PawanKalyan: విజయనగరం జిల్లాలో లభించిన అపూర్వ స్వాగతం చూస్తే కూటమి విజయం ఖాయమైపోయిందని అర్ధమైందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. మీ ప్రేమాభిమానాలు చూసి జగన్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. జగన్ లాంటి అవినీతి పరుడు, గూండాను బంగాళా ఖాతంలో కలిపేయాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అవినీతి కోటను బద్ధలు కొట్టి… కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం విజయనగరంలో నిర్వహించిన ప్రజా గళం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “విజయనగరం ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటానని… ఉత్తరాంధ్ర యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం రోడ్ల మీదకు వచ్చారన్నారు. మీ గుండె చప్పుడు వినే… 2022లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని మాట్లాడానని.. అందులో భాగంగానే తెలుగుదేశం- జనసేన- బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్నామని తేల్చిచెప్పారు. మూడు పార్టీలు కలిసి వస్తే జగన్ లాంటి అవినీతిపరుణ్ణి గద్దె దించవచ్చన్నారు. దానికి గుండె బలం, మేధస్సు కావాలని.. ఈ జనసమూహాన్ని చూస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ మార్పును ఎన్నికల్లో చూపించి వైసీపీని ఇంటికి పంపిద్దామని పవన్ పేర్కొన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిశాం..
జనసేన- తెలుగుదేశం- బీజేపీలు కూటమిగా ఏర్పడి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ..ఈ కలయిక తమ స్వార్థం కోసం కాదాని.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమని పవన్ స్పష్టం చేశారు. తాను పిఠాపురంలో నామినేషన్ వేశానని.. అఫిడవిట్ లో తనకు ఎంత ఆస్తి ఉందో చూపించానని..దాదాపు రూ. 75 కోట్లు వరకు పన్నులు కట్టానని పవన్ స్పష్టం చేశారు. తనకు డబ్బులు అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒడిదుడుకుల్లో ఉందని.. అప్పుల్లో కూరుకుపోయిందని… విద్య, వైద్య, ఉపాధి అవకాశాల్లో వెనుకబడిపోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.