌..

కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ పోరాడుతుంది. బొగ్గు తవ్వకాలలో సింగరేణికి ప్రాధాన్యతిచ్చి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా పోరాడుతుంది. ఈ సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాకా కాంట్రాక్టు, ఔటసోర్సింగ్‌ ఉద్యోగుల స్థానంలో శాశ్వత ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తుంది. డిపెండెంట్‌ ఉద్యోగాల విధానాన్ని సరళీకృతం చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుంది. ప్రమాదాలు జరగకుండా కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్‌ తోడ్పడుతుంది. కార్మిక కుటుంబాలకు చేదోడుగా నిలుస్తుంది. ఉద్యోగాల నియామకాల్లో అవినీతిని అరకడుతాం. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకొని, లబ్దిదారులకు న్యాయం చేయడానికి కాంగ్రెస్‌ కృషి చేస్తుంది. కేసీఆర్‌ కుటుంబాన్ని సింగరేణి నుండి తరిమికొట్టే వరకు కాంగ్రెస్‌ పోరుడుతుందని నేను ఆ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తున్నాను.

=============

– మల్లు బట్టివిక్రమార్క, ఎమ్మెల్యే

కాంగ్రెస్‌ సభా పక్ష నాయకులుCongress stands by Singareni workers

You May Have Missed

Optimized by Optimole