Pandian: న్యాయం కోసం చేతిని నరికేసుకున్న రాజు కథ తెలుసా…??

 విశీ(వి.సాయివంశీ): 

క్రీస్తు పూర్వం 100-120 మధ్య పాండియన్ అనే రాజు పాండ్య రాజ్యాన్ని పాలించారు. ఆయనది చాలా నీతివంతమైన పాలన అని పేరు. నీతి, న్యాయం కో‌సం ఎంత సాహసానికైనా సిద్ధపడే తత్వం ఆయన సొంతం. ఆయన రాత్రుళ్ళు మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉండేవారు.

ఒకసారి ఆయన మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటి నుంచి ఆడ, మగ గొంతులు వినిపించాయి. వాళ్లిద్దరూ భార్యాభర్తలు. ఆ భర్త ఏదో దూర దేశానికి ఆ రాత్రే ప్రయాణమై వెళ్తున్నాడు. ‘రాజ్యంలో దొంగల భయం ఉంది. ఇలాంటప్పుడు మీరు లేకుండా నేను ఒక్కదాన్నే ఎలా ఉండాలి? నాకు రక్షణ ఏది?’ అని భార్య భర్తను అడుగుతోంది. దానికి ఆ భర్త “నేను లేకపోయినా నీకేమీ కాదు. మన రాజు పాండియన్ ఈ దేశ ప్రజలందరికీ కాపలాగా ఉంటారు. ఆయనే నీకు రక్ష” అని భరోసా ఇచ్చాడు.

ఈ మాటలు విన్న రాజు తన మీద అతనికి ఉన్న నమ్మకానికి చాలా ఆనందపడ్డాడు. ఆ రోజు నుంచి ప్రతి రాత్రీ మారువేషంలో ఆ వీధిలోకి వచ్చి ఆ ఇంటి దగ్గరకు వెళ్లి కాపలా కాసేవాడు. అలా రెండు నెలలు గడిచాయి. ఒకరోజు రాత్రి రాజు ఆ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆ స్త్రీ మరొక పురుషునితో చాలా సఖ్యంగా మాట్లాడటం వినిపిస్తుంది. అది ఆమె భర్త గొంతు కాదు. రాజుకు చాలా కోపం వచ్చింది. ‘భర్త ఇంట్లో లేని సమయంలో మరొక పురుషునితో ఇలాంటి పనులు చేస్తుందా? తన సంగతి తేల్చాల్సిందే’ అనుకుని కోపంగా ఆ ఇంటి తలుపు తట్టాడు.

ఆ స్త్రీ వచ్చి తలుపు తీసి చూసింది. రాజు ఆమెతో ఏదో అనబోయేలోగా “ఎవరు వచ్చింది?” అని వెనుక నుంచి భర్త పిలుపు వినిపించింది. “ఏమోనండీ! నాకూ తెలియదు” అని ఆమె మారువేషంలో ఉన్న రాజు వంక చూస్తూ సమాధానం ఇచ్చింది. లోపలి నుంచి వినిపించింది ఆమె భర్త గొంతే అని రాజుకు జ్ఞాపకం వచ్చింది. అంటే వచ్చింది ఆమె భర్తే! రెండు నెలల ప్రయాణం కారణంగా అతని గొంతు మారి ఉంటుంది. ఆ విషయం తెలియకుండా ఏదేదో ఊహించుకుని తప్పు చేశానని రాజుకు అర్థమైంది. కానీ ఇప్పుడు అసలు సంగతి బయటికి చెప్పలేడు. ఏమీ చెప్పకుండా వెళ్తే ఆ భర్తకు తన భార్య గుణం మీద అనుమానం రావచ్చు. అనవసరంగా ఒక అమాయకురాలి జీవితం అభాసుపాలవుతుంది. ఎలా? ఈ గండం తప్పేది ఎలా?

వెంటనే ఒక ఆలోచన చేసి రాజు అక్కడి నుంచి బయటకు వచ్చాడు. చుట్టుపక్కలున్న అన్ని ఇళ్ల తలుపుల మీదా తట్టి వెళ్లిపోయాడు. అందరూ నిద్ర మేలుకొని ఎవరో దొంగ వచ్చాడని అనుకున్నారు. తమ ఇంటికీ ఆ దొంగే వచ్చాడని ఆ భార్యాభర్తలూ భావించారు. అలా రాజు ఆ గండం నుంచి తప్పించుకున్నాడు.

తెల్లవారగానే నగరంలోని ప్రజలంతా రాజు ఆస్థానానికి వచ్చారు. రాత్రి ఒక దొంగ తమ ఇళ్ల తలుపులు తట్టాడని, వాడు నగరంలో సంచరిస్తూ ఉంటే తాము నిశ్చింతగా ఉండలేమని రాజుకు వివరించారు. దీనికి పరిష్కారం ఏమిటి అని రాజు ప్రజల్నే అడిగాడు. ఎలాగైనా ఆ దొంగను పట్టుకొని అతని కుడిచెయ్యి నరికేయమని కోరారు. అప్పుడు రాజు సరేనని లేచి, ఖడ్గంతో తన కుడి చెయ్యి నరికేసుకున్నాడు.

ఆస్థానంలో అధికారులు, ప్రజలు అందరూ ఆ ఘోరాన్ని చూసి దిగ్ర్భాంతి చెందారు. అప్పుడు రాజు వారితో మాట్లాడుతూ “మీ ఇళ్ల తలుపులు తట్టింది నేనే” అని వివరించాడు. రాత్రి జరిగిన విషయమంతా ప్రజలకు చెప్పాడు. న్యాయం కోసం తన చేతినే నరుక్కున్న రాజును చూసి ప్రజలంతా జయజయధ్వానాలు చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి పోయిన చెయ్యి స్థానంలో రాజుకు బంగారు చెయ్యి మొలిచింది. అప్పటి నుంచి అతణ్ని ‘పొర్కై(బంగారు చెయ్యి) పాండియన్’ అని పిలవడం మొదలుపెట్టారు.

తమిళ ప్రాచీన చరిత్రలో నిజాయితీ, న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని వివరించేందుకు ‘పొర్కై పాండియన్’ కథను తమిళనాడులో ఇప్పటికీ చెప్తూ ఉంటారు..!