APpolitics: ఆంధ్రప్రదేశ్ లో ‘ విధ్వంసం’ పై ఆలపాటి సురేష్ మాటల్లో..!

తాడి ప్రకాష్( 9704541559) 

…………………………………..

A Blistering attack on
Y.S.Jagan’s missrule
…………………………………..

“ఒక్క ఛాన్స్ ప్లీజ్” అన్న జగన్ అభ్యర్ధనకి అమితంగా స్పందించి,175 సీట్లకి 151 సీట్లు గంపగుత్తగా అప్పగించారు.నాయకుడిని అందలం ఎక్కించారు.ఆ సంతోష సమయంలో..ఓ సాయంత్రం మూడు జెసిబిలు విజయవాడను ఆనుకుని ఉన్న కృష్ణానది కరకట్ట పైకి నింపాదిగా వెళ్ళి అక్కడున్న ప్రజావేదిక అనే ప్రభుత్వ భవనంపై పంజాలు విప్పాయి.దానిని పెళ్లలు పెళ్లలుగా కుళ్ళబొడిచి నేలమట్టం చేసే కార్యక్రమం మొదలుపెట్టాయి.నవ్యాoధ్రప్రదేశ్ లో యెదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభం అయింది” అనే మాటలతో ఆలపాటి సురేష్ కుమార్ ‘విధ్వంసం’ మొదలవుతుంది. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ రాసిన రాజకీయ వ్యాసాల సంపుటి పేరే ‘విధ్వంసం.’ అయిదేళ్ళ పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అక్రమాలు, దుర్మార్గాలు, అరాచకాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేసిన విధానం ముచ్చట గొలుపుచున్నది. 572 పేజీలున్న ఈ పెద్ద పుస్తకంలో మొత్తం 185 వ్యాసాలున్నాయి. అన్నీ చిన్న చిన్న వ్యాసాలు, రెండు మూడు పేజీలకు మించవు.ప్రతీ వ్యాసాన్ని, సూటిగా, షార్ప్ గా,పంజెంట్ గా, పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేయడం ఆలపాటి సురేష్ స్పెషాలిటీ.రుజువులు, సాక్ష్యాలు,తేదీలు, పేర్లు,
ఏ ఊర్లో, ఎక్కడ , ఎప్పుడు అనే ఆసక్తికరమైన వివరాలతో పకడ్బoదీగా చేసిన ‘దాడి’ యిది.

జగన్ గానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గానీ యీ పుస్తకం చదివితే, అమ్మో ఇన్ని అరాచకాలు మనమే చేశామా!అని ఆశ్చర్యపోతారు.
‘విధ్వంసం’ఒక రీసెర్చి వర్క్.ఈ వ్యాసాలు రాయడం వెనక ఎంతో శ్రమ, పరిశోధన, డీటెయిల్స్ పట్ల శ్రద్ధ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.చంద్రబాబునాయుడికి మద్దతుగా, రామోజీరావుకి అనుకూలంగా,జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా ‘విధ్వంసం’సాగిపోతుంది. ఇది తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ పుస్తకమేమో అనీ అనిపిస్తుంది.కొన్ని నెలల క్రితం విజయవాడలో జరిగిన ఒక పెద్ద సభలో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

మనం ఒక పార్టీని గౌరవిస్తాం. మరో పార్టీ అంటే చిరాకు పడతాం. ఒక నాయకుణ్ణి ఇష్టపడతాం.మరొక నాయకుణ్ణి ద్వేషిస్తాం.
అవన్నీ సొంత యిష్టాయిష్టాలు.మనం అసూయ పడతాం. శాపనార్ధాలు పెడతాం.ఒకడు చిత్తుగా వోడిపోవాలని గట్టిగా అనుకుంటాం.అవన్నీ ఒకరి వ్యక్తిగతమైన తలతిక్కలు.వాటివల్ల ఎవరికీ నష్టం లేదు.కానీ, ఆలపాటి సురేష్ లాగా, ఒక రాష్ట్ర ప్రభుత్వ చర్యల్ని,దాడుల్ని , కక్ష సాధింపుల్ని వరసబెట్టి రాస్తున్నప్పుడు అందులో నిజమెంత? రాసినవి వాస్తవాలేనా?వక్రీకరిస్తున్నాడా? సొంత స్వార్ధప్రయోజనాలేమన్నా వాటి వెనుక దాగి ఉన్నాయా?అని చూస్తాం కదా!

ఆలపాటి సురేష్ అక్షరాల వెనుక నిజాయితీ ట్రాన్ స్పరెంట్ గా కనిపిస్తూనే ఉంటుంది. అతని నిబద్ధతని మనం ప్రశ్నించలేము. సంఘటనలనీ,వాస్తవాలనీ,రాజకీయ తలబిరుసుతనాన్ని ఒక క్రమంలో పేర్చడంలో, లాజికల్ గా, కన్విన్సింగ్ గా చెప్పడంలో అతని నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా వుండలేం. చాలా చక్కని భాష. మంచి వచనం . వ్యాసం వెంట వ్యాసం చదువుకుంటూ పోతాం. సోది, దురాగ్రహం, అర్ధం లేని వాదనలూ ఎక్కడా వుండవు.పదునుగా, చిక్కగా,ఏది ఎంత చెప్పాలో అంతే చెబుతాడు.
కళ్లు తిరిగి కిందపడే వాస్తవాలతో,వీపు పగిలిపోయే విమర్శతో చెలరేగిపోతూనే, వెన్న రాసినట్టుండే వెటకారంతో, సన్నజాజులు విసిరినట్టుండే సున్నితమైన హాస్యంతో ఈ రంజైన రాజకీయ వ్యాసాలకొక అందమూ, చందమూ,సుగంధమూ అద్దాడు సురేష్.
వొట్టి వ్యాసాలు కావివి,యువపాత్రికేయులకు మార్గదర్శకసూత్రాలు. సమస్యని ఎలా చూడాలి? దాన్ని పాఠకుడి ముందు పెట్టడంలో మొదలు, ముగింపు వరకు ఎంత నేర్పుగా ఉండాలి? కేవలం రెండు పేజీల్లోనే గుండేసి పేల్చినట్టు రాయడం ఎలా? ముష్టి మూడు పేజీల ఆర్టికల్ తో ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మూడు చెరువుల నీళ్ళు తాగించడం ఎలా?అనేవి నేర్చుకోవడానికి కుర్ర జర్నలిస్టులకివి ప్రామాణిక సూత్రాలు. చంద్రబాబు పక్షం వహించాడా? జగన్మోహన్ రెడ్డిని తిట్టాడా? తెలుగుదేశం తరపున వకాల్తా పుచ్చుకున్నాడా?రామోజీరావు పల్లకి మోయడానికి పాల్పడ్డాడా? సజ్జల రామకృష్ణరెడ్డిని విలన్ని చేశాడా?అనే పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ని పక్కన పెడితే,’విధ్వంసం’అనే ఈ పుస్తకం, ఒక గ్రేట్ జర్నలిస్టిక్ ఎఫర్ట్. ఎందుకు?
బంగారు తెలంగాణ తెచ్చిన ‘జాతిపిత’కెసియార్, అతని వ్యక్తిత్వమూ,ఎన్టీ రామారావు అనే గొప్ప నాయకుడూ,యాతని మహత్తర పాలన, వై. యస్. రాజశేఖరరెడ్డి అనే మహానేత, యాతడి అద్భుత పరిపాలన-అనే పంచరత్నాల అతి పొగడ్తల పుస్తకాలు అనేకం వచ్చాయి. ఆ రాసిన వాళ్ళు జర్నలిస్టులే! ప్రభుత్వ ప్రాపకం కోసం పడిన పాట్లే అవన్నీ. వాళ్ళు వేరు, ఆలపాటి సురేష్ వేరు.
బరితెగించిన సురేష్,జగన్మోహన్ రెడ్డి పై,కటువైన విమర్శ కత్తి దూశాడు.ఒక బలమైన, శక్తివంతమైన,సీనియర్ జర్నలిస్టుల సహకారంతో నడుస్తున్న జగన్ ప్రభుత్వంపై ఒక జర్నలిస్టు చేసిన తిరుగుబాటు ఈ ‘విధ్వంసం.
‘ఇది సాహసం,ఒక హార్ష్ రియాలిటీని రాయాలి, రికార్డు చేయాలన్న తపన. Come, what may అన్న దుస్సాహసం కూడా.

నయవంచననూ, ఏకపక్ష నిర్ణయాలనూ అంగీకరించేది లేదంటూ నయా నియంతృత్వ పాలనకు తొలి ధిక్కారంగా నిలిచి,ఎంత అణిచివేత ఎదురయినా కాడి కింద పడెయ్యకుండా తమ చారిత్రక ప్రతిఘటనను కొనసాగిస్తున్న అమరావతి మహిళా రైతులకు-ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు.కనుక మొదటి పేజీలోనే రచయిత ఉద్దేశం స్పష్టంగా తెలిసిపోతుంది.

“రాజకీయాలు చేసే పార్టీలు లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియ లేదు.అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయి రాజకీయాలు అనే మాటకి ఒక నెగెటివ్ విలువ వచ్చి చేరింది.అందుకు రాజకీయ పార్టీలదే పూర్తి బాధ్యత.మనం పట్టించుకోకుండా దూరంగా వున్నా,ప్రభుత్వ నిర్ణయాలకు బద్ధులం కాకుండా వుండలేం.నేను వోటు వేయలేదు కాబట్టి ఈ ఇంటిపన్ను హెచ్చింపు నాకు వర్తించదు అంటే చెల్లుతుందా?అని అడుగుతున్నాడు సురేష్.

ఇండియాలో రిచ్చెస్ట్ సీ ఎం జగన్మోహన్ రెడ్డి.ఈ విషయం అందరికీ తెలుసు.కేవలం అయిదేళ్ళలో సున్నా నుండి 50కోట్లకు పైగా ఆస్తులు,ఆ తర్వాత రెండేళ్ళ వ్యవధిలో వాటిని దాదాపు 400 కోట్ల రూపాయలకు పెంచిన ఇంద్రజాలికుడు జగన్మోహన్ రెడ్డి……ఎలా సాధ్యపడింది ఇది? అని నిలదీస్తున్నాడు సురేష్. ప్రజావేదికను కూల్చి వేసింది ఒక సిగ్నల్ పంపడం కోసం.నేను ఏదైనా చేయగలను అన్న మొరటు సందేశం.ఆ సందేశం టార్గెట్ చంద్రబాబు.ఎప్పుడు వెళ్ళినా ఆ శిథిలాలు కంటపడతాయి.
జగన్ ప్రతాపానికి అవి గుర్తుగా కనపడాలి. కాకపోతే ఆ శిథిలాలను ఎందుకు తొలగించరు?
అని అడుగుతున్నాడు.

“చంద్రబాబును అరెస్ట్ చేయడం వెనుక జగన్ మానసిక అవసరం వుంది. చంద్రబాబు కూడా అవినీతిపరుడే-జైలు పక్షే అన్న ముద్ర వేయడం ఈ ఆపరేషన్ లక్ష్యాల్లో ఒకటి.నాయకులకు పట్టిన గతితో జనం బెంబేలెత్తిపోవాలి.రోడ్డు మీదకు వచ్చిన కార్యకర్తలల్ని పోలీసు లాఠీల్తో బాదాలి.కార్యకర్తలకు పట్టిన గతితో పార్టీ ఆత్మరక్షణలో పడిపోతుంది.దాంతో పార్టీ యంత్రాంగం కాకావికలై కూలిపోవడానికి ఎంతోకాలం పట్టదు.ఇదీ జగన్ వ్యూహం అంటారు సురేష్.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో వాతావరణం వల్ల చంద్రబాబుకి వొంటిపై దద్దుర్లు వచ్చాయి.
ఎ. సి. సౌకర్యం కావాలని కోర్టుకి వెళ్ళారు. దానికి ముందు,’జైలేమైనా అత్తగారిల్లా ఏసి పెట్టడానికి’అనీ సజ్జల అవహేళన చేశారు
అనీ గుర్తు చేశారు.

స్వరూపానంద అనే స్వామిజీ ఒకడున్నాడు.ముఖ్యమంత్రి జగన్ కి గురువు అనే పేరు పడిన తర్వాత స్వరూపానందకి గిరాకీ బాగా పెరిగింది.విశాఖపట్నంలో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ప్లాట్ల బుకింగ్ ద్వారా జనం నుంచి దాదాపు 900కోట్ల రూపాయలు వసూలు చేసి,అరెస్టయిన సాహితీ గ్రూపు ఎం డీ బూదాటి లక్ష్మీ నారాయణకు జగన్ ప్రభుత్వం టిటిడి బోర్డులో సభ్యత్వం కల్పించింది.స్వరూపానంద సిఫారసుతో ఆయనకి ఈ గౌరవం దక్కిందని వినికిడి అని సురేష్ లోగుట్టు బయటపెట్టారు.

మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాలపై దాడులు చేసిన సిఐడి పోలీసులు, కంపెనీ యాజమాన్యం ఆర్ధిక నేరాలకు పాల్పడిందంటూ కేసు నమోదు చేశారు. మార్గదర్శిపై దాడుల వార్తను సాక్షి పత్రిక బ్యానర్ గా ప్రచురించింది.’తోడు దొంగలు’అన్న పెద్ద హెడ్ లైన్ పెట్టి, దాని కింద ఒక పక్క రామోజీరావు ఫోటో, రెండో పక్క శైలజ ఫోటో ముద్రించారు.
ఇంతకీ మార్గదర్శిపై ప్రజలనుంచి ఒక్క ఫిర్యాదు కూడా లేదు”అనీ రామోజీరావుకి క్లీన్ చిట్
యిచ్చారు ఆలపాటి సురేష్.

విశాఖ ఉక్కు అమ్మకం వద్దంటూ ప్రధానికి రాసిన లేఖలో ఉక్కు ఫ్యాక్టరీ కింద ఉన్న భూములను విక్రయించి పెట్టుబడులు సమకూర్చుకోవాలని జగన్ సలహా యిచ్చారు. ఒక ప్రధాని-ఇందిరాగాంధీ విశాఖ స్టీల్ కు శంకుస్థాపన చేశారు.ఒక ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మొదటి బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించారు.ఒక ప్రధాని… పి.వి. నరసింహారావు దీనిని జాతికి అంకితం చేశారు.ఇప్పుడున్న ప్రధాని నరేంద్ర మోడీ దీనిని తెగనమ్మే పుణ్యం కట్టుకుంటున్నారు.రాష్ట్రాన్ని పాలిస్తున్న
జగన్మోహన్ రెడ్డి కిమ్మనకుండా చూస్తున్నారని మరో వ్యాసంలో ఈ జర్నలిస్టు రాశారు.

2021 ఆగస్టు:టిడిపి కులం ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ అంటూ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ. వై. ఆర్. కృష్ణారావు ట్వీట్ చేశారు.తెలుగుదేశం కమ్మకులానికి చెందిన పార్టీ అనే అపప్రథ వైసీపి రాకముందు నుంచీ ఉంది.టిడిపి వల్ల కమ్మవారికి ఒరిగిందేమి లేదనీ, నిజానికి నష్టపోయింది ఆ సామాజిక వర్గమే అని ఒక న్యూస్ ఛానల్ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు, ఆయన్ని పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో! తమ కులం అభివృద్దే రాష్ట్రం అభివృద్ధి అన్నట్టుగా పాలించి, ఇప్పుడు, పార్టీ వల్ల తమ కులమే నష్టపోయింది అంటారా? అన్నది ఐ. వై. ఆర్. కృష్ణారావు ప్రశ్న.అలాంటప్పుడు, అధికారానికి ఆమడ దూరంలో ఉంటున్న కాపులు,దళిత కులాల వారు ఏమనుకోవాలని కూడా కృష్ణారావు ప్రశ్నించారు.ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేసిన తర్వాత కృష్ణారావుని చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు.ఆ పదవి అనుభవిస్తూనే, ఆయన సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టారు. దానితో చంద్రబాబు ఆయన్ని పదవి నుండి తొలగించారు. బాబు ప్రభుత్వంపై కృష్ణారావు కత్తి గట్టారు. అమరావతిపై, “అది ఎవరి రాజధాని?”అంటూ ఒక పుస్తకం రాశారు.
రాజధానిగా అమరావతిని ఒక కులం కోసమే ఎంపిక చేశారని ఆరోపించారు. బాబు హయాంలొ అక్రమాలు, అన్యాయాలు జరిగాయనీ అన్నారు అని సురేష్ వివరంగా తెలియజేశారు.
ఇలా విస్మయాసక్తిని కలిగించే అనేక వ్యాసాలు సురేష్ సమర్ధంగా, చాకచక్యంగా రాశారు.సంవత్సరాలవారీగా,తేదీలతో సహా, సంఘటనలను ఒకదాని వెంట ఒకటి పేర్చుకుంటూ పోయిన ప్రవాహ సదృశమైన తీరు పాఠకుణ్ణి ముక్కు పట్టుకుని లాక్కుపోతుంది.

ఊగించి, ప్రశ్నించి, నిలదీసి, కణతకి తుపాకీ పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసే పేలుడు పదార్ధం లాంటి ఈ పుస్తకం ముగింపులో… “Power tends to corrupt and absolute power corrupts absolutely అంటూ,151 సీట్లలో అధికారాన్ని వై.ఎస్. జగన్ సంపూర్ణాధికారం కింద పరిగణించారు. కాబట్టి ఏ రాజ్యాంగ వ్యవస్థకు తల వంచనక్కరలేదని ఆయన భావించారు.డబ్బు సంపాదించడం కోసం అధికారం సంపాదించడం.అధికారం సంపాదించడం కోసం డబ్బు సంపాదించడం.జగన్ కి ముందు అవినీతి లేదా అన్న ప్రశ్న రావచ్చు.ఉంది. కానీ జగన్ని ఎవరితోనూ పోల్చలేము”అన్నారు ఆలపాటి సురేష్.

పంచ్ లైన్:ఈ విధ్వంసానికి బోనులో నిలబెట్టాల్సింది వైసీపీ లో ఒకటి నుంచీ పది వరకూ ఉన్న తానైన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని మాత్రమే-అనే వాక్యంతో ఈ పుస్తకం ముగుస్తుంది. ఇది మామూలు దాడి కాదు. పకడ్బoదీగా, ఒక క్రమశిక్షణతో,గొప్ప సమాచారంతో, పదునైన ఉదాహరణలతో, కాదనలేని వాదనతో చేసిన రచన. లక్ష్యాన్నిగురి చూసి కొట్టగలిగిన వ్యూహ రచన. వాస్తవాలను విచ్చు కత్తులుగా మార్చి పాలకుల గుండెల్లోకి సూటిగా విసరగల దమ్మూ ధైర్యం ఉన్న రచన. ఈ వ్యాసాల ద్వారా ఒక యుద్ధమే చేసిన ఈ ఆరితేరిన జర్నలిస్టు, ” ఏ యుద్ధంలోనైనా అందరూ పాటించాల్సిన నీతి ఒకటుంటుంది”అన్నారు. మరి ఆలపాటి సురేష్ ఆ నీతిని పాటించారా?

అవును, జగన్ వ్యాపారస్తుడే.చంద్రబాబూ వ్యాపారస్తుడే. ప్రజల్ని తొక్కుకుంటూ వెళ్ళి అధికార సింహాసనాన్ని అధిరోహించడమే వాళ్ళ లక్ష్యం. స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే, కోట్లు కొల్లగొట్టడమే, కుల వారసులను తయారు చేసుకోవడమే వారి జీవితాశయం అని ఎందుకు రాయలేకపోయారు? లెక్కా పత్రం లేని చంద్రబాబు నాయుడు ఆస్తుల సంగతి మీకు తెలీదా?చెరుకూరి రామోజీరావు అనే పచ్చీ వడ్డీ వ్యాపారస్తుడే మనకి బంగారు తండ్రా? ఎన్టీ రామారావుకి ఈనాడు, చంద్రబాబు నాయుడు కలిసి చేసిన అవమానం, పరాభవం ఇట్టే ఎలా మరచిపోగలం? నిరాహారదీక్ష చేస్తున్న వంగవీటి మోహన్ రంగా అనే ఎమ్మెల్యేని నడిరోడ్డు మీద హత్య చేసిందెవరు? హంతకులను గుండెలకు హత్తుకుని కాపాడిందెవరు?కారంచేడు నిందితులకు కొండంత అండగా నిలబడిందెవరు? చంద్రబాబు అయిదేళ్ళ పాలన మీద కూడా, ఇన్ని వ్యాసాలతో ఇంత పుస్తకం రాయవచ్చు కదా!

చంద్రబాబు ఎంత దరిద్రంగా పరిపాలించకపోతే, 23 సీట్లకి జనం ఎందుకతన్ని దిగజార్చుతారు? ఇండిపెండెంట్ జర్నలిస్టులం అయిన మనకి, ఏదో ఒక పార్టీ జెండా వెనక దాక్కోవలసిన అగత్యం వుందా?అలా అయితే, నిరపేక్షగా,త్రికరణశుద్దిగా జనం పక్షాన నిలబడి మాట్లాడగలమా?సాక్షిలోనో, ఈనాడు లోనో పనిచేయకుండా స్వేచ్చగా ఉన్న మనలాంటి వాళ్ళం, న్యూట్రల్ గా వుంటే పోయేదేముంది?జర్నలిస్టు నిష్పాక్షికతనీ, పాత్రికేయ నీతినీ వొదులుకోవడం వల్ల మనకు ఒరిగేదేముంది?