కార్తీక మాసమహాత్మ్యం .. నాగుల చవితి విశిష్టీత..!!

ప్రకృతి మానవు మనుగడకు జీవధారమైనది.దీంతో ప్రకృతిలో నిక్షిప్తమై ఉన్న చెట్టు,పుట్ట,రాయి, కొండ ,కోన,నది, పర్వతాన్ని చెప్పుకుంటూ పోతే సమస్త ప్రాణకోటిని దైవస్పరూపంగా భావించి పూజించడం అనవాయితీగా వస్తోంది.ఇది భారతీయ పండగలోని విశిష్టతకు నిదర్శనదమని పురాణాలు చెబుతున్నాయి .ఇందులో భాగంగానే “నాగుపాము”ను దేవుడిగా భావించి పూజించడం సంప్రదాయం. ముఖ్యంగా కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. కార్తీక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుందన్నది భక్తుల నమ్మకం.

నాగుల చవితి..
నాగుల చవితి రోజున లక్ష్మీదేవిని పూజించి ముత్తైదువును ఆహ్వానించి.. బట్టలు పెట్టి, భోజనం పెట్టాలి. ఈ రోజున త్రిలోచన గౌరీవ్రతం ఆచరించాలని కూడా శాస్త్ర వచనం. వంశాచారాన్ననుసరించి నాగేంద్రునికి పుట్టలో పాలుపోసి, చలిమిడి, వడపప్పు, నువ్వులతో చేసిన తీపి పదార్థాలు మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. దీనివలన ప్రీతుడైన నాగేంద్రుడు ఆరాధించే భక్తులకు అనారోగ్యాలు, అరిష్టాలు కలగకుండా రక్షిస్తాడని పురాణ శాస్త్రం చెబుతోంది. నాగుల చవితినాడు రైతులు, ఇతర పనులు చేసేవారు పనిముట్లను ఉపయోగించరాదు.

జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు. కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’ మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు.

నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం..

ఈపర్వదినం రోజున ఊరిలో ఉన్న గుళ్ళలోని పుట్టలలో.. భక్తులు నాగేంద్రుని స్మరిస్తూ పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది అనాదిగా వస్తున్న ఆచారం.పాలు స్వచ్ఛతకు ప్రతీక.పాలను వేడి చేసి చల్లపరచి చేరిస్తే పెరుగవుతుంది. పెరుగును చిలుకగా వచ్చిన వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం.

”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

నాగుల చవితి మంత్రం..

పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందన్నది భక్తుల నమ్మకం.ఇకపోతే సర్పదేవతలు అనేకమంది ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలవడం ఆనవాయితీ. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషంతో పాటు కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.కావున కింద చెప్పిన మంత్రం పటిస్తూ నాగేంద్రుని కొలవాలని శాస్త్రవచనం.
అనంత
వాసుకి
శేష
పద్మ
కంబాల
కర్కోటకం
ఆశ్వతార
ధృతరాష్ట్ర
శంఖపాల
కలియా
తక్షక
పింగళ

భక్తులు పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చెప్పాలి..

నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.

పురాణ కథ ..

పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు .పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.

‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.

Related Articles

Latest Articles

Optimized by Optimole