EENADU: ‘ఈనాడు’ అక్షరం, రేపటికి గవాక్షం..!

ఆర్. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:

యాభయ్యేళ్లు, అంటే… అర్థశతాబ్ది చరిత్ర ఈ మూడక్షరాలు! ఈనాడు తెలుగు సమాజంతో అయిదు దశాబ్దాలు నిండుగా మమేకమైన దినపత్రిక. సమాచారం, సందేశం, జ్ఞానం, వినోదం, వికాసం, చేతన, ప్రేరణ, సంస్కృతి, సహాయం, సాహిత్యం, భాష, బంధం…. ఒకటేమిటి? ఇలా లెక్కలేనన్ని విధాలుగా తోడ్పడుతూ తెలుగు వారి జీవితాలతో పెనవేసుకున్న అక్షరాల అనుబంధం ఈనాడు.

దీర్ఘకాలిక వ్యూహం, పక్కా ప్రణాళికతో… యాబై యేళ్ల కింద, సరిగ్గా ఇదే తేదీ (ఆగస్టు 9)న, సముద్రతీర నగరం విశాఖపట్నంలో మొదలైన ప్రస్తానం అలా…అలా… ఆంధ్ర నేల అంతటా, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో, దేశ రాజధాని ఢిల్లీలో, ఇంకా ఎక్కడెక్కడో విస్తరిస్తూ, నిర్విఘ్నంగా నేటికీ కొనసాగుతూనే వుంది. దినపత్రిక తో మొదలై… వార, మాస, ఆంగ్ల పత్రికలుగా, పలు భాషా టీవీ చానళ్లుగా, వెబ్ సైట్లుగా, డిజిటల్ మీడియాగా…. బహుముఖీనమై ‘మీడియా మొగల్’ అనే కీర్తి కిరీటం తన యజమానికి దక్కేలా విస్తరించిన శాఖోపశాఖల వటవృక్షం ఈనాడు!

పలుకుబడి సమాజంలో పుట్టి, కమ్యూనిస్టు భావజాలంతో పెరిగి, వ్యాపార నైపుణ్యాలతో ఎదిగి, క్రమశిక్షణాయుత జీవితంతో ఒదిగి, రాజకీయ ఆదర్శాలు-లక్ష్యాలతో పలు పార్శ్వాలకు విస్తరించిన … రామోజీరావు మానస పుత్రిక, పేరు-ప్రఖ్యాతులు పొం’దిన పత్రిక’ ఈనాడు. స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరులూదిన కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక లు కాస్త వన్నె తగ్గుతున్న క్రమంలో….తెలుగునాట వెలిగింది ఆంధ్రప్రభ! దీర్ఘకాలం అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికగా ఉన్న ఆంధ్రప్రభ ను అధిగమించి, ఆ ట్యాగ్ ను సొంతం చేసుకున్న నుంచి, ఇవాల్టి వరకు తెలుగు పత్రికా రంగంలో ఎదురులేకుండా నిలిచిన ఆదిపత్యం ఈనాడు సొంతం. ఎదురులేని ఈనాడు ను గట్టిగా డీకొన్నట్టు ధీటుగా వచ్చిన ‘ఉదయం’ కొంతకాలం, ‘వార్త’ కొంత కాలం… ఎంతో కొంత పోటీ ఇచ్చినా, అవి నిలబడలేకపోయాయి. భారీ హంగు-ఆర్భాటంతో వచ్చిన ‘సాక్షి’ ఎక్కువ కాలమే గట్టిపోటీ ఇచ్చినా…. స్పష్టమైన ఆధిక్యంతో ఈనాటికీ, ఈనాడును అదిగమించలేకపోయింది.

జర్నలిజంలో ఓనమాలు..

నేను జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నది ఈనాడు తోనే! 1989 తో మొదలెట్టి, దాదాపు 17 ఏళ్లు….. వివిధ బాధ్యతల్లో అక్కడ పనిచేస్తున్నప్పుడు ఎన్నెన్ని నైపుణ్యాలు నేర్చుకున్నానో, మరెన్ని అవకాశాలు పొందానో, ఎంతగా వైవిధ్యభరిత అనుభవం గడించానో….. లెక్కే లేదు. అది నా జర్నలిజం బడి! ఈనాడు లో ఉన్నపుడే కాదు, అక్కడ మానేసిన తర్వాత కూడా….. అదంటే గౌరవం, అది నాకొక గర్వకారణమైన జీవితానుబంధం! ఏ కోణంలో చూసినా…. నా జీవితాన్ని మలుపు తిప్పిన పటిష్ట భూమిక. ‘ఈనాడు యాభయేళ్ల పండుగ- స్వర్ణోత్సవం అంటే, నా మనసును పులకింపజేసే వేడుక! ఇటీవలే కన్ను మూసిన రామోజీరావు, ఇంకో రెండు, మూడు నెలలు బతికుంటే …. ఈ సంబరం కూడా చూసి, ఎంతగానో ఆనందించి వుండేవారు కద! అని, ఎక్కడో మనసు మూలల్లో, అడుగు పొరల్లో నాదొక నస.

అంతకు ముందరి పత్రికలు తరచూ విఫలమైన చోట, మనసు కేంద్రీకరించి నిలవటమే రామోజీరావు గెలవటంలో వున్న విజయ రహస్యం. అందుకే, రాజకీయ పంథా, దృక్పథం, వైఖరి పరంగా ఈనాడును నిరతం నిందించే, తూలనాడే, విమర్శించే కాంగ్రెస్ నాయకులు కూడా ఈనాడు కొనక వదలని, చదవక తప్పని పరిస్థితి కల్పించడమే…. ఆయన వృత్తి-వ్యాపార మేళవింపులోని గొప్పతనం! ఈనాడు పత్రికా ప్రతి, అనునిత్యం సూర్యుడితో పోటీపడేదంటే అతిశయోక్తి కాదు! క్రమం తప్పకుండా, సూర్యోదయంతోనో, ఇంకొంచెం ముందుగానేనో…. సమస్త సమాచార పేటి, తెలుగు గడపల్ని తట్టడం మీడియా రంగంలో విశ్వాసపు ఒరవడిగా నిలిచింది. రాజకీయంగా, భావజాలపరంగా నచ్చనివారు కూడా… పొద్దున్నే పేపర్ చదివే అలవాటుకు రాజీపడలేక, తప్పకుండా కొనితీరాల్సినంత అస్తిత్వం, అనివార్యత మూటగట్టుకున్న ముచ్చట ఈనాడు.

రాజకీయ వైఖరిపరంగా, “కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకం, తెలుగుదేశం కు పచ్చి అనుకూలం” అని ముద్రపడ్డా…. దాని ప్రతికూల ప్రభావం సర్క్యులేషన్ పై పడకుండా నడువగల సత్తా అలవర్చుకున్న అరుదైన పత్రిక! రామోజీరావు పెంచి, పోషించిన… చిట్ఫండ్ వ్యాపారాల నుంచి సినిమా నిర్మాణాల దాకా, సోమా డ్రింక్-ప్రియా పచ్చళ్ల తయారీ నుంచి ఫిలిం సిటీ ఆవిష్కరణల దాకా మూలధనం-ఇంధనం ఈనాడు.

 

తెలుగునాట ‘ఈనాడు’ ఒక విలక్షణ ట్రెండ్ సెట్టర్! ఒక చెరగని బ్రాండ్ ఇమేజ్! తెలుగు సమాజంలోనే కాకుండా భారత మీడియా రంగంలో… అర్ధశతాబ్దిగా వన్నెతగ్గని ఓ నడుస్తున్న చరిత్ర ఈనాడు. నేటి అక్షరం, రేపటికి గవాక్షం..!

Related Articles

Latest Articles

Optimized by Optimole