ఏజెంట్ రివ్యూ..అయ్యగారి ఫేట్ మారిందా?

అక్కినేని అఖిల్ తాజాగా న‌టించిన చిత్రం ‘ ఏజెంట్’. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. సాక్షివైద్య క‌థానాయిక‌. మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ ముమ్మ‌టి, డైనో మోరియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఏజెంట్ మూవీపై అయ్య‌గారి అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇంత‌కు మూవీ ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం!
క‌థ‌..
రిక్కీ అలియాస్ రామ‌కృష్ణ(అఖిల్‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడు. చిన్న‌ప్ప‌టి నుంచి గూఢ‌చారి సంస్థ రా (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్ అవ్వ‌డ‌మే అత‌ని లక్ష్యం. ఇందుకోసం మూడుసార్లు ప‌రీక్ష రాస్తాడు కానీ ఇంట‌ర్వ్యూలో ఫెయిల్ అవుతాడు. ఈక్ర‌మంలో రా చీఫ్ డెవిల్ అలియాస్ మ‌హ‌దేవ్ (ముమ్మ‌టి) దృష్టిలో ప‌డేందుకు కోతిప‌ని చేసి అడ్డంగా దొరికిపోతాడు. ఈమ‌ధ్య‌లో వైద్య‌(సాక్షివైద్య‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. మ‌రోవైపు భార‌త‌దేశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేయాల‌ని గాడ్‌ అలియాస్ ధ‌ర్మ‌(డినోమోరియా) చైనాతో క‌లిసి కుట్ర‌ప‌న్నుతాడు. దీంతో అనూహ్య ప‌రిణామాల మధ్య  మ‌హ‌దేవ్ .. రిక్కిని రంగంలోకి దింపుతాడు. గూఢ‌చారి సంస్థ‌కు ప‌నికిరాడ‌నుకున్న రిక్కి అవ‌సరం మ‌హ‌దేవ్ కు ఎందుకొచ్చింది? రిక్కి – వైద్య ప్రేమ క‌హాని ఏమైంది? ఇంత‌కు రిక్కి భార‌త్ పై దాడిని అడ్డుకున్నాడా?తెలియాలంటే సినిమాచూడాల్సిందే..!

ఎలా ఉందంటే..?

గూఢ‌చార్యం నేప‌థ్యంలో అన్ని ఇండ‌స్ట్రీలో చాలా సినిమాలు వ‌చ్చాయి. ఇటీవ‌ల విడుద‌లైన‌ బాలీవుడ్ బాద్షా ప‌ఠాన్ మూవీ సైతం ఆకోవ‌కు చెందిందే. ఏజెంట్ క‌థ ఇంచుమించు అలాటిందే. కాకపోతే కథలో వైవిధ్యత లోపించింది. ఫస్ట్ ఆఫ్ లో అఖిల్ ఎంట్రీ, ఇంట‌ర్వెల్ కు ముందు విల‌న్ల‌తో అత‌ను చేసే ఫైట్స్ సినిమాకు హైలెట్ అని చెప్ప‌వ‌చ్చు. రిక్కి- వైద్య ప్రేమ‌క‌హానీ సోసో గా అనిపిస్తుంది. సెంకాడాఫ్ లో వ‌చ్చే యాక్ష‌న్ సీన్స్ థ్రిల్లింగ్ అనిపిస్తాయి. శ‌త్రువుల కుట్ర‌ల‌ను చేధిస్తూ అఖిల్ చేసే పోరాట విన్యాసాలు ఆక‌ట్టుకుంటాయి. కాక‌పోతే కొన్ని సీన్స్ చూస్తుంటే.. రా (రీసెర్చ్ అండ్ ఎనాలాసిస్ వింగ్) వ్య‌వ‌స్థ మీద మినిమమ్ రీసెర్చ్ చేయ‌కుండా చిత్ర‌యూనిట్‌ సినిమా తీసిన‌ట్లు అనిపించింది.యాక్షన్ ,థ్రిల్లింగ్ మూమెంట్స్ పై పెట్టిన శ్ర‌ద్ధ క‌థ‌నంపై పెడితే సినిమా మ‌రో లెవ‌ల్ ఉండేద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఎవ‌రెలా చేశారంటే..?

ఇక న‌ట‌న ప‌రంగా అఖిల్ సినిమాకోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. అత‌ని ప‌డిన క‌ష్టం తెర‌పై ప్ర‌తిస‌న్నివేశంలో క‌నిపిస్తుంది. వైల్డ్ సాలే రిక్కిగా పాత్ర‌లో జీవించేశాడు . ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అద‌ర‌గొట్టేశాడు. హీరొయిన్ వైద్య న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. సినిమాకు మ‌రో ఎసెట్ మలయాళీ సూపర్ స్టార్ ముమ్మ‌టి. రా చీఫ్ గా అత‌ని న‌ట‌న అద్భుతం. ప్ర‌తినాయ‌కుడిగా డెనో మోరియా మెప్పించాడు. మిగ‌తా న‌టీన‌టులు పాత్ర‌ల ప‌రిధిమేర న‌టించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు…

ఏజెంట్ సినిమాలో సురేంద‌ర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ అద్భుత‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. స్టైలిష్ దర్శ‌కుడు అనే ముద్ర‌ను అతను మ‌రోసారి నిల‌బెట్టుకున్నాడు. కాక‌పోతే యాక్ష‌న్ ,థ్రిల్లింగ్ సీన్స్ పరంగా ఓకే అనిపించిన.. క‌థ‌నం ప‌రంగా ఇంకాస్తే బెట‌ర్ గా ఉంటే ఉండేది. హిప్ హాప్ మ్యూజిక్ ఫ‌ర్వాలేదు. సినిమాటోగ్ర‌ఫీ అద్భ‌తం. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు ప్ర‌తి సన్నివేశంలో క‌నిపిస్తుంది.

“చివ‌ర‌గా అయ్యగారు సరికొత్త‌గా ట్రైచేస్తే బెట‌ర్‌”

రివ్యూ:  2.5/5