Nancharaiah merugumala senior journalist:
” అయోధ్యలో రామ్ లల్లా గుడికి పరోక్షంగా పునాదులేసిన పండిత నెహ్రూ, జీబీ పంత్, పీవీలకు రావాల్సిన కీర్తి ప్రధాని నరేంద్ర మోదీ సొంత ఖాతాలో పడిపోయింది!”
తనపై అభాండాలు, నిందలేసిన నగర ప్రజలపైన, పాలకుడిపైనా కోపంతో సీతాదేవి అయోధ్య నగరాన్ని శపించిందని కొందరు చెప్పగా విన్నాం. ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ, మథుర వంటి హిందువుల పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఉత్సాహం, సంపద, చలనశీలత అయోధ్యకు వేలాది సంవత్సరాలుగా లేవు. ఈ ప్రాచీన నగరిలో అడుగుపెడితే కనిపించేది నీరస వాతావరణమే. దీనికి కారణం సీతమ్మ శాపమే కారణమట. కాని, ఇప్పుడు అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణంతో సీతాదేవి తన శాపాన్ని వాపసు తీసుకున్నారని అనుకోవచ్చని అక్కడి హిందూ ప్రముఖులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, 1949 డిసెంబర్ 22–23 రాత్రి తొలి ప్రధాని పండిత జవాహర్ లాల్ నెహ్రూ, యూపీ ముఖ్యమంత్రి పండిత గోవింద్ వల్లభ్ పంత్ పాలనలో అయోధ్యలోని నాటి బాబరీ మసీదులోకి అభిరామ్ దాస్ అనే వ్యక్తి అక్కడి గార్డులు డ్యూటీ మారే సమయంలో రహస్యంగా చొరబడి రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహం పెట్టాడని చదువుకున్నాం. మసీదు నుంచి బాల రాముడి విగ్రహం తొలగించాలని పైకి ఆదేశాలు జారీ చేసిన నెహ్రూ జీ తనకు అత్యంత విధేయుడైన సీఎం పంత్ జీతో వాటిని అమలు చేయించలేదు. ఇలా 74 ఏళ్ల క్రితం చట్టవ్యతిరేకంగా ఓ వ్యక్తి చేసిన తప్పుడు పనిని లౌకిక సద్బ్రాహ్మణులైన ఈ ఇద్దరు కాంగ్రెస్ బడా నేతలు సరిదిద్దలేకపోయారు. నెహ్రూ, పంత్ ల దారిలోనే మరో కాంగ్రెస్ తెలుగు బ్రాహ్మణ ప్రధాని పాములపర్తి వేంకట నరసింహారావు గారు నడిచారు.
రామజన్మభూమి ఉద్యమంలో పీవీ నరసింహారావు పాత్రే కీలకం.
రామ్ లల్లా విగ్రహం మసీదులో చేరిన 43 ఏళ్లకు అంటే 1992 డిసెంబర్ 6న పట్టపగలే బాబరీ మసీదును కాషాయ కార్ సేవకులు నేలమట్టం చేయడానికి ప్రధాని హోదాలో ఆయన పరోక్షంగా సహకరించారు. ఎట్టకేలకు భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం సాధ్యమైంది. బాల రాముడి మందిర నిర్మాణానికి ఏడున్నర దశాబ్దాల క్రితమే పునాదులు వేసిన జవాహర్ జీ, జీబీ పంత్ జీలు మొదలెట్టిన పనిని పీవీ నరసింహారావు చాలా వరకు పూర్తిచేశారు. ఇలా కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బలమైన లౌకిక ప్రధాని నెహ్రూ, ఉత్తరాఖండీ బ్రాహ్మణ పరివారంలో జన్మించిన జీబీ పంత్, తెలంగాణ బ్రాహ్మల ఇంట కన్ను తెరిచిన పీవీ మూడు దశాబ్దాల క్రితం 75 శాతానికి పైగా పూర్తిచేసిన పుణ్యకార్యానికి గుజరాతీ ఘాంచీ–తేలీ ప్రధాని నరేంద్ర మోదీ చక్కటి ముగింపు 2024 జనవరి 22న ఇచ్చారు. అందుకే, రామ్ లల్లా విగ్రహం కుడివైపున నిలబడి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేసే అవకాశం పొందారు. మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాగాని చేతుల్లో ‘రాజ్యాధికారం’ లేకపోవడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ రావ్ భాగవత్ విగ్రహం ఎడమ వైపు నిలబడి మోదీ కన్నా తక్కువ పాత్ర పోషించాల్సి వచ్చింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో రామ్ లల్లా విగ్రహం ముందు ఉన్న బ్రాహ్మణ పురోహితులు లేదా పూజారులను మినహాయిస్తే–అక్కడ ముందు వరుసలో ఉన్న నలుగురు వీవీఐపీలలో (మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, మోహన్ భాగవత్)లలో ఆరెసెస్ చీఫ్ భాగవత్ ఒక్కరే బ్రాహ్మణుడు కావడానికి ఇదే అసలు కారణం. ముగ్గురు ఒరిజినల్ బ్రాహ్మణ నేతలు నెహ్రూ, పంత్, పీవీ చేసిన కృషిని మరుగున పడేసిన మోదీ– రామ్ లల్లా విగ్రహం ముందు సోమవారం చరిత్రాత్మక పాత్ర పోషించడం కోట్లాది మంది భారతీయులు చూశారు. సీతమ్మ శాతంతో కునారిల్లిపోయిన అయోధ్య ఇప్పుడు కోట్లాది రూపాయల పెట్టుబడులు ఆకర్షించే దిశగా వేగంగా కదులుతోంది. తమిళనాడులోని ప్రాచీన నగరం మదురై రెండు వేల సంవత్సరాల క్రితం కణ్ణగి అనే మహిళ శాపం నుంచి త్వరగా విముక్తిపొందిందని, దానికి కారణం మదుర మీనాక్షి జోక్యమేనని కూడా చెబుతారు. సీతాదేవిని రెండోసారి బయటకు పంపించిన నేరానికి అయోధ్య లక్షలాది సంవత్సరాలు సిరిసంపదలు లేకుండా ఎన్నెన్నో బాధలు అనుభవించింది. మందిర నిర్మాణంతో జానకి శాపం నుంచి అయోధ్య విముక్తి పొందిందని అక్కడి జనం సంబరపడుతున్నారు.