Headlines

NarakaChaturdashi: నరకచతుర్దశి కథ ఏంటో తెలుసా..?

NarakaChaturdashi:

నరక చతుర్దశిని చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు కనుక ఆ పేరు వచ్చింది. అశ్వయుజ బహుళ చతుర్దశి రోజు నరకాసుర సంహారం జరిగింది గనుక అభ్యంగ స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుందని శాస్త్రవచనం. ఈ చతుర్దశి నాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్ళలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు. ఈ రోజున ఇంట్లోనూ.. ఆలయాల్లోనూ దీపారాధన చేయడం వలన శుభం జరుగుతుంది.

నరకాసుర వధ..పురాణ కథ:

వరాహ అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు- భూదేవికి జన్మించిన వాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు..తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం లేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వర గర్వితుడైన నరకాసురుడు.. అటు దేవతలను ఇటు మానవులను నానా బాధలు పెడతాడు. దిక్కుతోచని స్థితిలో దేవతలు మహావిష్ణువు సాయాన్ని ఆర్థిస్తారు. శ్రీకృష్ణ అవతారంలో నరకాసురుని సంహరిస్తానని మహావిష్ణువు వారికి హామీ ఇస్తాడు.

విష్ణువు కృష్ణ అవతారం ఎత్తినప్పుడు భూదేవి సత్యభామగా అవతరిస్తుంది. ఆకాలంలో నరకుడు దేవతల తల్లి అయినా అధితి కర్ణకుండలాలను అపహరిస్తాడు. పైగా 16,000 మంది రాజకన్యలను కూడా ఆపహరించి బందీ చేస్తాడు. అదితి సత్యభామకి బంధువు కావడంతో శ్రీకృష్ణుడు నరకుడిపై దండెత్తి యుద్ధం చేస్తాడు. యుద్ధంలో కృష్ణుడు సొమ్మసిల్లి పడిపోవడంతో సత్యభామ ఆగ్రహంతో ధనస్సు చేతపట్టి నరకాసురున్ని సంహరిస్తుంది. లోక కంటకుడైన నరకుడు పీడ వదలడంతో ప్రజలంతా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుంటారు.

పురాణ కథ ఇలా ఉంటే.. ధర్మశాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెప్తుంది.

ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగనస్నానం చేయాలి. యమధర్మరాజుకు నమస్కరించి..యమ తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెప్తుంటారు

Optimized by Optimole