×

Telangana:

తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద కూడా మరింత దృష్టి పెట్టి ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. అసెంబ్లీలో చర్చ తర్వాతయినా అది సాధిస్తే మేలు! ఎందుకంటే, ఈ రెండు రంగాల్లోనే క్రమంగా ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతున్న కొద్దీ ప్రయివేటు రంగం అపారంగా విస్తరించింది. దోపిడీపర్వం పరాకాష్టకు చేరింది. మానవ సహజ బలహీనత, ఈ రెండు అంశాలతో పెనవేసుకునే మనోభావాలను ప్రయివేటు శక్తులు దురుపయోగం చేసి, ఇబ్బడి ముబ్బడిగా దండుకుంటున్నాయి. వరుస ప్రభుత్వాల వైఫల్యం వల్లే సగటు కుటుంబాలు తమ ఆదాయంలో అధికభాగం విద్య, వైద్య అవసరాలకు వెచ్చించి అప్పులపాలవుతున్నాయి. ఎక్కడో ఒకచోట మొదలెట్టి ప్రభుత్వాలు మళ్లీ ఈ రెండు రంగాల్ని తమ అదుపాజ్ఞల్లోకి తెచ్చుకోవాలి. ప్రయివేటు రంగాన్ని తగు నిఘా`నియంత్రణతో ప్రోత్సహించాలి. బడ్జెట్ ప్రకటనతో పాటు విద్యారంగంలో ఈసారి ప్రతిపాదించన పలు అంశాలు ఉన్నంతలో ఆశావహమే!

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తరచూ చెబుతోంది. కీలకమైన ఈ రెండు రంగాలకు బడ్జెట్ ప్రతిపాదన, కేటాయింపు, సమగ్ర నిర్వహణ మాత్రమే వారి మాటలకు కార్యాచరణ కాగలుగుతుంది. విద్యకు రూ. 26,674 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు శుక్రవారం శాసనసభకు సమర్పించిన 2026-27 బడ్జెట్‌లో పేర్కొంది. ఇది మొత్తం బడ్జెట్‌లో 8 శాతం పైన. ఇన్నాళ్లూ 4, 3 శాతాల లోపలే విద్యకు బడ్జెట్ ఇస్తుండటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విద్యకు పది, పన్నెండు, పదిహేను, ఇరవై శాతం వరకు కేటాయించాలనే డిమాండ్లు సంబంధిత వర్గాల నుంచి వస్తున్నాయి. వైద్యం విషయంలోనూ ఇటువంటి డిమాండ్లే తరచూ వినిపిస్తున్నాయి. తాజా బడ్జెట్‌లో వైద్యానికి రూ.13679 కోట్లు ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్‌లో 4 శాతం పైన. తాజా బడ్జెట్ లో విద్య, వైద్య రంగాల్లో ప్రకటించిన పథకాలు, కొత్త కార్యక్రమాలు చేపడితే రేపు సవరించే బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు, చెల్లింపులు అవసరమయ్యే ఆస్కారం తప్పక ఉంటుంది. అందుకు ప్రభుత్వం సిద్దం కావాలి. తగు మేర బడ్జెట్ కేటాయింపులతో పాటు ఆయా కార్యక్రమాలు, పథకాలను సమర్థంగా నిర్వహించి ఫలితాలు రాబట్టడం ద్వారానే ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని చూరగొనగలుగుతుంది.


అన్ని స్థాయిల్లో అవసరాలున్నాయి…
రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు సంబంధించి పూర్వప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పలు కొత్త అంశాలను పేర్కొన్నారు. చదువు లేకపోతే జ్ఞానం రాదు. జ్ఞానం లేకపోతే నైతిక విలువలు ఉండవు. అవి లేకుండా అభివద్ది సాధ్యం కాదు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చదువొక్కటి ఉంటేనే ఇవన్నీ లభిస్తాయి. నిజమైన విద్య సాధికారతనిస్తుంది అన్న మహాత్మ జ్యోతిబా పూలే మాటల్ని ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తన బడ్జెట్ ప్రసంగంలో ఉటంకించారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన 1362 ప్రీ`ప్రైమరీ పాఠశాలల విధానాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2000 నుంచి 2500 పాఠశాలలకు విస్తరించాలని నిర్ణయించింది. బాలికల విద్య ప్రోత్సాహానికి 91 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీస్) లను 2025`26 లో యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్స్ ఆప్ ఎక్సలెన్స్‌గా ప్రకటించి, 120 కేజీబీల ను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన కొన్ని పాఠశాలలను విద్య, శిక్షణ తదితర ఆధునిక సదుపాయాలు, వనరులు సమాకూర్చడం ద్వారా పబ్లిక్ స్కూళ్లుగా మార్చే నిర్ణయాన్నీ వెల్లడించింది. 2026`27 విద్యాసంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ`ఇంటర్మీడియట్ వరకు అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందజేయనుంది. ఇందులో భాగంగా వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావా కూడా ఇస్తామని పేర్కొంది. రాష్ట్రంలో ఏ విద్యార్థీ ఆకలి కడుపుతో విద్యనార్జించే రోజు మొదలు కావద్దన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మధ్యాహ్నభోజనాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు విస్తరించనున్నట్టు తెలిపింది. శారీరక వైకల్యం వారి విద్యార్జనకు అవరోధం కాకూడదని దివ్యాంగ విద్యార్థులకు రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను సమకూర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.


సమీకృత గురుకులాలొక‌ చైతన్యం…
నాణ్యమైన విద్యతో పాటు సమసమాజ స్థాపన దిశలో ఓ ముందడుగుగా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో (105) యువ భారత సమీకృత గురుకులాల (వైఐఐఆర్) ను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 79 మంజూరు చేసి, 44 చోట్ల గురుకులాల నిర్మాణానికి చర్యలు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాల విద్యార్థులు ఒకే ప్రాంగణంలో ఉండి విద్యనభ్యసిస్తూ పరస్పరం పోటీ పడే అవకాశం కల్పించినట్టవుతుంది. 20 ఎకరాల స్థలంలో 200 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో ఇవి ఏర్పడుతాయి. ఇందుకోసం ఈ బెడ్జెట్‌లో నిర్దిష్టంగా నిధులు ప్రతిపాదించారు. రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లోని వంటశాలల్ని ఆధునికీకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని వసతిగృహాలు, గురుకులాల్లో వంటగదుల ఆధునికీకరణకు ప్రస్తుత బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. విద్యార్థిగా ఉన్నప్పటి బాల్య, కౌమార దశల్లో శరీర వృద్దితో పాటు మేధోవికాసం చాలా ముఖ్యం కనుక వారికి తగు పోషకాహారం అందించడం ద్వారానే నేర్చుకునే సామర్థ్యం, దీర్ఘకాలక ఆరోగ్యం`ఆయుష్షు ను పెంచడానికి వీలవుతుందని, ప్రభుత్వం అందుకే ఈ తాజా నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

సాంకేతిక, ఉన్నత విద్యకు ఊతం..

పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఖర్చు కాదు, అవి మానవవనరుల వద్దికి పెట్టుబడులు అని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ. వెయ్యి కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రూ.400 కోట్ల రూపాయల్ని ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇతర వివిధ విశ్వవిద్యాలయాలకు కూడా నిర్దిష్టంగా నిధుల్ని ప్రతిపాదించడంతో పాటు కొన్ని విశ్వవిద్యాలయాల్లో అదనపు విభాగాలు, కోర్సులు, స్థాయిపెంచడం వంటివి ప్రతిపాదించారు. వినూత్న పరిశోధనా సంస్థల్నీ ప్రకటించారు. యువ గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాల వద్ది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని విద్యాశాఖ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. పరిశ్రమ అవసరాలను పరిగణనలోకి తీసుకొని, పరిశ్రమ`విద్యాలయాల మధ్య ఉన్న అవగాహన అంతరాన్ని తగ్గిస్తూ స్కిల్ యూనివర్సిటీ సంధానకర్తగా ఉండేట్టు తీర్చిదిద్దుతామని పేర్కొంది. ఇదివరకటి ప్రభుత్వ ఐటీఐ లను స్థాయి పెంచి ఆధునికీకరించడంతో పాటు కొత్తగా మంజూరు చేసినవి కలిపి 118కి పెరిగిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఎటీసీ)లలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు నెలకు రెండు వేల రూపాయలు స్కాలర్‌షిప్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ విషయాన్ని ప్రస్తుత బడ్జెట్‌లో ప్రకటించింది. ఎటీసీ లతో పాటు టామ్‌కామ్‌ లను, పాలిటెక్నిక్‌లను స్కిల్‌యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది.

అవి పనికొచ్చే కార్డులయితే గొప్పే!

రాష్ట్రంలోని ప్రజలందరి -ఆరోగ్య సమాచార పత్రాల’ను రూపొందించినట్టు ప్రభుత్వం బడ్జెట్‌లో తెలిపింది. అలా తయారు చేసిడిజిటల్ హల్త్ కార్డుల’ను అందజేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో సమాచార నిర్వహణలో అత్యంత గోప్యతను పాటిస్తామని ప్రకటించింది. ఆస్పత్రులు, వైద్యకళాశాలలు, నర్సింగ్ కాలేజీలను వివిస్తృతంగా పెంచి వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. వివిధ స్థాయి ఆస్పత్రుల్లో వసతులు, పడకల సంఖ్యను అసాధారణంగా పెంచి మునుపెన్నడు లేని రీతిలో ప్రతి వేయి మందికి ఒక పడక స్థాయికి ప్రమాణాలు సాధించడం విశేషమని ప్రకటించింది. నగదు రహిత ఆరోగ్య భద్రత’ పథకాన్ని ప్రారంభిస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు, వారిపై ఆధారపడ్డ కుటుంబసభ్యులకు వర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా పేర్కొంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఎంపిక చేసిన 421 ప్రయివేటు ఆస్పత్రుల్లో 1998 వ్యాధులకు ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత లభించనున్నట్టు తెలిపింది. ప్రతి లబ్దిదారుడికి ఇచ్చే డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా లభించే ఈ సదుపాయంతో 23.51 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు లబ్ది పొందుతారని వివరించింది.
ఇవికాకుండా ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సామాజిక అంతరాలతో, ధనిక, పేద అన్న వ్యత్యాసం చూపకుండా రాష్ట్రంలోని అన్ని (1.15 కోట్ల ) కుటుంబాల వారికి వర్తించే అయిదు లక్షల రూపాయల జీవిత భీమా అందించనున్నట్టు తెలిపింది. కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి మరణిస్తే కల్పించే ఈ భీమా చెల్లింపు సదుపాయం వచ్చే జూన్ 2 నుంచి అమల్లోకి వస్తున్నట్టు వెల్లడించడం ఒక కీలక నిర్ణయమే! బడ్జెట్ ప్రసంగ ఆరంభంలో “ ప్రతిపౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం” అన్న డా.బి.ఆర్.అంబేద్కర్ మాటలు ప్రస్తావించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమది ‘ప్రజా కేంద్రక బడ్జెట’ అని చివర్లో నొక్కిచెప్పారు. ప్రభుత్వ ప్రతిపాదనలు, ప్రాధ్యానతలు ఎలా ఉన్నా….. ఆరుగ్యారెంటీ ల‌పై స్పష్టత లేదని, ఆదాయం లేకుండా అప్పులపైనే ఆశల పందిరి అళ్లారనే ప్రతిపక్షాల విమర్శలకు సర్కారే సమాధానమివ్వాలి.


-దిలీప్‌రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్ డైరెక్టర్ పీపుల్స్‌పల్స్ రిసర్చ్ సంస్థ.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole