karthikamasam: ‘కార్తీకమాసం’..పాపపరిహారం కోసం ఏం చేయాలి..?

Karthikamasam2024:  కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ మాసంలో వ్రతాలు.. నోములు.. ఉపవాసాలతో పాటు దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పరంజ్యోతిని ఆరాధన చేస్తున్నామని అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపనం చేస్తుంది. దీపానికి అంతటి శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఈ మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన అత్యంత పుణ్యదాయకమని పురాణ వచన.

 విశిష్టత:

కార్తీక మాసం మొదటి రోజున ఆలయాల్లో ఆకాశదీపం వెలిగిస్తారు. దీపాన్ని చిన్న పాత్రలో వెలిగించి ధ్వజ స్తంభానికి తాడు కట్టి పైకెత్తుతారు. ఈశ్వరునికి ఉత్సవ నిర్వహిస్తున్నామన్న భావనతో ఇలా చేయడం ఆచారం. పరమ పవిత్రమైన ఈ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి శివయ్యను పూజిస్తే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.

న కార్తీక సమో మాసో న కృతేన సమం యుగం
న వేద సదృశ్యం న తీర్థ గంగాయ సమమ్ ||
కార్తీకః ప్రవరో మాసో వైష్ణవానాం ప్రియః సదా ||
కార్తీకం స్కలం యస్తు భక్త్యా సేవతే వైష్ణవః

ఆధ్యాత్మికపరంగా చైతన్యానికి ప్రతికైన దీపానికి ఈ మాసంలో విశిష్ట స్థానం ఉంది. ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలు పెట్టడమే కాకుండా.. క్షీరాబ్ది ద్వాదశి.. కార్తీక పౌర్ణమి రోజులలో దీపాలను వెలిగిస్తే సర్వపాపహరణం..సర్వ దోష నివారణతో పాటు ఈశ్వరుని కృపకు పాత్రులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి.

Deepam

దీపం పరబ్రహ్మ స్వరూపం:

ఈశ్వర అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్యారాధన దీపారాధన. ఈ మాసంలో త్రికరణ శుద్ధితో దీపారాధన చేస్తే పాపాలహరించి.. సకల సౌభాగ్యాలు కలుగుతాయి. దేవుడు అనుగ్రహాన్ని పొందడానికి.. దివ్యజ్ఞానాన్ని సమూపార్జించడానికి.. ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి దీపారాధన ఒక పవిత్ర సోపానం. కార్తీక మాసంలో ఆలయాల్లో దీపారాధన చేయడం .. ముక్కోటి దేవతలను పూజించడంతో సమానమని.. సకల పుణ్య నదులలో స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని పండితులు చెబుతారు.

దీపజ్యోతులు:
* ఇంటిలో వెలిగించే దీపం దృష్టి దీపం
* తులసి కోట వద్ద వెలిగించే దీపం బృందావన దీపం
* పూజా సమయంలో వెలిగించే దీపం అర్చనా దీపం
* అనునిత్యం పూజలో వెలిగించే దీపం నీరంజన దీపం
* దేవాలయ గర్భగుడిలో వెలిగించే దీపం నందా దీపం
* లక్ష్మీదేవి ఆరాధనలో వెలిగించే దీపం లక్ష్మీ దీపం
* దేవాలయ ఆవరణలో బలిపీఠంపై వెలిగించే దీపం బలి దీపం
* దేవాలయాల్లో ఎత్తైన స్తంభంపై వెలిగించే దీపం ఆకాశదీపం
* కార్తీక పౌర్ణమి నాడు కోట్లాది భక్తులకు దర్శనమిచ్చే అరుణాచల జ్యోతి( తిరువన్నామలై) ఆత్మ రూపమైన దీపజ్యోతి.