Rahul Gandhi: ‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే రాహుల్ కి అత్యంత సురక్షిత స్థానం..

Nancharaiah merugumala senior journalist:

అమెఠీలో గుజరాతీ పార్శీల కోడలు స్మృతి చేతిలో రెండోసారి ఓడిపోవడం మరో పార్శీ ప్రముఖుడు ఫిరోజ్‌ గాంధీ మనవడు రాహుల్‌ కు ఇబ్బందికరమే మరి.. ‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే అత్యంత సురక్షిత స్థానం

ఒక గుజరాతీ జొరాస్ట్రియన్‌ (జుబిన్‌ ఇరానీ) భార్య స్మృతి ‘మల్హోత్రా’ ఇరానీ చేతిలో వరుసగా రెండోసారి బాబాయి ఒరిజినల్‌ సీటు అమేఠీలో ఓడిపోవడం ఎందుకో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఇష్టం లేదనుకుంటా. తొలి ప్రధాని పండిత నెహ్రూ ఏకైక అల్లుడిగానే గాక యూపీలో స్థిరపడిన గుజరాతీ జొరాస్ట్రియన్‌ గా కూడా భారత ప్రజలకు తెలిసిన ఫిరోజ్‌ ‘జహంగీర్‌’ గాంధీ మనవడిగా రాహుల్‌ కు మరో జొరాస్ట్రియన్‌ జుబిన్‌ రెండో భార్య, ప్రఖ్యాత నటి స్మృతి చేతిలో పరాజయం పాలవడం అవమానకరంగా కనిపించి ఉండాలి. (ఫిరోజ్‌ గాంధీ అసలు పేరు ఫిరోజ్‌ ఖాన్‌ అని 70 ఏళ్ల నుంచీ సంఘ్‌ పరివారం పగలనకా రేత్తిరనకా దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే) అందుకే ఆయన ‘అమ్మ ఒడి’ గా పరిగణించే రాయ్‌ బరేలీ (తల్లి సోనియా మొన్ననే వదిలి రాజ్యసభకు పోయిన సీటు) నుంచి ఈరోజు నామినేషన్‌ వేయాలని నిర్ణయించుకున్నాడు. నాయనమ్మ ఇందిరా ప్రియదర్శిని మూడుసార్లు (1967, 1971, 1980) గెలిచి, ఒక్కసారి మాత్రమే ఓటమిపాలైనా రాయ్‌ బరేలీ మాత్రం తన తల్లి సోనియాకు పోటీచేసిన ప్రతిసారీ విజయాన్నే అందించింది.

గుజరాతీ కుటుంబంలో నాటి బొంబాయి నగరంలో పుట్టిన గొప్ప పార్లమెంటేరియన్‌ ఫిరోజ్‌ గాంధీ తర్వాత యూపీ ప్రధాన నగరం అలహాబాద్‌ లో స్థిరపడడంతో ఇందిరతో పెళ్లి అయింది. అక్కడికి దాదాపు 125 కి.మీ ఎగువన ఉన్న రాయ్‌ బరేలీ నుంచి 1952, 1957 నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌ సభకు ఎన్నికై దేశానికి ఎనలేని సేవ చేశారు ఫిరోజ్‌ సాహబ్‌. మామ పాలనలోని రెండు భారీ ఆర్థిక కుంభకోణాలు వెలికి తీసి నెహ్రూ కేబినెట్లో ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి గారి రాజీనామాకు కారకులయ్యారు ఫిరోజ్‌. ఒక వేళ నెహ్రూ–గాంధీ కుటుంబానికి కొత్త తరం అల్లుడు రాబర్ట్‌ వాడ్రాకు అమేఠీ నుంచి పోటీచేసే అవకాశం ఇస్తే–ప్రియాంక ప్రియ భర్త కూడా ఆమె తాత ఫిరోజ్‌ గాంధీ దారిలో పార్లమెంటరీ రాజకీయాల్లో పైకొచ్చేవాడేమో. 25% కశ్మీరీ, 25% గుజరాతీ పార్శీ, 50 శాతం ఇటాలియన్‌ రోమన్‌ కేథలిక్‌ శారీరక వారసత్వం ఉన్న వాయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీతో పోల్చితే అంత కంటే ఎక్కువ విభిన్నమైన కుటుంబ నేపథ్యం స్మృతి ఇరానీది. అలాంటి పూర్వ టెలివిజన్, సినీనటి స్మృతి ముందు రాహుల్‌ గాంధీకి పరాజయ భారంతో రెండోసారి తలొంచడం కాస్త ఇబ్బందికరమే మరి. స్మృతి ఇరానీ తండ్రి అజయ్‌ కుమార్‌ మల్హోత్రా ముందే చెప్పినట్టు పంజాబీ ఖత్రీ కాగా, ఆమె తల్లి బెంగాలీ బ్రాహ్మణ మహిళ శిబానీ బాగ్చీ. ఇంకా ఆమె నాయనమ్మ మరాఠీ బ్రాహ్మణ స్త్రీ అయితే, అమ్మమ్మ అస్సామీ మహిళ అని ఎప్పుడో చదువుకున్నా. అందుకే స్మృతికి మతమేగాని కులం లేదంటారు. తన స్నేహితురాలు మోనా ఇరానీ ద్వారా జుబిన్‌ ఇరానీతో ఆమెకు పరిచయం అయింది. అది పెళ్లికి దారితీసింది. మోనా, జుబిన్‌ లు స్నేహపూర్వకంగా విడిపోయారట. జుబిన్‌ తో పరిచయమైన ఏడాది లోపే 2021 మార్చిలో స్మృతికి ఆయనతో బెంగాలీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహమైంది. భర్త జుబిన్‌ విశ్వాసాలు, ఆచరణలో జొరాస్ట్రియన్‌ కాగా, స్మృతి పాపిట సింధూరంతో నిత్యం దర్శనమిచ్చే హిందూ మహిళ. ఆమె తల్లి శిబానీ నాటి భారతీయ జనసంఘ్‌ సభ్యురాలు. తాత రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నేత అని ఇప్పుడే నాకు తెలిసింది.