BJPTELANGANA: సెల్ఫ్ గోల్ కొట్టడంలో తెలంగాణ బీజేపీ నేతలు దిట్ట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకొని చచ్చి చెడి 8 స్థానాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం దేశమంత ప్రధాని మోదీ చరిష్మా.. రామమందిర ప్రాణ ప్రతిష్టతో బీజేపీ గాలి వీస్తోంది. ఈతరుణంలో అందివచ్చిన సువర్ణవకాశాన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం తెలంగాణ బీజేపీ నాయకత్వం తడబడుతోంది. దీనికి తోడు సొంత పార్టీ నేతలపై దాడులు చేయించిన నేతలను పార్టీలో చేర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగలడం ఖాయమన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
శానంపూడి చేరికపై గుర్రుగా బీజేపీ అభిమానులు..
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీలో చేరికలు వేగవంతం అయ్యాయి. నాగర్ కర్నూల్, జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేరిక పై మాత్రం బీజేపీ సీనియర్ నేతలు, పార్టీ అభిమానులు ఆగ్రహాంతో ఉన్నారు. గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా.. నల్లగొండ జిల్లాలో పర్యటించినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సైదిరెడ్డి యాత్రపై రాళ్లదాడి చేయించాడు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించాడు. అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చకోవడంపై కాషాయం అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొంత మంది బీజేపీ నేతలు అయితే బహిరంగంగానే పార్టీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు.
మరోవైపు దేశమంత మోదీ గాలి వీస్తున్న వేళ.. ప్రజలు తమ తీర్పుతో బుద్ధి చెప్పిన బీఆర్ఎస్ నేతలను కాషాయం పార్టీలోకి చేర్చుకోవల్సిన అవసరం ఏముంది? అన్న ప్రశ్నను కమలం పార్టీ నేతలు లేవనెత్తుతున్నారు. పార్టీలోని కొంతమంది నాయకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా చేసి పార్టీకి డ్యామేజ్ చేశారని గుర్తు చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టబడి ఏళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులను విస్మరించి..కొంత మంది నేతలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వలసల పేరిట పార్టీని నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మౌనం వహించడం వెనుక కుట్ర దాగుందా? సందేహాన్ని కమలం పార్టీ నేతలు లేవనెత్తుతున్నారు.దీనికి తోడు పార్టీ ముఖ్య నేతలపై దాడులు జరుగుతున్న కిషన్ రెడ్డి .. ఏమి పట్టన్నట్టు వ్యవహరించడంపై సైతం పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు.
మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాలే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ అధినాయకత్వానికి.. తెలంగాణ బీజేపీ నేతల తీరు తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి వలస నేతల రాకతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకముందే మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపడితే బాగుటుందన్న మాట కాషాయం పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అగ్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి!