IncTelangana: దేశంలోని బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు రక్షణ కవచంగా ఉన్న పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నిత్యం కృషి చేస్తోంది. దేశ రాజకీయాల్లో మార్పులు సంభవించినా, ఏవైనా ఆటుపోట్లు ఎదురైనా బలహీన వర్గాలకు అండగా నిలిచేలా డా.బీఆర్.అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. అనంతరం దానికి కొనసాగింపుగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా దేశంలో రాజ్యాంగం మరింత పటిష్టంగా అమలయ్యేలా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవడంతో భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విశ్వ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్న భారత రాజ్యాంగాన్ని మార్చే విధంగా బీజేపీ, సంఘ్ పరివార్ కుట్రలు పన్నుతుండడంతో కాంగ్రెస్‌తో సహా ప్రజాస్వామ్యవాదులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి, దేశంలోని బడుగు బలహీన, మైనార్టీ వర్గాల హక్కుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నాయి. అంతేకాక రాజ్యాంగ పితామహుడైన అంబేద్కర్‌ను తూలనాడుతున్నారు. దేశంలో మత సామరస్యానికి ప్రాణాలు అర్పించిన జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలకు విరుద్ధంగా మతకలహాలు సృష్టిస్తున్నారు. సంఘ్ పరివార్ కుయత్నాలను కాంగ్రెస్ పార్టీ ముందే పసిగట్టి వీటిని అడ్డుకోవాలనే కృత నిశ్చయంతో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా కార్యాచరణ రూపొందించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లపై బీజేపీకి ఉన్న అక్కసును, వారు మైనార్టీల్లో సృష్టిస్తున్న తీవ్ర భయానక ఘటనలను ఎండగట్టారు.
దేశవ్యాప్తంగా రాజ్యాంగం పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోరాడుతుంటే, మరోవైపు సంఘ్ పరివార్ రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె రాజ్యాంగంలోని లౌకికవాదం, సామ్యవాదంపై సమీక్ష జరగాలన్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంఘ్ పరివార్ కు, బీజేపీకి కొత్తేమీ కాదు. గతంలో 2024 డిసెంబర్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బాధ్యతారాహిత్యంగా పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు ఆరాధ్య దేవుడైన అంబేద్కర్ ను అగౌరపరిచారు. ఆనాడే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చొరవ తీసుకొని అమిత్‌షాపై చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నేతలు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు సాహసించే వారు కాదు. అంతకుముందు 2023 సెప్టెంబర్ 19న నూతన పార్లమెంట్ భవనంలో అడుగుపెట్టిన ఎంపీలకు ప్రభుత్వం అందించిన రాజ్యాంగ ప్రతుల పీఠికలో ఉద్ధేశపూర్వకంగా లౌకికవాదం, సామ్యవాదం పదాలను తొలగించారు. దీనిపై అప్పుడే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, సంఘ్ పరివార్ తరచూ రాజ్యాంగంపై దాడిచేస్తుండడంతో దేశ ప్రజల ముందు వారి నిజస్వరూపం బహిర్గతమైంది.
ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలనలో ఎదురవుతున్న విపరీత ధోరణులు చూస్తుంటే ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ఎంతో ధైర్యసాహసాలతో తీసుకొచ్చిన లౌకికవాదం, సామ్యవాదం ఆవశ్యకత తెలుస్తుంది. లౌకిక వాదం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడం, అన్ని మతాలకు స్వేచ్ఛ ఇవ్వడం, ఏ మతంపైనా పక్షపాతం, వివక్ష చూపకపోవడం, ప్రభుత్వం మత కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకపోవడం, పాలనలో మత జోక్యం లేకుండా చూడడం. స్థూలంగా దేశంలో మత సామరస్యాన్ని పెంపొందించడమే లౌకికవాదం ప్రధాన లక్ష్యం. అయితే, బీజేపీ ఈ లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మైనార్టీల్లో అభద్రతా భావం కలిగిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ముస్లిం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు చేయడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలలో భయాందోళనలు కలిగించేలా బుల్డోజర్ పాలన సాగిస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో 2023 మే నుండి మతకలహాలు జరుగుతున్నా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కసారి కూడా అక్కడ పర్యటించకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. బీజేపీ, సంఘ్ పరివార్ అరాచకాలను చూస్తుంటే ప్రస్తుతం దేశంలో లౌకికవాదం ఎంత అవసరమో స్పష్టమవుతోంది.
సామ్యవాదం పేరు వింటేనే బీజేపీ, సంఘ్ పరివార్ లు బెంబేలెత్తుతున్నాయి. సామ్యవాదం ప్రధాన లక్ష్యం పెత్తందారి వ్యవస్థకు భిన్నంగా దేశంలో బడుగు, బలహీన వర్గాలకు సమానత్వం, సామాజిక న్యాయం అందించడం. ఇందుకు దేశ సంపదను, వనరులను అందరకీ సమానస్థాయిలో, న్యాయంగా పంపిణీ చేయడంతో పాటు పేదల సంక్షేమానికి కృషి చేయడం. సామ్యవాదంలో భాగంగా బడుగులందరికీ న్యాయం జరిగే వరకు అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను కొనసాగించాల్సి ఉన్నా, దానికి భిన్నంగా రిజర్వేషన్లపై బీజేపీ కుట్రలు పన్నుతోంది.
బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం దక్కేందుకు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించిన రాహుల్ గాంధీ దీర్ఘకాలికంగా ఒత్తిడి తెస్తుండడంతో మోదీ ప్రభుత్వం కులగణనకు అంగీకరించింది. బీజేపీ ప్రభుత్వం కులగణనను చేపట్టడానికి ముందుకు రావడం ఒక రకంగా తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారే కారణం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్రీయబద్దంగా కులగణనను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా కులగణనపై డిమాండ్లు పెరగడంతో బీజేపీ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో తలొగ్గింది. కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా త్వరగా కులగణన పూర్తి చేసి దేశంలో సామాజిక న్యాయం అందించే వరకు కాంగ్రెస్ ప్రజా పక్షాన పోరాడుతుంది.
సామాజిక అంశంలోనే కాకుండా ఆర్థిక విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. దేశ సంపదను, వనరులను పెట్టుబడిదారులు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయినా బీజేపీ ప్రభుత్వం చోద్యం చూస్తూ కుర్చుంది. సామ్యవాద విధానంలో ప్రభుత్వం సంక్షేమాలతో ప్రజలను ఆదోకోవాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం పన్నులు, జీఎస్టీ పేరుతో పేదల నడ్డీ విరుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. సామాజిక న్యాయం అందించడమే కాకుండా మహిళలు, రైతు, యువత, బడుగు బలహీన, మైనార్టీ వర్గాల సంక్షేమానికి పలు పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటోంది.
సెక్కులర్, సోషలిస్టు పదాలను తొలగించాలని కొందరు బీజేపీ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా 2024 నవంబర్ లో ఉన్నత న్యాయస్థానం కొట్టివేసినా వారిలో మార్పు రాలేదు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో భిన్నత్వంలో ఏకత్వం గల భారత దేశంలో ప్రజలందరికీ సమన్యాయం జరగాలంటే రాజ్యాంగ ఫలాలు బడుగులందరికీ దక్కాలి. స్వాతంత్ర పోరాట కాలం నుండి దేశ ప్రజల స్థితిగతులు, విశ్వాసాలపై పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బడుగు బలహీన, మైనార్టీ వర్గాలకు అండగా నిలుస్తోంది. బీజేపీ, సంఘ్ పరివార్ తమ ముసుగును తొలగించుకొని దేశ ప్రజలు పవిత్రంగా విశ్వసించే రాజ్యాంగానికి తూట్లు పొడవాలని చూస్తుంటే, రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. భారత సంవిధాన్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ శంఖరావం పూరించింది. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు అందుకొని తెలంగాణ కాంగ్రెస్ ‘జై బాపు, జై బీమ్, జై సంవిధాన్’ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, సామ్యవాదాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ చేపడుతున్న రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాలకు ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు చేయిచేయి కలిపి మద్దతుగా నిలవాలి.
=============