కరోనాతో మరో వింత వ్యాధి..!

కరోనా మహమ్మారి శరీరంలోని ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపటం లేదు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చిన్న పేగులు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు పేగు సంబంధిత వ్యాధి(గ్యాంగ్రీన్​)తో బాధపడుతున్నట్లు బయటపడింది.
కొవిడ్​ బారిన పడిన వారికి.. బ్లాక్ ఫంగస్​, వైట్ ఫంగస్ ముప్పు ఉందని తేలిన నేపథ్యంలో పేగులపై ప్రభావం చర్చనీయాంశం అయ్యింది. పేగుల పై ప్రభావం వలన.. గ్యాంగ్రీన్​కు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు. తెలిపారు. గ్యాంగ్రీన్​గా మారితే.. పేగులను తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు.
పేగులకు సంబంధించిన తొలి కేసు బెంగళూరులో గత ఏడాది వెలుగులోకి వచ్చింది. సెయింట్​ జాన్స్​ ఆసుపత్రిలో ఓ రోగికి దెబ్బతిన్న చిన్న పేగులను తొలగించారు. ప్రస్తుతం కొవిడ్​ రెండో దశలో అలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. సుమారు 10-15 శాతం మంది కొవిడ్​ రోగుల్లో ఈ సమస్య తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముంబయిలో ఇప్పటికే 25కు పైగా కేసులు వచ్చాయని వైద్యులు స్పష్టం చేశారు.
గ్యాంగ్రీన్​ అంటే ఏమిటి?
ఏసీఈ2 గ్రాహకం అనేది శరీరంలోని కణాల్లోకి కొవిడ్​ వైరస్​ ప్రవేశించేందుకు సాయపడుతుంది. అలాంటి ఏసీఈ2 గ్రాహకాలు పేగుల్లోనూ ఉంటాయి. ముక్కు ద్వారా ప్రవేశించిన కొవిడ్​ వైరస్​ పేగుల వరకు చేరుతుంది. ఆ తర్వాత రక్త నాళాలను మూసివేస్తుంది. పేగుల్లో గ్యాంగ్రీన్​ ఏర్పడేందుకు కారణమవుతుంది. ఈ వ్యాధి పెరిగినకొద్దీ పొట్టలో భరించలేని నొప్పి వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.