పక్కదారి పట్టిన ప్రచారం

పక్కదారి పట్టిన ప్రచారం

నేను రెండో క్లాస్‌లో ఉన్నప్పుడు మా తెలుగు టీచర్‌ని ఒక విషయం అడిగినప్పుడు ‘గాడిద గుడ్డు’ అని విసుక్కున్నారు. అప్పుడు నాకు గాడిద గుడ్డు పెడుతుందా..? అనే సందేహం వచ్చింది. చిన్నతనంలో నాకు వచ్చిన సందేహమే ప్రస్తుతం నా పిల్లలకు కూడా వచ్చింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఇప్పుడు ‘గాడిద గుడ్డు’ తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రత్యేక తెలంగాణలో మూడోసారి హోరాహోరీగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం పరాకాష్టకు చేరి అభివృద్ధిపై జరగాల్సిన చర్చ ‘గాడిద గుడ్డు’ రూపంలోకి మారింది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటన వెలువడిన రోజు నుండి ప్రచారం ముగిసే వరకు ఇదే ధోరణి కొనసాగింది. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఆరు నెలల రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నికలు సవాలుగా మారాయి.

పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో అధిక స్థానాలపై కన్నేసింది. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడ్డ బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ మూడు పార్టీలు ప్రచారంలో తామేమి చేశామో, భవిష్యత్తులో ఏమి చేస్తామో చెబుతూ పాజిటివ్‌ అజెండాతో కాకుండా ఎదుటివారిపై విమర్శలు ఎక్కుపెట్టడానికే ప్రాధాన్యతిచ్చాయి. బీఆర్‌ఎస్‌ను మినహాయించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రచారం ‘గాడిద గుడ్డు’ చుట్టే తిరిగింది.

పార్లమెంట్‌ ఎన్నికలను తమ పాలనకు రిఫరెండం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో 14 స్థానాల్లో గెలుపును టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆరు గ్యారెంటీలతో రాష్ట్రంలో అందలమెక్కిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా వాటిపైనే ఆశలు పెట్టుకొని ప్రచారాన్ని ప్రారంభించింది. దీనికి తోడు బీఆర్‌ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేసింది. అయితే బీఆర్‌ఎస్‌ కంటే బీజేపీ దూకుడుగా ఉండడంతో కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్‌ హైదరాబాద్‌ వచ్చి రాష్ట్రంలో రోజురోజుకు బలపడుతున్న బీజేపీని లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేయమని సూచించడంతో రాష్ట్రంలో ప్రచార సరళి మారిపోయింది.

బీజేపీని లక్ష్యం చేసుకున్న రేవంత్‌ రెడ్డి తాము అమలు చేస్తున్న గ్యారెంటీలపై కాకుండా మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేయలేదని, తెలంగాణకు ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది అంటూ ఆ నమూనాలతో ప్రచారం నిర్వహించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి పన్నుల రూపంలో రావాల్సిన వాటాలు, కేంద్రం నుండి అందాల్సిన నిధులు, రాష్ట్ర విభజన హామీలు, నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, స్మార్ట్‌ సిటీలు, విద్యా సంస్థలపై బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపిస్తూ తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని ఆరోపించారు. వీటితో పాటు రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తి బీజేపీని ఇరుకున పెట్టాలనుకున్నారు. సున్నితమైన అంశాలను లేవనెత్తడంలో ముందుండే బీజేపీ దీన్ని అందిపుచ్చుకొని తాము ముస్లింల రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ చివరి కంటూ ప్రచారం సాగించే అవకాశాన్ని కాంగ్రెస్‌ కల్పించింది. ఈ విమర్శల ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్‌ జాతీయ అజెండా అయిన ‘పాంచ్‌ న్యాయ్‌’ పక్కదారి పట్టింది.

మరోవైపు బీజేపీ కూడా పదేళ్లలో తాము రాష్ట్రానికి ఏమి చేశామో చెప్పుకోవడం కంటే రేవంత్‌ రెడ్డి లేవనెత్తిన ‘గాడిద గుడ్డు’నే అనుకూలంగా మల్చుకోవాలని చూసింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని ముందుకు తెచ్చి ఆ పార్టీని ఇరుకున పెట్టింది. తెల్ల రేషన్‌ కార్డు, మహిళలకు రూ.2500, వృద్ధులకు, వితంతువులకు పింఛన్ల పెంపు, తులం బంగారం, రైతు భరోసా, విద్యా భరోసా వంటి హామీలను లేవనెత్తుతూ ప్రజలకు కాంగ్రెస్‌ ‘గాడిద గుడ్డు’ ఇచ్చిందని ప్రతి విమర్శ చేసింది.

రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్‌ లేవనెత్తిన ప్రధానాంశాలపై దాటవేత వైఖరి ప్రదర్శిస్తూ జాతీయ రహదారులు నిర్మించామని, రైల్వే లైన్లు వేశామని బీజేపీ చెప్పుకుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం రహదారులు, రైల్వే లైన్లు ప్రత్యేకించి తెలంగాణ కోసమే వేసినవి కావు. ఇతర రాష్ట్రాలకు అనుసంధానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వేశారు. తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు, వాటాలు, రాష్ట్రంలో స్థాపించిన సంస్థలపై క్లారిటీ ఇచ్చుంటే బీజేపీకి మైలేజీ వచ్చేది. దేశ వ్యాప్తంగా నమ్ముకున్నట్టు తెలంగాణలో కూడా బీజేపీ మోదీ చరిష్మాతో పాటు అయోధ్య రామాలయం, ఆర్టికల్‌ 370, ముస్లిం రిజర్వేషన్లు వంటి సున్నితమైన అంశాలపైనే ఆశలు పెట్టుకుంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత చతికిలపడ్డ బీఆర్‌ఎస్‌ నుండి కీలకమైన నేతలు పార్టీని వీడడంతో మరింత బలహీనపడిరది. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారు కూడా పార్టీ మారి ఇతర పార్టీల తరఫున పోటీ చేస్తుండడంతో ఆ పార్టీ కేడర్‌ నిరాశకు లోనైంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలు ప్రచారంలో దూసుకుపోతున్న తరుణంలో కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రచారం నామమాత్రంగానే కనిపించింది. కేసీఆర్‌ పర్యటనతో బీఆర్‌ఎస్‌కు కొంత ఊపు వచ్చింది. కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు మొదలుకొని ఆ పార్టీల విధానాలను ఎండగట్టారు. కేసీఆర్‌ ప్రచారంలో కవిత అరెస్టుకు పెద్దగా ప్రాధాన్యత కనిపించలేదు. పదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి తాను చేసిన కృషిని కాంగ్రెస్‌ ఆరు నెలల్లో నీరుగార్చిందనే అంశానికే ప్రాధాన్యతిచ్చారు.

కరీంనగర్‌లో కేసీఆర్‌ ప్రసంగిస్తూ ముస్లింలు ఏకమై బండి సంజయ్‌ను ఓడిరచాలన్నారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. నన్ను ఓడిరచేందుకు ముస్లింలు ఏకమవుతున్నారని తనను గెలిపించడానికి హిందువుల శక్తి చూపించాలని బండి సంజయ్‌ పిలుపిచ్చారు. 2019లో కూడా కేసీఆర్‌ ‘హిందుగాళ్లు బొందుగాళ్లు’ అని వ్యాఖ్యానించి బండి సంజయ్‌ గెలవడానికి కారకులయ్యారు. ఇప్పుడు మళ్లీ అలాంటి సున్నితమైన అంశాలనే కేసీఆర్‌ ఎత్తుకున్నారు. 12 స్థానాల్లో గెలిపిస్తే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని, పీఎం అవుతానని, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి మంచి కంటే చెడునే చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ బీజేపీతో కలిసి రేవంత్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తుందనే ప్రచారం చేసే అవకాశాన్ని కాంగ్రెస్‌కు కల్పించారు.

తెలంగాణ ఎన్నికలు మొదటిసారి కమ్యూనిస్టుల పాత్ర లేకుండా జరుగుతున్నాయి. ఒకటి రెండు చోట్ల ఈవీఎం మిషన్‌లో వారి గుర్తు కనిపించడం తప్ప వారు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోరాడడం లేదు. రాష్ట్రంలో వామపక్షాలు బలహీనపడడానికి ప్రధాన కారణం పరోక్షంగా బీజేపీయే. 2019 పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇతర పార్టీలకు సహకరిస్తూ ఉండడంతో ప్రస్తుతం తెలంగాణలో వారి ఉనికికే ప్రమాదం ఏర్పడిరది. మునుగోడులో పట్టున్న వామపక్షాలు ఉప ఎన్నికల్లో పోటీ చేసుంటే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు వారి బలం తెలిసి వారే కాళ్లబేరానికి వచ్చేవారు. ఈ సువర్ణవకాశాన్ని జారవిడ్చుకున్న కమ్యూనిస్టులు ఇప్పుడు కూడా బీజేపీ బూచితో వారి ఉనికికే ప్రమాదం తెచ్చుకుంటున్నారు.

హైదరాబాద్‌ పాతబస్తీకే పరిమితమైన ఏఐఎమ్‌ఐఎమ్‌ ఈ సారి చెమటోడుస్తుంది. అసదుద్దీన్‌ ఓవైసీకి గతంలోలాగా విజయం నల్లేరుపై నడక కాదు. ప్రతి ఎన్నికల్లో ముస్లిం ఓట్లే చాలు అనుకునే ఆ పార్టీ ఈ సారి తెలుగు పాటలతో ప్రచారం చేసింది. ఆ పార్టీ నాయకులు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారంటేనే పోటీ ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది.

తెలంగాణ ఎన్నికల ప్రచారం మొత్తం ఆయా పార్టీల అజెండా, వారిచ్చే హామీలపై కాకుండా ప్రత్యర్థులపై విమర్శలకే పరిమితమయ్యారు. వారు ఏమి చేయబోతున్నారో చెప్పేకంటే ఎదుటి వారు ఏమీ చేయలేదో చెప్పడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాజిటివ్‌ ప్రచారం లేకుండా సున్నితమైన అంశాలకే పెద్దపీట లభించింది. పార్టీల ప్రచారాల తీరును గమనించిన తెలంగాణ ప్రజలు మే 13న ఇచ్చే తీర్పులో ఎవరికి పట్టం కట్టుతారో తెలియాలంటే జూన్‌ 4 వరకు వేచి చూడాల్సిందే.

– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ