Telangana:
రుణమాఫీతో తమది రైతు అనుకూల ప్రభుత్వమని నమ్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం భారీ ఎత్తున ప్రకటనలకు, సంబరాలకు కోట్ల రూపాయిల్ని ప్రభుత్వం మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. మొదటి విడతలో చేసిన మాఫీతో అన్నదాతలందరూ తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ రుణమాఫీ సంపూర్ణంగా లేకుండా ఒక మాయాజాలంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం పారదర్శకతతో అమలు చేస్తేనే తెలంగాణ రైతులు హర్షిస్తారు. కొసరు మాఫీకే హడావుడి చేసేకన్నా చిత్తశుద్ధితో హామీ ఇచ్చినట్టు సంపూర్ణంగా రుణమాఫీ చేస్తే రైతన్నల ఆదరణ చూరగొంటారు, లేకుంటే ఆన్నదాతల ఆగ్రహానికి గురవుతారు.
కాంగ్రెస్ నాయకుల మాటలు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ ‘వరంగల్ డిక్లరేషన్’లో తీర్మానం చేసి, దీన్ని ‘అభయహస్తం’ మేనిఫెస్టోలోనూ పొందుపరిచి తెలంగాణ రైతాంగానికి లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. రుణమాఫీకి సంబంధించి అర్హతలు, షరతులు ఉంటాయని అప్పుడు మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు అమలు చేసేటప్పుడు మాత్రం అనేక షరతులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
రేషన్ కార్డు ఉన్నవారికే మాఫీ అని ఒకసారి, పాస్ పుస్తకం ఉన్న వాళ్లకే మాఫీ అని మరోసారి, కుటుంబంలో ఒక్కరికే మాఫీ అంటూ ఇంకోసారి అని ఇలా రకరకాల మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిబంధనల వల్ల పెద్ద సంఖ్యలో రైతులు రుణమాఫీకి అనర్హులవుతారని విమర్శలు రావడంతో, రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని, పట్టపాస్ పుస్తకం ఉన్న ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తీరా అమలు చేసేటప్పుడు మాత్రం వాళ్లు అనుకున్నదే చేశారు. సరైన సమాచారం ఇవ్వకుండా లబ్దిదారుల సంఖ్యను తగ్గించేశారు. దీంతో లిస్టులో తమ పేరు ఎందుకు రాలేదో, ఎందుకు తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదో తెలుసుకోవడానికి లక్షలాది మంది రైతులు బ్యాంకులు, సొసైటీలు, వ్యవసాయ అధికారుల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాసే దుస్థితి తీసుకొచ్చారు. ప్రభుత్వం రుణమాఫీపై ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్స్కి భారీగా వస్తున్న రైతుల సంఖ్యను చూస్తే ఎంతమంది ఆవేదన చెందుతున్నారో అర్థమవుతుంది. గ్రీవెన్స్ సెల్స్లో అధికారులు సైతం రుణమాఫీపై రైతులకు స్పష్టత ఇవ్వలేని పరిస్థితులున్నాయి.
క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం రైతులు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు రెండు రకాలుగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం వడ్డీ కట్టి లోన్ రెన్యువల్ చేసుకున్నవారు ఒక వర్గం రైతులు కాగా, విడతలవారీగా రుణమాఫీ చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి రుణాలకు వడ్డీలు చెల్లించకపోవడంతో అసలు కన్నా వడ్డీలే ఎక్కువ కట్టాల్సిన రైతులు రెండో వర్గంలో ఉన్నారు. రెండో వర్గం రైతులు చెల్లించాల్సిన రుణాలను బ్యాంకు వాళ్లు మొండి బకాయిలు అని పిలుస్తున్నారు.
ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన రుణమాఫీలో క్రమం తప్పకుండా రెన్యువల్ చేసిన రైతులకు లక్ష రూపాయిల వరకు లబ్ది జరిగింది. కానీ, తీసుకున్న రుణం లక్షలోపే అయినా వడ్డీలతో లక్ష దాటి, మొండి బకాయిల జాబితాలోకి వెళ్లిన రెండో వర్గం రైతులకు రుణమాఫీ జరగలేదు. అదే నెలలో రేవంత్రెడ్డి ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ… ‘‘రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… ఇప్పుడు రుణమాఫీ అయినోళ్లు వెంటనే బ్యాంకుకు పోయి మళ్లీ రూ.2 లక్షల రుణం తీసుకోండి. డిసెంబర్ 9వ తేదీన నేను మాఫీ చేస్తా..’’ అని ప్రకటించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా నాడు 10 నెలల కింద లబ్ది పొందిన రైతులకే మళ్లీ రుణమాఫీ జరిగినట్లు జాబితాలున్నాయి. లక్షలోపు రుణమాఫీ అయిన రైతుల్లో కూడా చాలామందికి అసలు మాఫీ అయ్యి, వడ్డీ అలాగే ఉండటంతో ప్రభుత్వం చెప్తుంది తప్పని తెలుస్తుంది. 2018 వరకు తీసుకున్న రుణాలను కేసీఆర్ సమయానికి మాఫీ చేయకపోవడం వల్ల నాడు వడ్డీలు పెరిగాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాన్చుడు ధోరణితో రైతు మాఫీ తేదీని డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 15 వరకు లాక్కురావడం వల్ల కూడా చాలామంది రైతులు వడ్డీలు కట్టలేదు. కాంగ్రెస్ రుణమాఫీ హామీని నమ్మి, రుణాలను చెల్లించకపోవడంతో రైతుల వడ్డీలు తడిసి మోపడయ్యాయి.
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో మాయాజాలం ఉంది. తెలంగాణలో వ్యవసాయ రుణాల ఖాతాల సంఖ్య 64,90,228. వీటి ద్వారా రైతులు తీసుకున్న రుణం మొత్తం రూ.79,387 కోట్లు. అంటే తెలంగాణలో రైతులు రుణ విముక్తులు కావాలంటే రూ.79,387 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ విడుదల చేసింది కేవలం రూ.6098 కోట్లు. చేయాల్సిన దానిలో పదో వంతు కూడా చేయలేదు. దీంతో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న 11 లక్షల రైతులకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. తెలంగాణలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 40 లక్షల పైగానే ఉన్నారు. అంటే 30 లక్షల మంది రైతులకు కాంగ్రెస్ సర్కార్ కుచ్చుటోపీ పెట్టింది. ఆగస్ట్ 15 వరకు రూ.31వేల కోట్లు విడుదల చేస్తామంటున్నారు. అయినా సగం రైతుల రుణాలకు కూడా ఇది సరిపోదు.
రైతులకు పూర్తిగా న్యాయమే చేయలేదు కానీ, అన్ని చేసేశామన్నట్టుగా బడాయిలతో హడావుడి చేస్తూ ఇప్పుడు ప్రజాధనాన్ని వృథా చేయడానికి వరంగల్లో కృతజ్ఞత సభకు తెరలేపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటనలు, సంబరాల కోసం ప్రజానిధులు ఖర్చు చేస్తున్నారని నిత్యం విమర్శించిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక అదే బాటలో నడుస్తున్నారు. న్యూస్ పేపర్లలో ఫుల్ పేజీ యాడ్లు, టీవీ చానళ్లు, డిజిటల్ మీడియాలో యాడ్లు, పెయిడ్ న్యూస్, క్షీరాభిషేకాల హడావుడి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవికత కన్నా ప్రచారానికే అధిక ప్రాధాన్యతిస్తున్నట్లుంది.
2018 డిసెంబర్ 12 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు సంబంధించి 2023 డిసెంబర్ 9వ తేదీ నాటికి బకాయి ఉన్న ప్రతి పంట రుణానికి రుణమాఫీ అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇందుకోసం రైతు సంఘాలతో, మేధావులతో చర్చలు జరిపి పారదర్శకంగా రైతులందరికీ మేలు జరిగేలా రుణమాఫీ అమలు చేయాలి. రుణమాఫీ తర్వాత కాంగ్రెస్ ‘అభయహస్తం’ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందజేసి రైతులను ఆదుకోవాలి. భూమి ఉన్న రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా ఇందిరమ్మ రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం అందించాలి. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లించాలి. లేదంటే వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీ అప్పుల్లో అన్నదాతలు చిక్కుకోవడం ఖాయం. ఇవన్నీ పూర్తి చేస్తేనే మాది రైతు ప్రభుత్వం అని కాంగ్రెస్ నిరూపించుకోగలుగుతుంది.
రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, పంటలకు మద్దతు ధర అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రైతులకు పలు హామీలిచ్చింది. ఇవి రైతులకు దక్కాల్సిన న్యాయమైన హక్కులు. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీలన్నింటినీ సంపూర్ణంగా అమలు చేస్తేనే రైతులు హర్షిస్తారు. లేదంటే పరిణామాలు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహుమతిగా ఇచ్చిన ‘నా గొడవ’ పుస్తకంలో కాళోజీ రాసిన ఒక కవితలా ఉంటాయి. ‘‘వర్తకుని వ్యాజ్యాలు… వక్కీళ్ల వాదాలు/ సైనికుని శౌర్యాలు… యాంత్రికుని యంత్రాలు/ యోధుల యుద్ధాలు… రాజుల రాజ్యాలు/ కర్షకా! నీ కర్రు కదిలినన్నాళ్లే!!’’ అంటాడు ప్రజా కవి కాళోజీ. అన్నదాతలు ఆనందంగా ఉన్నంతవరకే ప్రభుత్వాలు ఇబ్బందులు లేకుండా అధికారంలో ఉంటాయి. అలా కాకుండా, అధికారం మాదే అనే భావనతో మేమేమీ చేసినా చెల్లుతుంది అన్నట్టు వ్యవహరిస్తే అన్నదాతలు, ప్రజలు కాలంబు రాగానే కాటేసి తీరుతారు!!
=====================
– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ.