Nancharaiah merugumala senior journalist:
‘రామోజీ రావుకు భారతరత్న’ డిమాండ్ కమ్మ మాజీ ఎంపీ నుంచి ఒడిశా తెలుగు యాదవ ఎమ్మెల్యే వరకూ మద్దతు..!
‘ఈనాడు’ స్థాపకుడు చెరుకూరి రామోజీరావు గారు కన్నుమూసి 10 రోజులు దాటక ముందే ఈ దివంగత తెలుగుతేజానికి దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలనే డిమాండు ఊపందుకుంటోంది. మొదట ఆదివారం హైదరాబాద్ అమీర్ పేట కమ్మసంఘం హాలులో తెలుగు కమ్మ ప్రముఖులు జరిపిన సంతాపసభలో రాజమండ్రి మాజీ ఎంపీ, కమ్మ వ్యాపారవేత్త మాగంటి మురళీమోహన్ గారు మాట్లాడుతూ రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ మాజీ సినీ హీరో, రియలెస్టేట్ టైకూన్ ఈ డిమాండ్‌ను– కేంద్ర సర్కారు ముందు పెట్టిన రెండు రోజులకే పొరుగు రాష్ట్రం ఒడిశాలో తెలుగువారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న బర్హంపుర్ లేదా బరంపురం లేదా బ్రహ్మపుర నగర బీజేపీ ఎమ్మెల్యే, తెలుగు యాదవుడైన కుండల అనిల్ కుమార్ కూడా రామోజీరావు గారికి భారతరత్న ఇవ్వడమే ఆయనకు నిజమైన నివాళి అంటూ మంగళవారం సంతాప సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బరంపురం రామోజీ సంతాప సభలో మాట్లాడుతూ, కోట్లాది మంది తెలుగువారికి స్ఫూర్తిగా నిలిచిన రామోజీరావుకు భారత అత్యున్నత పురస్కారం తక్షణమే ఇవ్వాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. మొదట కమ్మ కులానికి చెందిన ప్రముఖుడు మాగంటి మురళీమోహన్ ఈ డిమాండ్‌ను హైదరాబాదులో చేసినాగాని వెంటనే తెలుగుజనం బాగా ఉన్న ఒడిశా నగరం బ్రహ్మపుర యాదవ ఎమ్మెల్యే కుండల అనిల్ కుమార్ అదే మాట తెలుగు జనసమూహం ముందు చెప్పడం రామోజీ గారికి కులాలకు అతీతంగా ఉన్న పేరుప్రఖ్యాతులకు నిదర్శనం. 2004 శీతాకాలం భారత మాజీ ప్రధాని పాములపర్తి వేంకట (పీవీ) నరసింహారావు గారు మరణించిన అనేక మాసాల తర్వాత ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండు అనేక మంది తెలుగు బ్రాహ్మణుల నోట మొదటిసారి వినిపించింది. ఆ తర్వాత ఆయన పాలనలో ఎక్కువ లబి ్ధపొందిన రెడ్లు, వెలమలు, కమ్మలు కూడా పీవీకి భారతరత్నం ఇవ్వాలనే డిమాండును పట్టుకుని చానాళ్లు వేలాడారు.
ఎన్టీఆర్ మాదిరిగానే రామోజీ కూడా తెలుగువారందరి ఉమ్మడి ఆస్తేనా?
అలాగే 1996లో కన్నుమూసిన అసలుసిసలు తెలుగుతేజం నందమూరి తారకరామారావు గారికి భారత రత్న ఇవ్వాలనే డిమాండు తొలుత ఆయన కులానికి చెందిన ప్రముఖుల నుంచిగాక ఇతర సామాజికవర్గాల నుంచి వచ్చింది. వెంటనే ఎన్టీఆర్ కుటుంబం, తెలుగుదేశం ఈ డిమాండుతో అడపాదడపా కేంద్ర ప్రభుత్వాలను కోరడం ఒక ఆనవాయితీగా ఇంకా జరగుతూనే ఉంది. అయితే, రామోజీరావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించాలనే ప్రతిపాదన పూర్వపు ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందిన మాగంటి మురళీమోహన్ కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్య కేంద్రస్థానమైన అమీర్ పేట సెంటరులోని కమ్మ సంఘం భవనం హాలు సభలో మొదట చేసినప్పటికీ బ్రహ్మపుర బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తెలుగు యాదవ నేత కుండల అనిల్ కుమార్ వెంటనే ఆ డిమాండును అందుకుని మంగళవారం మాట్లాడడం విశేషం. పీవీకి బ్రాహ్మణులు ఎక్కువ మంది, ఎన్టీఆర్ కు ఇప్పుడు ప్రధానంగా నందమూరి, నారా కుటుంబాల నేతలే అత్యధికంగా భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుతుండగా, కమ్మ కుటుంబంలో జన్మించిన రామోజీరావుకు నెమ్మది నెమ్మదిగా అన్ని తెలుగు కులాలవారూ ఆయనను భారతరత్నతో గౌరవించాలని అడగడం కీలక పరిణామం. కులాలకు అతీతంగా తెలుగు సమాజంలో రామోజీరావుకు ఆదరాభిమానాలు ఉన్నాయనే విషయాన్ని ఒడిశా బీజేపీ యాదవ ఎమ్మెల్యే మాటలను బట్టి అర్ధంచేసుకోవచ్చు. మంగళవారం తెలంగాణలో రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన బీసీ కులమైన మున్నూరు కాపులు కూడా హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు భవన్ (మ్యాడం అంజయ్య భవనం)లో సమావేశమై రామోజీరావుకు నివాళులర్పిస్తూ, ‘రామోజీరావు దేశ హితం, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా సేవలందించారు,’ అని చెప్పడం 1936లో పుట్టిన ఈ తెలుగు పెద్దమనిషి తన 87 ఏళ్ల జీవితంలో మొత్తం తెలుగు సమాజం మేలు గురించే ఆలోచించారనడానికి పెద్ద సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. గతంలో తెలుగు మూలాలున్న డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, మోక్షగుండం విశ్వేస్వరయ్య, వరహాగిరి వెంకటగిరి అనే ముగ్గురు బ్రాహ్మణ దిగ్గజాలకు వారి మరణానంతరం భారతరత్న పురస్కారం ఇచ్చాయి భారత ప్రభుత్వాలు. ఇప్పుడు గనుక రామోజీరావుకు భారతరత్న అవార్డును ఓబీసీ కుటుంబంలో పుట్టిన ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రకటిస్తే–తెలుగు వ్యవసాయకులాలకు చెందిన ప్రముఖుల సేవలను గుర్తించినట్టు అవుతుందని వేరే చెప్పాల్సిన పనిలేదు.