క్రిష్ణయ్య ను చంపిన హంతకులను హైదరాబాద్ లో అడుగుపెట్టనీయం: బండి సంజయ్

BJPTelangana: యావజ్జీవ శిక్షపడి  జైలు జీవితం అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ ను శిక్షాకాలం పూర్తి కాకముందే నితీశ్ కుమార్ ప్రభుత్వం విడదల చేయడం సిగ్గు చేటన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. నితీష్ కుమార్ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని బండి ప్రశ్నించారు. పాలమూరు బిడ్డను చంపేసిన హంతకుడు తెలంగాణలో అడుగుపెడుతుంటే ఎందుకు అనుమతిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాల్చి చంపి పేదల రక్తం తాగిన యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ ను చంపితే ఖండించిన బీఆర్ఎస్ నేతలు క్రిష్ణయ్య హంతకుల రాకపై ఎందుకు నోరు మెదపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. క్రిష్ణయ్యను హత్య చేసిన వాళ్లను జైలు నుండి విడిపించడాన్ని కేసీఆర్ సమర్ధిస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు. నితీశ్ – కేసీఆర్ ఇద్దరూ మాట్లాడుకున్న తరువాతే ఆనంద మోహన్ హైదరాబాద్ వస్తున్నారని భావిస్తున్నట్లు బండి స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ – కేసీఆర్ మధ్యనున్న దోస్తీని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. క్రిష్ణయ్య ను చంపిన హంతకులను ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అడుగుపెట్టనీయమని.. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సంజయ్ హెచ్చరించారు.