Angered : ‘ కోపం ‘ అంతైతే ఎలా..?

దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్):

‘కోపం మంచిది’ అన్నవాళ్లు కనబడలేదు ఇంతవరకు. కోపాన్ని సంపూర్ణంగా జయించిన వాళ్లనూ నే చూడలేదు. కొంత మందికి ముక్కు మీదే కోపమైతే… మరికొందరు కోపాన్ని బాగా అణచుకోగలరు. కొందరు కోపం వచ్చినా, దాన్ని చాలా వరకు తమ అదుపాజ్ఞల్లో వుంచుకుంటారు. ఇంకొంత మంది, సదాచరణ ద్వారా తమకు ఎప్పుడూ కోపమే కలుగకుండా నడచుకోవడం అలవరచుకుంటారు, కొన్ని మినహాయింపులు తప్ప! ఇలాంటి వారు బహు తక్కువ! 

     చిన్న చిన్న విషయాలకే చిర్రుమని కోపం లోపలి నుంచి పొంగుకురావడం నాలోనూ వుంది. కొందరు మాత్రమే బయటకు చెప్పినా, చాలా మందే ఇది గుర్తిస్తారనుకుంటా! కొంతమంది, ‘దిలీప్ ది ప్రథమ కోపం, అది ఎక్కువ సేపు వుండదు, స్థూలంగా మనిషి మంచివాడు’ అంటుంటారు. అదేదో అన్వయం బాగున్నట్టు నాకు అనిపిస్తుంటుంది. కానీ, అది ఒక ముసుగు మాత్రమే! 

 మొన్నొక రోజు సాయంత్రం, ఒక అపరిచితుడు డోర్ ముందు తచ్చాడుతూ కనుపించాడు. క్రికెట్ మ్యాచ్ చూట్టంలో లీనమైన నేను తల ఎత్తి తలుపు బయటకు చూసి, ‘ఏంటి? ఏం కావాలి??’ అనే అర్థం వచ్చేలా ఏదో అడిగా. అతడు ‘స్టేడియం, స్టేడియం’ అంటున్నాడు. “What stadium? Ha….How can you get a stadium in residential flats of an apartment? Ha!!” అని లేచి, గుర్రుమన్నాను. గతుక్కుమన్నాడు ఆయన పాపం. క్షణం తేరుకొని, తడుముకోకుండా….. “no need to get that angry for a simple enquiry….” అనుకుంటూ, ఆగకుండా కారిడార్లోంచి నడుస్తూ వేగంగా వెళిపోయాడు. ‘నీకంత కోపం అక్కర్లేదు’ అనటంలోనే ‘నీ సహాయం కూడా అక్కర్లేద’న్న తిరస్కారం ధ్వనించింది. అతనలా వెళుతూ ‘….some one suggested me to find a stadium nearby, that’s why….’ అని సనుక్కుంటున్నట్టూ నాకు లీలగా వినిపించింది. ఆయనలా వెళిపోవడం నాకేం నచ్చలేదు. క్షణాల్లోనే నాకు విషయం బోధపడింది. అతను గెస్ట్ లా బయటి నుంచి మా గేటెడ్ కమ్యూనిటీ లోకి ఎంటరై, సెల్లార్ లో వెహికిల్ పార్క్ చేసి, లిఫ్ట్ పట్టుకొని గ్రౌండ్ లెవల్ కి వచ్చినట్టున్నాడు. కారిడార్ లో ఎవరూ కనిపించక…. లిఫ్ట్ పక్క ఫ్లాట్ కావడం వల్ల, తలుపు తెరచే వుంది కద అని మా డోర్ ముందు తచ్చాడాడు. మా బ్లాక్ ముందర వున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు వెళ్లాలేమో! Stadium అని అడగటంలో ఉద్దేశ్యం Indore Stadium అని అయుంటుంది. నా దృష్టిలోని sports complex మరో అర్థంలో Indore Stadium అన్నది, ఆ క్షణంలో నాకు తట్టలేదు. ఆయన వెళిపోయాక, ఇవన్నీ లింక్ చేసుకున్నాక…. నిర్హేతుకమైన నా కోపం, నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది. ‘ఛ! ఎంత సిల్లీగా బిహేవ్ చేశాను?’ అన్న అంతర్మధనం రెండు, మూడు రోజులు నను వెంటాడుతూనేవుంది.

     కోపం వచ్చిన ప్రతి సందర్భాన్నీ నిజాయితీగా సమీక్షించుకుంటే, ఐ మీన్… ఎవరికి వారు, కారణం….. ప్రధానంగా చేతకానితనమే కనిపిస్తుంది. సమస్యకు సత్వర పరిష్కారం దొరకని, మన వల్లకాని, చేతనవని పరిస్థితుల్లోనే కోపం ఎక్కువ! ‘చేతకానమ్మ (య్య)కు కోపమెక్కువ’ అనే సామెత అందుకే పుట్టిందేమో? చేతకాకపోవడమనేది సామర్థ్యం పరంగానే కానక్కర్లేదు, అది ఆలోచన తట్టకో, డబ్బులేకో, సమయం లేకో, సందర్భం కాకో… కారణం ఏదైనా కావచ్చు. ఎదుటివారి దృష్టి కోణంలో ఆలోచించి, వారిని క్షమించలేని చేతగానితనమైనా… మనలో కోపం తెప్పిస్తుంది. కోపం, బేసిగ్గా ఓ లోపం, ఓ రకంగా శాపం.

     నిజానికి కోపం మహా చెడ్డది, దాని వల్ల మనిషికి ఏ ప్రయోజనమూ లేకపోగా కష్టం, నష్టం అరిష్టం కూడా! కోపం కొన్నిసార్లు ఆమోదయోగ్యమే! అది, ధర్మాగ్రహంలో భాగమైతేనో, బాధితుల పక్షం వహించి కారకులపై కాలుదువ్వితేనో… కోపానికీ అంగీకారం, ఆదరణ, అభినందనా వుంటాయి. కానీ, స్వభావపరంగా చూసినపుడు కోపం మంచిది కాదనే అందరూ, అన్ని కాలాలలో చెప్పారు, చెబుతారు. అందుకే, మనిషికి ఉండకూడని అరిషడ్వర్గాలైన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలలో కోపానిది రెండోస్థానం. దుర్వాసుడు, విశ్వామిత్రుడు వంటి మునుల నుంచి, రావణుడు, దుర్యోధనుడు వంటి పౌరాణిక రాజుల నుంచి, హిట్లర్, కిమ్ వంటి ఆధునిక పాలకుల వరకు వారి వారి కోపగొండితనం ఏయే అనర్ధాలకు దారితీసిందో మనకు తెలుసు. “తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమె స్వర్గము, తన దుఃఖమె నరకమండ్రు తథ్యము…. “ అని బద్దెనామాత్యుడు అయిదారు వందల యేళ్ల కింద నుడివిన సత్యము మనకప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ పాతబడదు. సదా సంస్మరణీయమే! మన పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక, ఆధునిక సాహిత్యంలో, మరే రకమైన వాజ్ఞ్మయంలోనైనా….. కోపం గురించి, దాని వల్ల కలిగే దుష్పరిణామాల గురించి పుంఖానుపుంఖాలుగా రాయబడి వుంది. అయినా మనం కోపాన్ని నియంత్రించుకున్నది చాలా చాలా తక్కువే అనిపిస్తుంది. ‘ఆ… ఇంత తెలిసి, జ్ఞానం, ప్రజ్ఞతో వున్నాక కోపాన్ని అదుపు చేసుకోలేమా? శ్రద్ద పెడితే తప్పక చేసుకోగలం’ అని అనుకుంటాం. కానీ, అది అంత తేలికైంది కాదు. అనుకున్న మాత్రాన ఆచరణ సాధ్యమయేంత తేలిక వ్యవహారం కాదు కనుకే, కోపాన్ని జయించిన వాళ్లు రుషులు, మహర్షులు, మునీశ్వరులు, మహాత్ములయ్యారు. సర్వకాలాలలో వందనీయులయ్యారు. “కోపమున బుద్ది, వివేకము కొంచెమగును….” అంటూ పద్యాలు రాసుకునే నేనూ ఆ కోప వశుడ్నే తప్ప, అతీతుడ్ని కాదు.

   ‘కోపం’ మీద మనిషికి ఎంత కోపమున్నా, పాపం ఎంతో శ్రమదమాదులకోర్చి బోల్డంత రీసర్చ్ చేశాడు. చేస్తూనే వున్నాడు. కోపం ఎందుకు? ఎప్పుడు? ఎలా? వస్తుంది? మనిషిలో ఏయే భౌతిక, రసాయనిక మార్పులు చోటుచేసుకుంటాయి? కోపానికి గురైనపుడు, అంతకు ముందూ-వెనక ఏయే శారీరక, మానసిక పరివర్తన, ప్రభావం కలుగుతాయి…. వంటి వివిధ కోణాల్లో జరిగిన పరిశోధనలు ఎన్నెన్నో విషయాలను విషదపరిచాయి. వాటన్నిటి సారం…. కోపం మనిషిలో మానసిక క్లేశాన్ని, శారీరక శ్రమ-అలసట ను తప్ప మరేమీ మిగల్చదు. హార్మోనుల అసమతుల్యతకు కారణమౌతుంది. కోపం ఆవేశానికి దారి తీసి, అది తక్షణం విచక్షణ-వివేకం రెంటినీ చంపేస్తుంది. తద్వారా తప్పుడు నిర్ణయాలకు ఆస్కారం బలపడుతుంది. ఎదుటివారిలో బాధ, క్షోభ, ఆవేదనను కలిగిస్తుంది. కొన్నిసార్లు అవమానాలకు, ఆవేశాలకూ గురిచేస్తుంది. కోపం వల్ల మనుషుల మధ్య ఎడం పెరుగుతుంది. కక్షలు, కార్పణ్యాలు అధికమవుతాయి. మానవ సంబంధాలు దారుణంగా చెడిపోతాయి.

    నేను పుట్టాక, రిపీట్ అవుతున్న రెండో తెలుగు సంవత్సరం ‘శ్రీ క్రోధి నామ’ అని ఈ ఉగాది పూట గుర్తు చేసుకుంటే, మనసు మనిషి క్రోధం వైపు మళ్లింది. నిరుటిది కాకుండా, అంతకు ముందొచ్చిన  శోభకృత నామ సంవత్సరం (1963)లో నేను వుట్టాను. 

నా తర్వాత పుట్టిన నా కోపం… నా కన్నా ముందే పోతే ఎంత బావున్ను!