VIAGRA: ‘ వయాగ్రా ‘ కొన్ని అపోహలు – కొన్ని నిజాలు..

 విశీ(వి.సాయివంశీ) : 

NOTE: ‘FBలో సెక్స్ సంబంధిత విషయాలు మాట్లాడటానికి మగవాళ్లు కూడా ఇబ్బంది పడతారు’ అని ఒక ప్రసిద్ధ కవి(?) నిన్న ఓ పోస్ట్ రాశాడు(దాని గురించి నా గత పోస్టులో రాశాను). అది అబద్ధం అని నిరూపించడానికి ఈ పోస్ట్ రాస్తున్నాను. సెక్స్‌కు అనుసంధానమైన బూతుల్ని విచ్చలవిడిగా వాడే మనం, సెక్స్ గురించి మాట్లాడటానికి సిగ్గు పడటం దరిద్రం. ఎక్కువ మాట్లాడకపోతే ఎక్కువ అపోహలు పుడుతూ ఉంటాయి. వాటికి బ్రేక్ వేయడానికి నేనొక ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ఇలాంటి వాటి గురించి తెలుసుకొని రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
* * *

 వయాగ్రా అంటే ఏమిటి?

అది బూతు కాదు. అనాసిన్, క్రోసిన్‌లాగే అది ఒక ఔషధం. అంగస్తంభన సమస్య(Erectile Dysfunction)తో ఇబ్బంది పడేవారికి వైద్యులు దీన్ని సూచిస్తారు. ప్రపంచంలో అనేకమంది కాపురాలు బాగు చేసిన ఘనత ఈ నీలిరంగు మందు బిళ్లకు దక్కుతుందని డాక్టర్ల మాట. దీన్ని వైద్యుల సూచనతోనే తీసుకోవాలి తప్ప సొంతంగా కొనుక్కుని వేసుకోకూడదు.

* వయాగ్రా వేసుకుంటే సెక్స్ కోరికలు పెరుగుతాయా?

వయాగ్రాకు, సెక్స్ కోరికలకు సంబంధం లేదు. అదంతా సినిమాల్లో చూపించే పైత్యం. అంగం(Male Reproductive Organ) సరిగా స్తంభించక, లేక తగినంతసేపు స్తంభించనివారి ఇబ్బంది తీర్చేందుకు మాత్రమే ఇది పనిచేస్తుంది. అంతే తప్ప సినిమాల్లో చూపించినట్టు వయాగ్రా వేసుకోగానే నరాలు జివ్వున లాగి కోరిక పుట్టడం, డ్యూయెట్ పాడటం, మంచాలు విరగ్గొట్టడం జరగదు.

* అంగస్తంభన సమస్యకు వయాగ్రా మాత్రమే మందా?

నిజానికి ఈ సమస్యకు ఇతర మందులు కూడా ఉన్నాయి. అసలు మందులే లేకుండా, మన జీవన విధానంలో మార్పుల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తారు. కానీ వయాగ్రా అనే పేరు పాపులర్ కావడం వల్ల ఇదొక్కటే మందు అనే భ్రమలో ఉంటారు.

* మొగతనం లేకపోతేనే వయాగ్రా వేసుకోవాలా?

మొగతనం ఉండటం, లేకపోవడం అనేది పిచ్చిమాట. అప్పుడెప్పుడో చదువు లేని వాళ్లు ఏర్పరిచిన వింత మాట. అది ఇంకా వాడుతూ ఉండటం మనం అజ్ఞానాన్ని సూచిస్తుంది. సెక్స్‌ కోసం పురుషులకు కావాల్సింది ఆసక్తి, ఇష్టం, అంగస్తంభన. కొన్ని ఆరోగ్య, మానసిక కారణాల వల్ల అంగస్తంభన జరగనప్పుడు మాత్రమే వయాగ్రా వేసుకోవాలి. అది కూడా డాక్టర్లు సూచించిన తర్వాతే! అదేమీ తప్పు కాదు, శారీరక దౌర్బల్యం అసలే కాదు.

* ముసలివాళ్లు మాత్రమే వయాగ్రా వేసుకోవాలా?

ఇది చాలామంది సందేహం! సరే, ఇప్పుడు ముసలివాళ్లకు మాత్రమే బీపీ, షుగర్ ఉన్నాయా? వయసు తేడా లేకుండా చాలామందికి ఉన్నాయి. అంగస్తంభన సమస్య కూడా కొన్నిసార్లు యుక్త వయసు వారికీ రావచ్చు. ముసలివాళ్లలో అందరికీ ఆ సమస్య ఉండకపోవచ్చు. వయసు మళ్లినవారిలో కొందరికి ఆరోగ్య సమస్యల వల్ల అంగస్తంభన జరగక వయాగ్రా అవసరం పడొచ్చు. కాబట్టి ముసలివాళ్లు మాత్రమే వయాగ్రా వాడతారనేది అబద్ధం.

* వయాగ్రా వాడితే సెక్స్ సమస్యలన్నీ పోతాయా?

ఇది చాలామందిలో ఉండే అపోహ. సెక్స్‌లో ఏ సమస్య ఉన్నా వయాగ్రా వాడు అని సలహా ఇస్తుంటారు. అది తెలిసీ తెలియనితనం. కడుపునొప్పి వస్తే తలనొప్పి మాత్ర వేసుకోం కదా! అలాగే సెక్స్ సమస్యలన్నింటికీ వయాగ్రా మాత్రమే మందు కాదు. అంగస్తంభన సమస్యకు మాత్రమే అది మందు. అది కూడా వైద్యులు సూచిస్తేనే వేసుకోవాలి.

* వయాగ్రా వాడితే గుండెపోటు వస్తుందా?

ఇదొక అపోహ. వయాగ్రా వాడితే గుండెపోటు రాదు. వయాగ్రా వేసుకున్నాం, మంచాలు విరగ్గొడదాం అని సెక్స్‌లో కన్నుమిన్ను తెలియకుండా ప్రవర్తిస్తే గుండెపోటు వస్తుంది. అది వయగ్రా వేసుకోకపోయినా జరుగుతుంది. ముఖ్యంగా బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ. అంతే తప్ప, వయాగ్రా వాడితే గుండెపోటు వస్తుంది అనేది అబద్ధం. దానికి ఇతర కారణాలు ఉండి ఉంటాయి.

* వయాగ్రా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

ఉండొచ్చు, ఉండకపోనూవచ్చు. అది మనుషుల శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొందరిలో తలనొప్పి, నీరసం, వాంతులు, గుండెదడ, మూర్చ, కాళ్ల నొప్పులు వంటివి వస్తాయి. అయితే వయాగ్రా వాడిన అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేందుకు ఆధారాలేమీ లేవు. అలాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్లను కలవాలి.

* మొదటిరాత్రి/శోభనం రోజున వయాగ్రా వాడితే ఎక్కువసేపు సెక్స్ చేయొచ్చా?

ఇది చాలామందికి ఉండే అపోహ. కొన్ని సినిమాలు కూడా వారికి తగ్గట్టే ఉంటాయి. శోభనం రోజున వయాగ్రా వాడాలన్నట్టు చూపిస్తాయి. అదేమీ నిజం కాదు. వయాగ్రా వాడటం ద్వారా అంగం ఎక్కువసేపు స్తంభించి ఉండొచ్చేమో కానీ, సెక్స్‌లో అలసట రాకుండా ఉండదు. ఎక్కువసేపు సెక్స్ చేయడం అనేది వారివారి శరీర నిర్మాణం, సామర్థ్యం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది.

* వయాగ్రా ఎక్కువ వేసుకుంటే ఎక్కువసేపు సెక్స్ చేయొచ్చా?

ఒక వయాగ్రా బిళ్ళ తీసుకున్న 24 గంటల తర్వాతే మరో బిళ్ల తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పైగా ఏ మందైనా ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా చేయడం సరికాదు.

* ఒకసారి వయాగ్రా వాడితే జీవితాంతం వాడాలా?

అలా ఏమీ లేదు. సమస్య తీరిపోయింది అనుకుంటే ఆపేయొచ్చు. కానీ కొందరు మానసికంగా వయగ్రా మీద ఆధారపడతారు. అది లేకపోతే సెక్స్ చేయలేము అని బలంగా నమ్ముతారు. కాబట్టి మానాలన్నా, వాడాలన్నా వైద్యుల సలహా తప్పకుండా తీసుకోవాలి.

* వయాగ్రా వాడితే పిల్లలు పుట్టరా?

వయాగ్రా కేవలం అంగస్తంభన కోసం పనిచేసే మందు. అది వాడితే పిల్లలు పుట్టరు అనేది అబద్ధం. ఒకవేళ ఎవరికైనా పుట్టకపోతే దానికి ఇతర అంశాలు కారణం తప్పించి వయాగ్రా కాదు.

* ఇతర మందులు వాడేవారు వయగ్రా వాడొచ్చా?

వేసుకోవచ్చు. కానీ ఆ వివరాలు ముందుగా డాక్టర్లకు చెప్పి వాళ్ల సలహాతో వేసుకోవడం అవసరం. లేకపోతే అనారోగ్య సమస్యలు రావచ్చు.

* వయాగ్రా వేసుకుంటే సుఖరోగాలు(STDs) రావా?

వయాగ్రాకు సుఖవ్యాధులను నివారించే లేదా నయం చేసే గుణం లేదు. కాబట్టి వయాగ్రా వేసుకుంటే సుఖరోగాలు రావనేది అబద్ధం.

* మందు తాగి వయాగ్రా వాడితే బాగా పనిచేస్తుందా?

చేయదు. మందులోని మత్తు పదార్థాల కారణంగా వయాగ్రా ఎఫెక్ట్ పోతుంది. మందు మాత్రమే కాదు, మాంసాహారం, కడుపు నిండా ఎక్కువ పదార్థాలు తిన్నప్పుడు వయాగ్రా వేసుకున్నా అంత ప్రభావం చూపించదు.

* వయాగ్రా ఎక్కువ వాడితే మగవాళ్లు హిజ్రాలుగా మారతారా?

ఇది కొందరిలో ఉన్న అపోహ. అలా ఏమీ జరగదు. వయాగ్రా ఎక్కువగా వాడితే ఆరోగ్య సమస్యలు రావొచ్చు కానీ, ఎవరూ హిజ్రాలుగా మారరు.

* వయాగ్రా వేసుకోగానే అంగం స్తంభిస్తుందా?

అలా జరగదు. కనీసం గంటముందు తీసుకుంటేనే సరైన ఫలితాలు ఇస్తుంది.

* * *
IMPORTANT NOTE: ఇదంతా నెట్‌లో ఆరోగ్య, వైద్య సంబంధిత జర్నల్స్, వెబ్‌సైట్‌ల నుంచి సేకరించిన సమాచారం. ఒకటికి రెండుసార్లు చదివాకే రాశాను. ఏమైనా తప్పులు, సవరణలు, చేర్పులు ఉంటే తప్పకుండా చెప్పండి.