INCTELANGANA :
-బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు
=============================
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పలు విప్లవాత్మక చర్యలతో చరిత్ర సృష్టిస్తోంది. ఆ పరంపరలో భాగంగా ఉగాది, రంజాన్ శుభ సందర్భంగా రాష్ట్రంలోని రేషన్ షాపులలో సన్నబియ్యం అందించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇప్పటికే మహిళా సాధికారత కోసం తెలంగాణ ఆడబడుచులకు పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలను ఆపన్న హస్తం అందిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా కాంగ్రెస్ మేనిఫెస్టో అభయం హస్తంలో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ అందులో భాగంగా ఇప్పుడు పేదలందరూ తృప్తిగా భోజనం చేసేలా దేశంలోనే తొలిసారిగా రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తోంది.
రాష్ట్రంలో నిరుపేదలందరికీ సరసమైన ధరల్లో నిత్యవసర సరుకులు దక్కాలనే లక్ష్యంతో ప్రభుత్వం దాదాపు 40 లక్షల మందికి నూతన రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ చేపట్టింది. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య కోటికి, లబ్దిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరనుంది. వీరందరికీ సన్నబియ్యం అందించాలని కాంగ్రెస్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులు లేని అర్హులైన వారికి కూడా సన్నబియ్యం అందించనుండడంతో మొత్తం 3.5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. గతంలో బీఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వం రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇస్తామని ప్రకటనలకే పరిమితమయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఆచరణలో చేసి చూపిస్తోంది. సన్నబియ్యం పంపిణే కాకుండా కొత్త కార్డులు జారీ చేయడంలో కూడా బీఆర్ఎస్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో 50వేల కొత్త కార్డులు కూడా ఇవ్వలేదు. అంతేకాక ఉన్న కార్డుల్లోనే మార్పులు చేర్పులు, కొత్త పేర్లు చేర్చాలని కోరుతూ వచ్చిన 18 లక్షలపైగా దరఖాస్తులను, కొత్త కార్డుల కోసం వచ్చిన మరో 12 లక్షల దరఖాస్తులను పరిష్కరించకుండా పెండింగ్లో పెట్టారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడంతో పాటు మరిన్ని కొత్త కార్డులిస్తూ సంక్షేమం కాంగ్రెస్తో సాధ్యమని మరోసారి నిరూపించింది.
రేషన్ కార్డులపై ప్రస్తుతమిస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.2858 కోట్ల అదనపు భారం పడనుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటికి మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భారీ అప్పులతో దివాళా తీసినా పేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలకు ఎంత ఖర్చు అయినా ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రాష్ట్రంలో 84 శాతం మంది పేద ప్రజలకు ప్రత్యేక లబ్ది కలగనుంది. ప్రతి లబ్దిదారుడికి ఉచితంగా 6 కిలోల బియ్యంతో పాటు సరసమైన ధరలకు ఉప్పు, పప్పు, చింతపండు వంటి ఇతర నిత్యవసర సరుకులు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ నుంచైనా రేషన్ తీసుకోవచ్చనే వెసులుబాటు ప్రభుత్వం కల్పించడంతో ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం దొడ్డు బియ్యం అందిస్తుండడంతో నిరుపేదలకు ఏమాత్రం ప్రయోజనం కలగకపోవడంతో సన్న బియ్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నాణ్యత లేని దొడ్డు బియ్యంతో నిరుపేదలు కడుపునిండా భోజనం కూడా చేయలేకపోతున్నారు. దొడ్డు బియ్యంలో పోషకాహారం లేకపోవడం, అన్నం సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారీన పడుతుండడంతో వారు అప్పు చేసి బయట మార్కెట్లో సన్నబియ్యం కొనుకుంటున్నారు. మరోవైపు దిగువ మధ్య తరగతి కుటుంబాలు బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డులు రద్దవుతాయనే భయంతో మొక్కుబడిగా దొడ్డు బియ్యం తీసుకుంటున్నారు. వీరిలో అధిక శాతం వాటిని అమ్ముకుంటున్నారు. అవి కోళ్లకు దానాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇలా దొడ్డు బియ్యం వ్యవస్థ పక్కదారి పట్టడమే కాకుండా అక్రమంగా రీసైక్లింగ్ కూడా జరుగుతుండడంతో ప్రభుత్వం లక్ష్యం విఫలమైంది. ఈ నేపథ్యంలో నిరుపేదలు కూడా సన్న బియ్యం అందించాలనే గొప్ప సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ లక్ష్య సాధనలో విజయవంతం అయ్యింది.
పేదలకు సన్నబియ్యం అందించాలంటే రాష్ట్రంలో సన్న బియ్యం సాగు పెంచేందుకు కాంగ్రెస్ తీసుకున్న చర్యలు ఫలప్రదం అయ్యాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వరి సాగును ప్రోత్సాహించకపోవడంతో రైతులు వరి సాగు చేయడానికి వెనుకంజ వేశారు. అయితే కాంగ్రెస్ సన్నబియ్యం ధాన్యం సాగును పెంచేలా నిర్ణయాలు తీసుకుంటూ ఆచరణలో పెట్టింది. సన్న వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రతి ఎకరాకు రూ.500 బోనస్ కింద రూ.1,206.44 కోట్లు చెల్లించడంతో రాష్ట్రంలో సన్నవరి సాగు 25 లక్షల ఎకరాల నండి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రభుత్వం 2024-25 ఖరీఫ్లో రికార్డు స్థాయిలో 4.41 లక్షల రైతుల నుండి 24 లక్షల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి చరిత్ర సృష్టించింది. మరోవైపు అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట సాగు చేసేందుకు నీరు పుష్కలంగా అందుబాటులో ఉండేలా చివరి ఆయకట్టుకు కూడా నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తుండడంతో ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సన్న వరి సాగు పెరిగి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీకి మార్గం సుగమమైంది.
సంక్షేమం, అభివృద్ధి సమపాలల్లో అందించడం కాంగ్రెస్తోనే సాధ్యమని విశ్వసించే పేదల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలందరూ కడుపు నిండా తృప్తిగా తినాలనే సంకల్పంతో ‘ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు, వారందరికీ సన్న బియ్యం’ కార్యక్రమాన్ని చేపట్టింది. మతసామరస్యానికి మారుపేరైన తెలంగాణలో ఉగాది, రంజాన్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో పేదలకు నిజమైన పండగా. పేదల పక్షపాతి అయిన కాంగ్రెస్ రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేలా ఆశీర్వదించాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు.