దేవర రివ్యూ:
ఎన్నో అంచనాలు.. ఎన్నో భయాలు.. ప్రమోషన్లు సరిగ్గా లేవు..అసలే భారీగా ప్లాన్ చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ కాస్త అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో దేవర సినిమాపై రకరకాల ఊహాగానాలు ప్రచారం. ఏదైతేనేం సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ అభిమానుల ఆశలు నెరవేరాయా? రాజమౌళి సెంటిమెంటు బ్రేక్ అయ్యిందా? సోలోగా పాన్ వరల్డ్ లో ఎన్టీఆర్ పాగా వేసినట్లేనా? ఇంతకు సినిమా ఎలా ఉంది) సమీక్షలో తెలుసుకుందాం..!
కథ:
దేశ సంపదను బ్రిటిష్ వాళ్ళు దోచుకొని ఇంగ్లాండ్ తీసుకెళ్తుంటారు. నాలుగు గ్రామాల ప్రజలు సైన్యంలా అడ్డుకొని సంపదను తమ దేశానికి తెచ్చుకుంటారు. కాల క్రమేణా అదే వాళ్ల వృత్తిగా మారిపోతుంది. ఓ గ్రామానికి నాయకుడైన ( దేవర) ఈ వృత్తికి స్వస్తి పలకాలని నిర్ణయిస్తాడు.కానీ ఇదే వృత్తిని నమ్ముకున్న భైర ( సైఫ్ అలీఖాన్) ఇతరులతో కలిసి దేవరను అంతమొందించాలని ప్రయత్నిస్తాడు. అసలు దేవ కొడుకు ( వర) ఏం చేస్తుంటాడు? నాలుగు ఊర్ల కోసం దేవర చేసిన త్యాగం ఏంటి? భైరవ కోరిక నెరవేరిందా? లేదా తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే..!
ఎలా ఉందంటే..?
దేవర సినిమాను ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగ్గట్టు తెరకెక్కించాడు కొరటాల. ఫస్ట్ ఆఫ్ ఒకే అని చెప్పవచ్చు. ఎర్ర సముద్రాన్ని పోలీసులు వెతుక్కుంటూ వచ్చే స్టార్టింగ్ సీన్ తోనే సినిమా నేపథ్యం ఏంటో తెలిసిపోతుంది. ఎన్టీఆర్ ఎంట్రీ సూపర్బ్. ఆయుధ పూజ పాట తర్వాత వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండ్ ఆఫ్ పర్వాలేదని చెప్పవచ్చు. ద్వితీయార్థంలో వర, జాన్వీ ఎంట్రీ ఉంటుంది. ఎన్టీఆర్- జాన్వీ లవ్ ట్రాక్ గాడి తప్పింది. క్లైమాక్స్ ట్విస్ట్ కొంతమంది ఊహించినా.. ఎలివేషన్స్ తో మేనేజ్ చేసేశారు. ఆయుధ పూజ పాట సినిమాకే హైలెట్.
కథకు తగ్గట్టు ఎమోషన్స్ మేళవించి హీరోయిజం పండించడంలో దర్శకుడు కొరటాల దిట్ట. మిర్చి ,శ్రీమంతుడు, భరత్ అనే నేను ” సినిమాలు ఆ కోవకు చెందినవే. దేవర ను సైతం ఆ విధంగానే తెరకెక్కించాడు. ” మనిషిని ధైర్యం బతికిస్తుంది..హాని కూడా చేస్తుంది ” అన్న కొత్త పాయింట్ ని ప్రజెంట్ చేశాడు శివ. అనిరుధ్ మ్యూజిక్ బాగుంది. అతను సినిమాకు మరో హీరో అని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. నిర్మాతలు రాజీ పడకుండా ఖర్చు చేశారు.
వన్ మ్యాన్ ఆర్మీ..!
వన్ మ్యాన్ ఆర్మీలా ఎన్టీఆర్ సినిమాను భుజాలపై మోశాడు. నటన పరంగా దేవర – వర పాత్రల్లో జీవించేశాడు. సరికొత్త డాన్స్ స్టెప్పులతో అలరించాడు. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ టాలీవుడ్ బెస్ట్ ఎంట్రీ అని చెప్పవచ్చు. నటన పరంగా జాన్వీ ఆకట్టుకుంది. చుట్ట మల్లె సాంగ్ తో కుర్రకారు హృదయాలను గెలుచుకుంది. సైఫ్ అలీఖాన్ ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించాడు. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే… ” ఎర్ర సముద్రంలో అలలా పోటెత్తిన దేవర..”
రివ్యూ రేటింగ్: 2.75/5 ( నోట్: సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)