KishanRao: పరహితునకు ఎదురులేదు..నివాళి..!!

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్):

ఈయనకు ఇంత దైర్యం, సాహసం… నిజంగా ఎక్కడి నుంచి వచ్చాయి అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉండేది. నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త రోజుల నుంచీ చూస్తున్నా! 80ల చివర్లో, 90ల ఆరంభంలో….. ఎన్ని నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు నడిపారో! 88 యేళ్ల నిండు జీవితం ఒక సాహస ప్రయాణం!

పటాన్ చెరు, దాని చుట్టుపక్కల జరిగిన చాల కాలుష్య వ్యతిరేక ఉద్యమాలకు డాక్టర్ ఏ కిషన్ రావు గారు కేంద్రబిందువుగా వుండేది. పట్టుమని పది కూడా లేని ఫార్మా కంపెనీలు, కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా యధేచ్చగా బయటకు వదిలేసే విష రసాయనాలతో గాలి, నీరు సహా పరిసరాలంతా కాలుష్యమైపోతున్నాయి. జనం అల్లాడి పోతున్నారు. రకరకాల జబ్బులు, క్యాన్సర్లు, గర్భస్రావ్యాలు, వైకల్యజననాలు, అకాల మరణాలు, పశువుల చావులు…. ఒక్కటేమిటి? చెప్పలేనన్ని అనర్ధాలతో పటాన్ చెరు, చుట్టుపక్కల గ్రామాలన్నీరోజు రోజుకు నరకం కింద (the hell on the earth) మారిపోతున్నాయి. నక్కవాగు నరకకూపమైంది. భూగర్భజలాలు కాలుష్యమైపోయి బోర్లలో వచ్చే నీరంతా రసాయనమే! నాటి నుంచి నేటికీ… బయట పటాన్ చెరు పేరు ప్రస్తావనకు వచ్చే ప్రతి పది సందర్బాల్లో, 8 లేదా 9 సార్లు కాలుష్య విషయంగానే అంటే అర్థం చేసుకోవాలి. ఈ అంశం మీద రీసర్చ్ చేసి, ఆ రోజుల్లోనే 18 మంది పీహెచ్ డి లు పొందారు. న్యూయార్క్ టైమ్స్ ఓ న్యూస్ సిరీస్ నడిపింది.


మెడికల్ డాక్టర్ గా వుండి, నర్సింగ్ హోమ్ నడుపుకుంటున్న డా.కిషన్ రావు పరిస్థితులు చూసి చలించిపోయారు. తన వద్దకు వచ్చే రకరకాల రోగుల్ని చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కాలుష్యకారక కంపెనీలకు, సర్కారు ఉదాసీనత-నిర్లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే తప్ప ఉపశమనం లేదని గ్రహించారు. చేస్తున్న సర్కారు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. ప్రొ.పురుషోత్తమ్ రెడ్డి, చిదంబరం, డా. దొంతి నర్సింహారెడ్డి వంటి వారితో కూడి నిరంతర పోరాట కార్యక్రమాలతో ఉద్యమాన్ని బలోపేతం చేశారు. పోలీసు లాఠీదెబ్బలు తిన్నారు. అక్రమ నిర్బంధాలకూ వెరవలేదు. న్యాయస్థానాలకూ ఎక్కారు. సుప్రీంకోర్టు దాకా వెళ్లి …. ఎమ్సీ మెహతా వంటి సీనియర్ అడ్వకేట్లు, జస్టిస్ కుల్దీప్ సింగ్ వంటి న్యాయమూర్తులు పటాన్ చెరు సందర్శించేలా చేశారు. కాలుష్య కారక కంపెనీలకు షరతులు, మార్గదర్శకాలు, కాలుష్య నియంత్రణ మండలి (PCB) బలోపేతానికి చర్యలు, బాధితులకు నష్టపరిహారంతో సహా పలు పరిణామాలకు కారకులయ్యారు.
ఈ పోరాటాల క్రమంలో డా.కిషన్ రావు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో! పోలీసు నిర్భందాలు, లాఠీ దెబ్బలు, చీత్కారాలు, అవమానాలు, కంపెనీ కిరాయి గూండాల భౌతిక దాడులు, ఇంటి మీదకు వచ్చి చేసే బెదిరింపులు…. వేటికీ ఆయన వెరవలేదు. అన్నీ ఎదురొడ్డి నిలిచారు. బతుకంతా పోరాటంతోనే గడిపారు. తన చుట్టూ వున్న సామాన్య జనం కోసం, వారి స్వేచ్ఛా మనుగడ కోసం, ఆరోగ్య జీవనం కోసం…..రాజకీయ, అధికార, కంపెనీల యాజమాన్య వ్యవస్థల్ని సమర్థంగా ఎదుర్కొని నిలబడ్డ ధీరోదాత్తుడు డా.కిషన్ రావు.


ఈయనకు ఇంతటి దైర్యం, మనో నిబ్బరం ఎక్కడి నుండి లభించింది? ఏమిటి సోర్స్ అని నేను ఆలోచించేది. ప్రకృతి పట్ల అనురక్తి, పర్యావరణం పట్ల స్పృహ, సాటి మనుషులకు సహాయపడాలన్న ఉన్నత ఆశయం వల్లే ఆయనకు ఇదంతా సాధ్యమైందేమో అనిపిస్తుంది. నిజమే కద! పరోపకార కారణజన్ములు అలాగే ఉంటారు.
సాగరమధన సమయంలో….. పుట్టిన హాలాహలాన్ని, సృష్టి రక్షణ కోసం స్యయంగా తాగడానికి స్వీకరిస్తూ మహాశివుడు పార్వతితో అన్న(ట్టు బమ్మెర పోతన చెప్పిన) మాటలు నాకు గుర్తొస్తున్నాయి.

కం :
పరహితము కోరునెవ్వడు
పరమహితుండగును భూత పంచకమునకున్,
పరహితమె పరమ ధర్మం,
పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖీ!

(పరహితుడు డా.ఎ. కిషన్ రావు గారికి నివాళి.88)