Covid2023: దేశంలో మరోసారి కోవిడ్ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే కేసుల సంఖ్య రోజురోజుకు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 10 వేల 158 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రకారం తెలిసింది. నిన్నటితో పోలిస్తే కోవిడ్ కేసుల్లో 30 శాతం పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 44 వేల 998గా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4 కోట్ల 42 లక్షల 10 వేల 127కి చేరింది.
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా నమోదు కాగా.. వారం పరంగా చూస్తే పాజిటివిటీ రేటు 4.02 శాతంగా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.71 శాతంగా నమోదైంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు హెల్త్ రిపోర్ట్ చెబుతోంది.
ఇదిలా ఉంటే.. చాపకింద నీరులా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాబోయే రెండు వారాలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని.. నిర్లక్ష్యం పనికిరాదని హెచ్చరిస్తున్నారు.