రైతుల ఆందోళన హింసాత్మకం!

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ లో, రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రూట్ మ్యాప్ విషయంలో రైతులు భిన్నంగా వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అల్లరిముకలు భద్రత సిబ్బంది పై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటికి రావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పారమిలటరీ బలగాలను మోహరించింది.

ఇక రైతుల ఆందోళన ముందుగా చెప్పిన దారిలో కాకుండా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న ఎర్రకోట మార్గంలోకి ట్రాక్టర్లతో సాగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లును తొలగిస్తూ ట్రాక్టర్లతో దూసుకురావడంతో పోలీసులు వారిపై బాష్ప వాయువు ప్రయోగించారు. ఈ దాడిలో పోలీసులకు, రైతులకు తీవ్ర గాయాలయ్యాయి.కాగా వ్యవసాయ చట్టాల విషయంలో రైతులకు , కేంద్ర ప్రభుత్వం మధ్య 11 దఫాలుగా జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదు. దీంతో ఆందోళన తెలిపేందుకు ట్రాక్టర్ ర్యాలీ కి అనుమతి కోరగా ప్రభుత్వం మొదట నిరాకరించిన, రైతుల శాంతియుత ర్యాలీ హామీ మేరకు అనుమతించింది. రైతులు హామీని విస్మరించిన నేపథ్యంలో ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందోన్న చర్చ జరుగుతోంది.