విశీ( సాయి వంశీ):
The Terrorist.. ఒక తీవ్రవాది అంతర్మథనం
కళైవాణి రాజరత్నం.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? పుట్టింది శ్రీలంకలోని జాఫ్నాలో కైతడి అనే ఊరు. శ్రీలంకలోని మట్టకళప్పు అనే పట్టణంలోని స్కూల్‌లో కొంతకాలం చదివారు. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడే LTTE(Liberation Tigers of Tamil Eelam)లో చాలా చిన్న వయసులోనే చేరారు. అక్కడే తన పేరు ‘తెన్‌మొళి’గా మారింది. ఆమెకు తల్లి, ఒక అన్న, ఇద్దరు అక్కలు ఉన్నారు.
ఇదంతా ఎందుకు? ఆమె సంగతులతో పనేంటి? ఉంది. రాజీవ్ గాంధీ హత్యకు కారణమైన మహిళ ఆమె. అవును! ఆరోజు మానవబాంబుగా మారి ప్రధాని ప్రాణాలతోపాటు తన ప్రాణాలను తీసుకున్న వ్యక్తి కళైవాణి రాజరత్నం అలియాస్ తెన్‌మొళి అలియాస్ ధను. ఆ బాంబు కారణంగా దాదాపు 16 మందికి పైగా మరణించారు. కళైవాణి తండ్రి రాజరత్నం. ఆయన ఎల్‌టీటీఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్‌కి గురువు. ఎల్‌టీటీఈ ఏర్పాటు కోసం ప్రభాకరన్ ఆలోచనలను మలిచిన వ్యక్తి. ఆయన 1975లో మరణించారు. అప్పటికి కళైవాణి వయసు ఏడేళ్లు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ పోరాటంలో ఆమె తన అన్నని కోల్పోయారు. వారి ఆశయ సాధన కోసం ఆమె ఎల్‌టీటీఈలో చేరారు. అక్కడే రాజీవ్‌గాంధీ హత్యలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు.
సరే! ఇప్పుడు ఆమె నేపథ్యం తెలిసింది. ఆమె చేసిన పని తెలిసింది. ఆమెను ఎలా చూడాలి? ఒక తీవ్రవాదిగానా? హంతకురాలిగానా? తనవారి కోసం పోరాడే యోధురాలిగానా? తనవారి ఆశయాల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని వీరవనితగానా? చిట్టచివరకు ఒక మామూలు మహిళగానా? ఎలా చూడాలి? ఒక దేశ ప్రధాని హత్యకు తాను కారణమవబోతున్నానని తెలిసిన క్షణం ఆమె ఏం ఆలోచించి ఉంటుంది? ఆయనతోపాటు తనూ ముక్కలైపోతానని తెలిసినప్పుడు ఆమెకు ఎలాంటి భావన కలిగి ఉంటుంది? ఒంటి మీద బాంబు పెట్టినప్పుడు ఆమెలో ఎలాంటి ప్రకంపనలు కలిగి ఉంటాయి? ఎన్ని జ్ఞాపకాలు, భయాలు, ఆలోచనలు, వ్యూహాలు ఆమెలో మెదిలి ఉంటాయి? అంత మొండి ధైర్యం ఎలా వచ్చింది? చావును లెక్కచేయని గుణం ఎలా అబ్బింది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. ఎందుకంటే ఇవాళ కలైవాణి మన ముందు లేరు.
మనకందరికీ తెలిసిన సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ 1997లో తమిళంలో ‘The Terrorist’ అనే సినిమా తీశారు. ఆ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఆయనే! అది పాక్షికంగా కళైవాణి రాజరత్నం జీవితం నుంచి స్ఫూర్తి పొంది రాసిన కథ. సెన్సార్ కారణంగా సినిమాలో ఎక్కడా శ్రీలంక, ఎల్‌టీటీఈ, రాజీవ్ గాంధీ లాంటి పదాలు వినిపించవు. కానీ నేపథ్యం, వాళ్ల ప్రవర్తన చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా పేరుకు, ఇందులోని కథకూ సంబంధం లేదని నా భావన. LTTE పోరాట యోధులను ‘టెర్రరిస్టు’ అనడంలోనే ఏదో అపసవ్యత ధ్వనిస్తూ ఉంది. ఇతరులను చంపుతారు కాబట్టి వాళ్లని టెర్రరిస్టులతో పోల్చారా? అలాగే అని భావిస్తే ఈ సినిమా ఒక టెర్రరిస్టు అంతర్మథనం అనాలి. 19 ఏళ్ల మల్లి అనే అమ్మాయి మానవబాంబుగా మారి ప్రధానమంత్రిని చంపేందుకు యత్నించడం కథ. తల్లి కాబోతున్న తను ఆ పని చేసిందా, లేదా, చివరకు ఏమైంది అనేది తెరపై చూడాల్సిన విషయాలు.
అప్పటిదాకా అడవుల్లోని క్యాంప్‌లలో పెరిగిన మల్లి ఈ పని కోసం బయటి ప్రపంచానికి వస్తుంది. అదే సమయంలో తను గతంలో ప్రేమించిన వ్యక్తి వల్ల గర్భవతిని అయ్యాయని తెలుస్తుంది. అందుకు కారణమైన వ్యక్తి బతికిలేడు. తను తల్లి కాబోతున్న సంతోషం కన్నా, తను అక్కడికి వచ్చిన పని ముఖ్యం. అది మానవబాంబుగా మారడం. తన ప్రాణాలనైతే సులభంగా ఇచ్చేసేదే! కానీ కడుపులో బిడ్డ! ఆ బిడ్డ ఏం పాపం చేసింది? ఎందుకు చంపాలి? అసలీ ప్రపంచంలో చావు ఎందుకు? ఒకరినొకరు చంపుకోవడం ఎందుకు? ఎడతెగని ఆలోచనలు. అంతర్మథనం. చివరకు ఏం జరిగిందనేది కథ.
గొప్ప కథకు గొప్ప నటులు దొరకడం కలిమి. అటువంటి కలిమి ఈ సినిమాకి దొరికింది. పేరు ఆయేషా దర్కర్. మల్లి పాత్ర పోషించిన నటి. సినిమా మొత్తం తన కళ్లతో ఆమె పలికించిన భావాలు మీరు చూసి తీరాల్సిందే! మరెవరూ ఆ పాత్రను అంతకన్నా బాగా చేయలేరు అనిపించేంత గొప్ప నటన. ఆ సంవత్సరం జాతీయస్థాయిలో ఉత్తమ నటి పురస్కారానికి నామినేట్ అయినా అవార్డు రాలేదు. కైరో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘Best Artistic Contribution by an Actress’ అవార్డు అందుకున్నారు. ప్రముఖ సినీ విమర్శకుడు Roger Ebert ఈ చిత్రాన్ని తన ‘Great Movies’ Reviewsలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ చిత్రం పలు ఇన్‌స్టిట్యూట్‌లలో సినిమాటోగ్రఫీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉండటం విశేషం!
మీరు ఈ సినిమాని అనేక విషయాల కోసం చూడొచ్చు! ముఖ్యంగా మరొకరికి సాధ్యం కానంత గొప్పగా ‘మల్లి’ పాత్ర పోషించిన ఆయేషా దర్కర్ నటన చూసేందుకు, దర్శకుడిగా సంతోష్ శివన్ అద్భుతమైన టేకింగ్ గమనించేందుకు, టెక్నికల్‌గా ఒక సినిమా ఎంత ఉన్నంతగా ఉండొచ్చో చూపించిన ఎడిటింగ్, నేపథ్యం సంగీతం, ఛాయాగ్రహణాల పనితనానికి, ఒక ఆశయం కోసం పోరాడే వారి జీవితాల్లో జరిగే అంతర్మథనం పరిశీలించడానికి, వీటన్నింటినీ మించి LTTE గురించి కొంతలో కొంత అవగాహన రావడానికి! ఈ చిత్రం యుట్యూబ్‌లో అందుబాటులో ఉంది. అయితే Subtitles లేవు.