జగనన్న పోవాలి.. పవనన్న రావాలంటున్న మత్స్యకారులు : నాదెండ్ల మనోహర్

Janasena:‘రాష్ట్రంలో కౌలు రైతుల వెతలకు ఏ మాత్రం తీసిపోనట్లుగా మత్స్యకారుల వేదనలు ఉన్నాయన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కేవలం రూ.10 వేల వేతనానికి మత్స్యకారులు గుజరాత్, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వలసలు వెళ్లి బతుకుతున్నార’ని  ఆయన వాపోయారు. గతంలో మత్స్యకారులకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ సమయంలో పాదయాత్ర చేయాలని సవాల్ చేస్తున్నామన్నారు. ఓ మత్స్యకార గ్రామాన్నయినా ముఖ్యమంత్రి స్వయంగా సందర్శిస్తే వారి బాధలు, బతుకులు అర్థం అవుతాయని సూచించారు. ఇంటి యజమాని సముద్రంలో వేటకు సుదూర ప్రాంతాలకు వెళితే, బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. మాట్లాడితే బటన్ నొక్కానని చెబుతున్న ఈ ముఖ్యమంత్రి మత్స్యకారుల బతుకులను పట్టించుకోవడం మానేశారని చెప్పారు. కాకినాడలో మత్స్యకారుల సమస్యలపై శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మత్స్యకారులకు బాసటగా జనసేన’ పాదయాత్రను మనోహర్  చేపట్టారు. మత్స్యకారులు జీవించే జగన్నాథపురం, ఏటిమొగ ప్రాంతాల మీదుగా పాదయాత్రగా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకొని మత్స్యకారుల సమస్యలను తెలియజేస్తూ సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం  మత్స్యకారులను ఉద్దేశించి నాదెండ్ల  మాట్లాడుతూ.. ‘‘కష్టాన్ని నమ్మకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఏ మాత్రం సాయం చేయడం చేతగాని, దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. ఈ పాలకులకు ప్రజల సమస్యలు, బాధలు పట్టవన్నారు. మత్స్యకారులకు అవసరం అయ్యే జెట్టీలు, హార్బర్ లను గత నాలుగేళ్లలో ఒక్కటి కూడా నిర్మించలేకపోయిన  అసమర్ధ ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా పేర్లను మార్చి పోర్టులకు శంకుస్థాపన చేస్తున్నారన్నారు. ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడానికి తాపత్రయపడుతున్నారు. మత్స్యకారులకు కావల్సింది ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు. వాటిని ఈ ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఎన్ని నిర్మించిందో, మత్స్యకారులకు బతుకులకు ఏ మాత్రం భరోసా నింపిందో చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు.

జగనన్న పోవాలి.. పవనన్న రావాలి..

గతంలోనూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాకినాడలోని సూర్యారావుపేట నుంచి మత్స్యకార అభ్యున్నతి యాత్ర చేపట్టిన సమయంలోనే మత్స్యకారుల వ్యధాభరితమైన జీవితాలు కనిపించాయన్నారు మనోహర్. అభ్యున్నతి యాత్ర నర్సాపురం వెళ్లే వరకూ మార్గమాధ్యంలో ఏ మత్స్యకార గ్రామానికి వెళ్లినా మత్స్యకారులంతా ముక్త కంఠంతో జగనన్న పోవాలి.. పవనన్న రావాలి అని బలంగా కోరుకోవడం కనిపించిందన్నారు.  కచ్చితంగా మత్స్యకారుల కోసం పవన్ కళ్యాణ్ బలంగా నిలబడ్డారు… నిలబడతారని.. భవిష్యత్తులోనూ వారికి అండగా జనసేన పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల సమరం ప్రారంభ సమయంలోనూ గంగమ్మ తల్లికి మొక్కి, మత్స్యకారుల ఆశీస్సులు తీసుకొని కదనరంగంలోకి దిగిన జన సేనాని మత్స్యకారులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తారన్నారు. కడలి పుత్రుల కుటుంబాలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని మనోహర్ విశ్వాసం వ్యక్తం చేశారు.