Rahulgandhi: రాహుల్‌ కి ముత్తాత నెహ్రూ జీ సాలు వస్తే మరో మూడేళ్లలో ప్రధాని పదవి!

Nancharaiah merugumala senior journalist: 

కాంగ్రెస్‌ ఏకైక అగ్రనేత రాహుల్‌ గాంధీకి బుధవారం 54 ఏళ్లు నిండిపోయాయి. ఆయన ముత్తాత (‘గ్రేట్‌’ గ్రాండ్‌–ఫాదర్‌!) పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ 57 ఏళ్ల ఆర్నెల్ల వయసు దాటాక భారత తొలి ప్రధానిగా (అది తాత్కాలిక జాతీయ ప్రభుత్వమే గాని పదవి పదవే కదా!) 1947 ఆగస్టు అర్థరాత్రి పదవిని చేపట్టారు. ఆయన తండ్రి రాజీవ్‌ గాంధీ 1984లో అక్టోబర్‌లో 40 సంవత్సరాల వయసులో భారత ప్రధాని అయ్యారు. తల్లి ఇందిరమ్మ కన్నుమూతతో చిన్న వయసులోనే ప్రధానిగా గద్దెనెక్కిన రాజీవ్‌ స్థాపించిన రికార్డు ఇంకా పగిలిపోలేదు. రాహుల్‌ అయ్యమ్మ (1960లు, 70ల్లో కృష్ణా జిల్లాలో నేటి నానమ్మ లేదా నాయనమ్మను ఇలాగే పిలిచేవారు) ఇందిరా ప్రియదర్శిని 48 సంవత్సరాలకే పెద్ద వాగ్ధాటి లేకున్నా ప్రధాని పీఠమెక్కారు. 1991 మే 21న రాజీవ్‌ జీ కనీసం 47 ఏళ్లు నిండకుండానే లంక తమిళ బెల్టు బాంబుకు బలి అయి మరణించారు. 1989 డిసెంబర్‌లో రాజీవ్‌ ప్రధాని పదవి నుంచి దిగిపోయాక నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యులెవరూ ఈ 34 సంవత్సరాల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం పొందలేకపోయారు. మరి, ముత్తాత పండిత నెహ్రూ సాలు వస్తే రాహుల్‌ భయ్యా కూడా 57 సంవత్సరాలు దాటిపోయాక ప్రధాని అయ్యే అవకాశం తన్నుకుంటూ వస్తుంది. అంటే మరో మూడేళ్లలో రాహుల్‌కు 57 నిండుతాయి. పార్లమెంటు ఎన్నికలేమో 18వ లోక్‌సభ పదవీకాలం ప్రకారం చూస్తే 2029 వేసవి వరకూ జరగవు. నెహ్రూ మాదిరిగా షష్ఠి పూర్తికి మూడేళ్ల ముందు రాహుల్‌ ప్రధాన మంత్రిగా రాష్ట్రపతి భవన్‌లో ఇప్పటి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా ప్రమాణం చేయాలంటే 2027లో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ సర్కారు కూలిపోయి గుజరాతీ రెండో ప్రధాని రాజీనామా చేసి కాశీలో గంగా తీరానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన రాహుల్‌ మరో భారత యాత్ర చేస్తే ముచ్చటగా మూడేళ్లలో ప్రధాని పదవి ఖాయంగా వద్దన్నా ఆయన ఒడిలో వచ్చి పడుతుందని ప్రసిద్ధ రాజకీయ జ్యోతిష్యులు అప్పుడే చెబుతున్నారు. అయితే, మోదీ సర్కారు మాత్రం బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మారుమనసు పొందడం వల్ల కూలుతుందేమోగాని ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాల కారణంగా జరగదనే విషయం మనం గుర్తుంచుకోవాలేమో! ఎందుకంటే కేంద్ర సర్కారును మూడేళ్ల తర్వాత అర్ధంతరంగా పడేసే ఉద్దేశంగాని, తీరికగాని చంద్రబాబు గారికి ఉండవు.