TragicLife: కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే వాక్యం నిజమైంది..!

విశీ( సాయివంశీ) :  

నిండా 19 ఏళ్లు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి, అందులో రౌడీలు, డాన్‌లు చేసే పనులు నచ్చాయతనికి. తానూ అలాగే అవ్వాలని అనుకున్నాడు. మెల్లగా మొదలైన అతని నేరాల పరంపర భారీ స్థాయికి చేరింది. చివరకు అతని ప్రాణాలు తీసింది. కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే బైబిలు వాక్యం నిజమైంది. 20 ఏళ్లు రాకుండానే మరణించిన ఈ యువకుడి జీవితం ఎంతోమందికి గుణపాఠం. పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు జీవనపాఠం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో 2000 సంవత్సరం నవంబర్ 8న జన్మించాడు దుర్లబ్ కశ్యప్. తండ్రి వ్యాపారి కాగా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వారిద్దరివీ విద్యావంతుల కుటుంబాలు. వారి ఏకైక సంతానం దుర్లబ్. చిన్నప్పటి నుంచి అతణ్ని చాలా గారాబంగా పెంచారు. తల్లికి కొడుకంటే ప్రాణం. సినిమాలంటే చాలా ఇష్టం కలిగిన దుర్లబ్ టీవిలో ఎక్కువగా వాటిని చూసేవాడు. ఫైటింగ్ సీన్లు, గొడవలు వంటి దృశ్యాలు అతణ్ని బాగా ఆకర్షించేవి. ముఖ్యంగా రౌడీలు, డాన్‌ల పాత్రలు అతనికి బాగా నచ్చేవి. తానూ అలా మారితే బాగుంటుందని, ఒకేసారి ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు అనుకునేవాడు.

రౌడీ కావాలంటే ముందుగా తన ఆహార్యం మార్చుకోవాలని అనుకున్న దుర్లబ్ 2017లో తన రూపానికి మార్పులు చేసుకున్నాడు. చిన్నగా ఉండే హెయిర్ స్టైల్, కంటికి నల్ల కళ్లజోడు, నుదిటిపై పెద్ద బొట్టు, మెడలో నల్లరంగు తువ్వాలు.. ఇదీ అతని ఆహార్యం. వాటితో ఫొటోలు దిగి తన ఫేస్‌బుక్‌లో పెట్టాడు. వాటికి వచ్చిన కామెంట్లను బట్టి తన రూపాన్ని మరింత మార్చుకుంటూ రౌడీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నపిల్లలు, యువత అతనికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌గా మారిపోయారు. మెల్లగా వారిలో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత రౌడీ కావాలన్న తన ఆశకు అడుగులు వేశాడు. తనకు ఫ్యాన్స్‌గా మారిన కొందరు యువకులు, పిల్లల్ని కూడగట్టుకొని ఒక గ్యాంగ్‌ని ఏర్పాటు చేశాడు. దుర్లబ్‌గా ఉన్న తన పేరును ‘కోహినూర్’‌గా మార్చుకుని, తనది ‘కోహినూర్ గ్యాంగ్’ అని ప్రకటించాడు. దానికి DGang అనే పేరు పెట్టాడు. అతని అభిమానులంతా ‘హాష్‌ట్యాగ్ డీగ్యాంగ్’ పేరిట ఫేస్‌బుక్‌లో ఒక బృందంగా మారారు. వారి ద్వారా అతను రోడ్డు పక్కన ఉండే దుకాణదారుల వద్ద డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. ఎవరైనా తిరిగి ప్రశ్నించినా, డబ్బులు ఇవ్వకపోయినా వారిని కత్తితో బెదిరించడం, కొట్టడం వంటివి చేసేవాడు.

ఆ తర్వాత మెల్లగా తన నేరాలను విస్తరించాడు. దారి మధ్యలో అటకాయించి డబ్బులు వసూలు చేయడం, పోలీసులకు చెప్తే మీ ఇంటికొచ్చి చంపేస్తానని బెదిరించడం చేసేవాడు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని, ఎవరి కాళ్లు, చేతులు తీసేయడానికైనా తాను సిద్ధమేనని ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టేవాడు. ఇదంతా చేసేనాటికి అతని వయసు 17. అప్పటికే అతను ఇంట్లో వారికి దూరంగా ఉన్నాడు. సిగరెట్, మందు అతనికి బాగా అలవాటయ్యాయి.

దుర్లబ్ చేసే పనులు చూసి చాలామంది స్థానిక యువకులు అతని గ్యాంగ్‌లో చేరారు. ఆ యువకుల తల్లిదండ్రులు పోలీసులకు అతని గురించి సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు కాపు కాసి వారందరినీ అరెస్టు చేశారు. మొత్తం 25 మందిని బాలల సంరక్షణశాలలో ఉంచారు. దుర్లబ్‌కి 18 ఏళ్లు నిండాక అతణ్ని విడుదల చేశారు. 

ఆ తర్వాత కొన్ని నెలలపాటు ఉజ్జయినిలో తన తల్లి వద్ద ఉన్న అతనికి మళ్లీ పాత రౌడీ జీవితంలోకి వెళ్లాలన్న కోరిక కలిగింది. జనం ఇంకా తనని చూసి భయపడుతున్నారన్న విషయం తెలుసుకుని మెల్లగా బయటికి వచ్చి స్థానిక ప్రజల్ని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈసారి తన పాత గ్యాంగ్‌ని వదిలి, వయసులో పెద్ద వారితో కలిసి గ్యాంగ్‌గా మారాడు. అప్పటికే స్థానికంగా పాతుకుపోయిన కొందరు బడా రౌడీలు తమ పనుల కోసం అతణ్ని వాడుకోవడం ప్రారంభించారు. గతంలో చిన్న చిన్న దుకాణాల వద్ద వసూళ్లు చేసే అతను ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్స్ దాకా ఎదిగాడు. వాటి యజమానులను కొట్టి, బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు.

 

Optimized by Optimole