పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్!

పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్!

భారత్ , ఇంగ్లాండ్ తొలి టెస్టులో మొదటి రోజు ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. ఇంగ్లాండ్ సారథి జో రూట్ సెంచరీ (197 బంతుల్లో 128)తో చెలరేగడంతో ఆజట్టు భారీ స్కోర్ దిశగా ముందుకెళ్తోంది. ఓపెనర్ సిబ్లీ( 286 బంతుల్లో 87) అర్థ సెంచరీతో మెరిశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 263/3 స్కోర్ తో మెరుగైన స్థితిలో ఉంది. భారత్ బౌలర్లలో బుమ్ర రెండు, అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ కి ఓపెనర్లు సిబ్లి, బర్న్స్ మొదటి వికెట్ కి 50 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. జోరుమీదున్న వీరి భాగస్వామ్యాన్ని స్పిన్నర్ అశ్విన్ విడదీశాడు. 33 పరుగులు చేసిన బర్న్స్ ని అశ్విన్ ఔట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన లారెన్స్ నీ ఖాతా తెరవకముందే బుమ్రా పెవిలియన్ కి పంపాడు. దీంతో ఇంగ్లాండ్ 63 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

రూట్ కెప్టెన్ ఇన్నిగ్స్..

63 పరుగులకే రెండు వికెట్లు కొల్పయిన ఇంగ్లాండ్ ను జట్టు సారధి రూట్ ఆదుకున్నాడు. నాలుగో స్థానంలో క్రిజులోకి వచ్చిన రూట్ తొలుత ఆచితూచి ఆడాడు. మరో వైపు క్రీజులో ఉన్న సీబ్లి వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ అర్థ సెంచరీ సాధించాడు. దీంతో టీ విరామానికి ఇంగ్లాండ్ జట్టు 140/2 పటిష్ట స్థితిలో ఉంది. అనంతరం రూట్ సైతం గేర్ మార్చి దూకుడుగా ఆడుతూ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్ లో ఉన్న సిబ్లీ ని బుమ్రా ఓ చక్కటి యార్కర్ తో ఔట్ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 89.3 ఓవర్లలో 263/3 స్కోర్ తో పటిష్ట స్థితిలో ఉంది. భారత జట్టు టెస్టుపై పట్టు సాధించాలంటే శనివారం ఇంగ్లాండ్ ను త్వరగా ఆల్ ఔట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.