పాత్రికేయుడు దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం

Hyderabad: ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డికి 2023 సంవత్సరానికి డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని అందజేయాలని తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్ణయించింది. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు కు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకునిగా, శోభ పత్రిక సంపాదకునిగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ఏటా పరిషత్తు అందజేస్తున్నది. ఈ సంవత్సరం పురస్కారానికి ఎంపికైన దిలీప్ రెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో సేవలు అందించడమే కాకుండా సమాచార హక్కు చట్టం కమిషనర్ గా, పర్యావరణ వేత్తగా విశిష్ట సేవలు అందించారని పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ ఉదయం 10:30 కు పరిషత్తులోని డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు కళామందిరం లో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేస్తామని, 25 వేల రూపాయల నగదు, శాలువా,జ్ఞాపికతో సత్కరిస్తామని వారు పేర్కొన్నారు.